7 శాతానికి పెంచిన ఇండియా రేటింగ్స్
గత అంచనా 6.3 శాతమే
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచాలను ప్రముఖ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఎగువకు సవరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.3 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వ్యక్తీకరించగా, తాజాగా దీన్ని 7 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటు (7.8 శాతం) నమోదు కావడం, ప్రపంచ వృద్ధి, వాణిజ్యంపై అమెరికా టారిఫ్‌ల పెంపు ప్రభావం అనుకున్నంత లేకపోవడం 2025–26 వృద్ధి అంచాలను పెంచడానికి కారణాలుగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.8 శాతంగా ఉండొచ్చన్నది ఆర్‌బీఐ అంచనా.
ఇంతకంటే మెరుగ్గా ఇండ్–రా అంచనాలుండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంది. తాము జూలైలో ప్రకటించిన అంచనాల అనంతరం దేశీయంగా, అంతర్జాతీయంగా పరిణామాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నట్టు ఇండ్–రా తెలిపింది. ద్రవ్యోల్బణం చాలా వేగంగా తగ్గుముఖం పట్టడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరగడం, జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణ అంశాలను ఇండ్–రా ముఖ్య ఆర్థికవేత్త దేవేంద్ర కుమార్ పంత్ ప్రస్తావించారు. ముఖ్యంగా జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాలకంటే ఎంతో అధికంగా నమోదు కావడం, అమెరికా టారిఫ్‌ల ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై ఏమంత లేకపోవడం వృద్ధి అంచనాల పెంపులో ప్రధానపాత్ర పోషించినట్టు ఇండ్–రా తెలిపింది.
సానుకూల పరిస్థితులు..
‘‘భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం వేగంగా పట్టాలెక్కడం, శీతాకాలంలో సానుకూల వాతావరణ పరిస్థితులు జీడీపీ వృద్ధి రేటును 7 శాతానికి తీసుకెళతాయి. ఒకవేళ డిమాండ్ కోలుకోవడం (వినియోగం; పెట్టుబడులు) అన్నది అంచనాలకంటే తక్కువగా ఉంటే కనుక అది జీడీపీ వృద్ధి అంచనాలను కిందకు తీసుకెళ్లొచ్చు’’అని ఇండ్–రా తెలిపింది. జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణ, తక్కువ ద్రవ్యోల్బణంతో తుది ప్రైవేటు వినియోగం 2025–26లో 7.4 శాతం పెరగొచ్చని పేర్కొంది. ‘‘అమెరికాకు ఎగుమతులు సెపె్టంబర్‌లో 11.9 శాతం (గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు), అక్టోబర్‌లో 8.9 శాతం చొప్పున తగ్గాయి.
ఎగుమతులు 2024–25లో సగటున నెలవారీ 7.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చూస్తే నెలవారీ సగటు 7.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కానీ సెప్టెంబర్–అక్టోబర్ కాలాన్నే పరిశీలించి చూస్తే నెలవారీ ఎగుమతులు 5.9 బిలియన్ డాలర్లకు (టారిఫ్‌ల కారణంగా) తగ్గాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాకారం కావడం లేదంటే భారత ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను గుర్తించడం అన్నది ఎగుమతులు పుంజుకోవడానికి కీలకం’’అని ఇండ్–రా తన నివేదికలో పేర్కొంది.


