
అన్ని కాలాలకూ అనువైన ఆర్థిక సాధనం.. పుత్తడి
సంక్షోభ, విపత్కర పరిస్థితుల్లో కొండంత అండ
పెట్టుబడులకు చక్కని వైవిధ్యం..
తక్కువ వడ్డీపై సులభంగా రుణం
పెట్టుబడుల్లో పసిడికి 10 శాతం వాటా
ఒకవైపు ఈక్విటీలు, క్రిప్టోలు అస్థిరతలను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో డిమాండ్ నీరసించింది. ఇదే కాలంలో బంగారం సైలెంట్‌గా ర్యాలీ చేయడం చూశాం. ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అన్ని కాలాల్లోనూ అత్యుత్తమైన పెట్టుబడి సాధనం ఏదంటే..? అది బంగారమే.
ఈ అర్థంలోనే దీన్ని ‘గోట్ అసెట్’గా చెబుతారు. గడిచిన రెండేళ్లలోనే కాదు.. గత రెండు దశాబ్దాల్లోనూ ఈక్విటీలకు మించి రాబడులను అందించిన పసిడిని ప్రతీ ఇన్వెస్టర్ తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడం మంచి నిర్ణయంగా నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులకు రిస్క్ తగ్గించుకుని, వైవిధ్యం కోసం, రాబడుల స్థిరత్వం కోసం తప్పకుండా పుత్తడికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనంటున్నారు.
భారతీయుల్లో ఎక్కువ మంది బంగారాన్ని ఆభరణంగా, విలువైన సాధనంగానే చూస్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో పెట్టుబడుల పరంగానూ బంగారానికి ప్రాధాన్యం పెరుగుతోంది. అస్థిరతల్లో సురక్షిత సాధనంగా పసిడికి గుర్తింపు ఇప్పుడు వచ్చింది కాదు. చారిత్రకంగా ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే సెంట్రల్ బ్యాంక్‌లు (ఆర్‌బీఐ, ఇతరత్రా) రిజర్వ్ అసెట్‌గా బంగారానికి ఈ మధ్యకాలంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎడాపెడా కొనుగోలు చేస్తున్నాయి. దీనికితోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత పెరిగిపోవడం.. అంతర్జాతీయ వాణిజ్యం పరంగా రక్షణాత్మక ధోరణులు పెరిగిపోతున్న తరుణంలో పసిడి మరింత బలాన్ని సంతరించుకుంది. కనుక ప్రతి ఒక్కరి పెట్టుబడులకు పుత్తడి వన్నెతెస్తుందనేది నిపుణుల మాట.
రాబడుల చరిత్ర..
గత 25 ఏళ్ల కాలంలో పసిడి ఎస్‌అండ్‌పీ 500తోపాటు నిఫ్టీ–50ని మించి రాబడులను ఇచ్చినట్టు ఈక్విటాస్ ఇన్వెస్ట్‌మెంట్స్ చెబుతోంది. 2000 సంవత్సరం నుంచి చూస్తే బంగారం డాలర్ మారకంలో 10 రెట్లు పెరిగింది. ఇదే కాలంలో ఎస్‌అండ్‌పీ 500 రాబడులు నాలుగున్నర రెట్లుగా ఉన్నాయి. రూపాయి మారకంలో చూసినా బంగారం గత 25 ఏళ్లలో 20 రెట్లు పెరగ్గా.. సెన్సెక్స్ ఇదే కాలంలో 16 రెట్లు ప్రతిఫలాన్నిచ్చింది.
ఇక గత 15 ఏళ్లలో చూస్తే బంగారం ఏటా 12 శాతం రాబడులను సగటున ఇచ్చింది. ఇదే కాలంలో సెన్సెక్స్ రాబడి ఏటా 10–11 శాతం మధ్య ఉందన్నది ఈక్విటాస్ ఇన్వెస్ట్‌మెంట్స్ విశ్లేషణ. ‘‘2000 నుంచి నిఫ్టీ కంటే బంగారమే అధిక రాబడిని ఇచ్చింది. గోల్డ్ సీఎఫ్‌డీలు (ఫ్యూచర్ కాంట్రాక్టులు) 2,000 శాతం పెరగ్గా.. నిఫ్టీ–50 సూచీ రాబడి 1470 శాతంగా ఉంది’’ అని జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో చేసిన పోస్ట్‌లో వివరించారు.
పెట్టుబడిలో పుత్తడికి వాటా
పెట్టుబడుల్లో వైవిధ్యం దృష్ట్యా కొంత మొత్తాన్ని పసిడిలోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది మెజారిటీ నిపుణుల సూచన. ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో 10 నుంచి 15 శాతం వరకు బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవచ్చని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా సూచించారు. పసిడే కాదు, వెండి కూడా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేస్తుందని స్టాక్స్‌కార్ట్ (డిస్కౌంట్ బ్రోకర్) సీఈవో ప్రణయ్ అగర్వాల్ అభిప్రాయం. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 5–8 శాతం వరకు పసిడి, వెండికి కేటాయించుకోవచ్చని సూచించారు.
‘‘బంగారం ఒక ప్రత్యామ్నాయ సాధనం. కొత్త రిజర్వ్ కరెన్సీ అని, డాలర్లను భర్తీ చేస్తుందని ఎక్కడో చదివాను. అదే జరిగితే రూ.90,000 ధరకు అర్థమే లేదు’’ అని మార్కెట్ నిపుణుడు సునీల్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. రిజర్వ్ కరెన్సీగా మారితే అప్పుడు బంగారం ఇంకా పెరగొచ్చన్నది ఆయన ఉద్దేశం. ఆర్‌బీఐ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 2024 సెప్టెంబర్ చివరికి 9.32 శాతంగా ఉంటే, 2025 మార్చి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కేంద్ర బ్యాంక్‌లు ఇదే మాదిరి బంగారం
నిల్వలు పెంచుకుంటున్నాయి.
అన్ని కాలాల్లోనూ అత్యుత్తమం ఎందుకు?
సురక్షిత సాధనం: ఆర్థిక సంక్షోభాలు, అనిశి్చతులు, యుద్ధాల వంటి పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది. ఆ సమయంలో ఇందులోకి అధిక పెట్టుబడులు రావడంతో పసిడి మరింత విలువను సంతరించుకుంటుంది. అలాంటి సంక్షోభాల్లో ఈక్విటీలు, రియల్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులు అమ్మకాల ఒత్తిడికి గురవుతుంటాయి. తాజా డిమాండ్ వెనక్కి వెళుతుంది.
స్టోర్ ఆఫ్ వ్యాల్యూ: పసిడిని బీరువాలో ఉంచినా.. బ్యాంక్ లాకర్లో ఉంచినా కొంత కాలానికి దాని విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. అందుకే దీనికి స్టోర్ ఆఫ్ వ్యాల్యూ గుర్తింపు. అదే మిగిలిన పెట్టుబడులకు ద్రవ్యోల్బణం సెగ ఉంటుంది.
పరిమిత సరఫరా: బంగారం ఉత్పత్తి ఏటేటా పెరిగేది కాదు. బంగారం మైనింగ్ అత్యంత సంక్లిష్టమైనది. దీని సరఫరా స్థిరంగానే ఉంటుంది. కానీ, డిమాండ్ మాత్రం ఏటేటా పెరుగుతోంది. ఈ డిమాండ్ పసిడి ధరలకు మద్దతుగా నిలుస్తుంది.
వైవిధ్యం: పెట్టుబడులు అన్నీ ఒకే చోట ఉంటే.. ఆ విభాగంలో సమస్యాత్మక పరిస్థితులు ఏర్పడితే.. విలువకు నష్టం కలుగుతుంది. అందుకే పెట్టుబడులకు వైవిధ్యం కూడా అవసరమే. ఈ విషయంలో పుత్తడి ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనం.
చిటికెలో రుణం: బంగారం కాయిన్లపై (బ్యాంకుల్లో కొనుగోలు చేసిన వాటికే ఇవ్వాలన్నది ఆర్‌బీఐ తాజా ప్రతిపాదన), ఆభరణాలపై 9–10 శాతం మేర వార్షిక వడ్డీపై బ్యాంకుల నుంచి సులభంగా రుణం లభిస్తుంది.
పెట్టుబడి సాధనాలు..
బంగారంలో పెట్టుబడి భౌతికం కంటే డిజిటల్‌గానే సౌకర్యంగా ఉంటుంది. డిజిటల్ సాధనాల్లో గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. ఎంఎంటీసీ తదితర సంస్థల భాగస్వామ్యంతో ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు డిజిటల్ గోల్డ్‌ను రూపాయి నుంచి కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
గోల్డ్ ఈటీఎఫ్‌లు
ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో రోజువారీ ట్రేడ్ అవుతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలే వీటిని నిర్వహిస్తుంటాయి. షేర్ల మాదిరే ఏ పనిదినంలో అయినా కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. డీమ్యాట్ ఖాతా అవసరం. ఇందులో పెట్టుబడి విలువపై ఫండ్ సంస్థకు ఎక్స్‌పెన్స్ రేషియో, కొనుగోలుపై బ్రోకర్లకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక గోల్డ్ ఈటీఎఫ్ ధర గ్రాము బంగారం మార్కెట్ ధరను ప్రతిఫలిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లను ఇప్పుడు చాలా సంస్థలు 0.01 గ్రాముల కింద ఆఫర్ చేస్తున్నాయి. కనుక రూ.90 నుంచి వీటిలో ఫ్రాక్షన్ యూనిట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లను నిర్వహించే సంస్థలు వాటి ఇష్యూ పరిమాణంకు అనుగుణంగా భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి భద్రపరుచుకోవడం తప్పనిసరి.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. డీమ్యాట్ ఖాతాలేకపోయినా గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం సానుకూలత. బ్రోకర్ల సాయం లేకుండా ఫండ్స్ సంస్థ నుంచే కొనుగోలు చేస్తున్నందున బ్రోకరేజీ చార్జీలు పడవు. కాకపోతే ఇందులోనూ ఎక్స్‌పెన్స్ రేషియో చెల్లించాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ సెబీ నియంత్రణల పరిధిలోకి వస్తాయి. కనుక పెట్టుబడులు సురక్షితం.
ఉదాహరణకు ఎస్‌బీఐ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌లో గత పదేళ్లలో రాబడి వార్షికంగా 12.66 శాతంగా ఉంది. నిప్పన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఎస్‌బీఐ గోల్డ్ ఈటీఎఫ్‌లు గత పదేళ్లలో 8.5–9.5 శాతం మధ్య రాబడిని ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
పన్ను బాధ్యత
→ బంగారం కాయిన్లు, బిస్కెట్లు, ఆభరణాలు తదితర భౌతిక రూపంలోని బంగారాన్ని కొనుగోలు చేసి రెండేళ్ల తర్వాత విక్రయించినట్టయితే వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం అవుతుంది. దీనిపై 12.5% పన్ను చెల్లించాలి. రెండేళ్లలోపు విక్రయిస్తే వచ్చిన లాభం స్వల్పకాల మూలధన లాభం అవుతుంది. ఈ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి తమ మొత్తం ఆదాయానికి వర్తించే రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. పాత ఆభరణాన్ని కొత్త ఆభరణంతో మార్చుకుంటే అప్పుడు పాత బంగారాన్ని విక్రయించినట్టుగానే చట్టం పరిగణిస్తుంది. కనుక పాత ఆభరణంపై వచ్చిన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
→ డిజిటల్ గోల్డ్‌కూ భౌతిక బంగారానికి మాదిరే పన్ను రేట్లు వర్తిస్తాయని ట్యాక్స్‌మ్యాన్ డాట్ కామ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాధ్వా తెలిపారు
→ గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌కు సైతం భౌతిక బంగారం నిబంధనలే వర్తిస్తాయి.
→ గోల్డ్ ఈటీఎఫ్‌లను ఏడాదిలోపు విక్రయిస్తే వచ్చిన స్వల్పకాల మూలధన లాభం వార్షిక ఆదాయం కింద చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత విక్రయించినట్టయితే వచ్చిన దీర్ఘకాల మూలధన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
సమీప కాలంలో ధరలు ఎలా ఉండొచ్చు..?
బంగారాన్ని స్వల్పకాల దృష్టితో కొనుగోలు చేయడం సూచనీయం కాదు. తమ అవసరాలు, పెట్టుబడుల కోణంలోనే దీర్ఘకాలానికి నిర్దేశిత పరిమితులకు లోబడి కొనుగోలు చేసుకోవాలి. కానీ, అమెరికా–చైనా మధ్య వాణిజ్య సయోధ్య, ఉక్రెయిన్–రష్యా మధ్య చర్చలకు సానుకూల త నేపథ్యంలో ఆల్‌టైమ్ గరిష్టాల నుంచి బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఔన్స్‌కు అంతర్జాతీయంగా 3,510 డాలర్ల వరకు వెళ్లిన బంగారం ధర 3,180 డాలర్లకు తగ్గింది.
ఇప్పటికీ దీర్ఘకాలానికి బంగారం పట్ల నిపుణులు బుల్లిష్ ధోరణినే వ్యక్తం చేస్తున్నారు. వచ్చే 30–40 రోజుల్లో ఔన్స్ బంగారం ధర 3,150 డాలర్ల స్థాయికి రావొచ్చన్నది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ నవనీత్ దమాని అంచనా. దేశీయంగా 10 గ్రాములకు (24 క్యారెట్లు) రూ. 90,00–91,000 వరకు దిగిరావొచ్చన్నారు. 2,900–3,000 డాలర్ల స్థాయికి సైతం బంగారం అంతర్జాతీయ మార్కెట్లో తగ్గొచ్చని, కొంత కాలం స్థిరీకరణ చెందొచ్చన్న విశ్లేషణులు వినిపిస్తన్నాయి.
భౌతిక బంగారం
కొందరికి డిజిటల్ బంగారంలో పెట్టుబడి నచ్చకపోవచ్చు. భౌతికంగా చూసుకోవడమే ఇష్టం. అలాంటి వారు ఆభరణాలకు బదులు బ్యాంక్‌లు విక్రయించే కాయిన్లను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం అయితే జాగ్రత్త పరుచుకోవడం కొంత రిస్‌్కతో కూడినది. కనుక మొదటి ప్రాధాన్యం డిజిటల్ బంగారానికే ఇవ్వాలి. కాయిన్లు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తే విలువపై 3 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. అదే ఆభరణాలు అయితే జీఎస్‌టీకి అదనంగా తయారీ చార్జీల రూపంలో మరో 5–15 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. తిరిగి అవే ఆభరణాలను మార్చుకోవాలనుకుంటే, వాటిని గతంలో కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన తయారీ చార్జీలు, జీఎస్‌టీ మేర నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు పాత ఆభరణాలను కొత్త వాటితో మారి్పడి చేసుకున్నప్పటికీ.. కొత్త ఆభరణం బరువు ప్రకారమే విలువపై జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. మార్చుకున్న పాత బంగారం మేర జీఎస్‌టీకి మినహాయింపు లేదు.
డిజిటల్ గోల్డ్
ఫోన్‌పే, పేటీఎం తదితర సంస్థలు డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. రూపాయి నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, మిగిలిన డిజిటల్ బంగారం సాధనాలు మాదిరిగా ఇవి సెబీ నియంత్రణలో పనిచేయవు. పైగా వీటి కొనుగోలు, విక్రయంపై చార్జీల విషయంలో పారదర్శకత లేదు.
బంగారాన్ని ఇప్పుడు ఆభరణం కంటే ఎక్కువగా చూస్తున్నారు. సురక్షితమైన లిక్విడ్ అసెట్‌గా, అత్యవసరాల్లో హెడ్జింగ్‌గా పరిగణిస్తున్నారు.
– పృద్వీ రాజ్ కొథారి, రిద్ధిసిద్ధి బులియన్స్ ఎండీ
భారతీయ గృహిణి అత్యంత తెలివైన ఫండ్ మేనేజర్ అనడానికి కాలక్రమంలో బంగారంపై రాబడే నిదర్శనం.
– ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్
– సాక్షి, బిజినెస్‌డెస్క్