హోమ్ లోన్‌ ఏ వయసులో బెస్ట్‌? | What Is The Right Age To Take A Bank Loan | Sakshi
Sakshi News home page

హోమ్ లోన్‌ ఏ వయసులో బెస్ట్‌?

Jan 10 2026 11:34 AM | Updated on Jan 10 2026 11:41 AM

What Is The Right Age To Take A Bank Loan

బ్యాంక్‌ లోన్‌కు ఈ వయసు కరెక్ట్‌ 

స్థిరమైన ఆదాయంతో భవిష్యత్తు ప్రణాళికలు 

ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది 

లేటు వయసులో గృహ రుణంతో ఒత్తిడి  

ఈరోజుల్లో బ్యాంక్‌ నుంచి గృహ రుణం తీసుకోకుండా ఇల్లు కొనడం అసాధ్యమే. ఆకాశాన్నంటిన భూముల ధరలు, పెరిగిన నిర్మాణ వ్యయాలతో అపార్ట్‌మెంట్ల ధరలు రూ.కోట్లలో ఉంటున్నాయి. దీంతో పొదుపు చేసిన సొమ్ముతో పాటు గృహ రుణం తీసుకుంటే తప్ప ఇల్లు సొంతమయ్యేలా లేదు. అయితే ఏ వయసులో హోమ్‌ లోన్‌ తీసుకుంటే ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయో ముందుగానే కొంత అవగాహన కలిగి ఉండటం బెటర్‌. రుణానికి అర్హత ఉంది కదా అని ఏ వయసులో పడితే ఆ వయసులో గృహ రుణం తీసుకుంటే లేనిపోని చికాకులు, మానసిక ఒత్తిళ్లకు లోను కావాల్సి వస్తోందని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. 

సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పైసా పైసా కూడబెడుతుంటారు. ఖర్చులను ఆదుపులో పెట్టుకొని పొదుపుపై దృష్టి పెడుతుంటారు. అయితే మన సొంతింటి కలకు బ్యాంక్‌లు లోన్‌ రూపంలో సహకారం అందిస్తుంటాయి. వడ్డీ రేట్లు కూడా అందుబాటులోనే ఉండటంతో ప్రతి ఒక్కరూ గృహ రుణం వైపు మొగ్గు చూపిస్తుంటారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) 2.0 అమలులోకి వచ్చాక పన్ను విధానం సరళతరమైంది. స్టీల్, శానిటరీ ఉత్పత్తులు, రంగులు వంటి నిర్మాణ సామగ్రిపై పన్ను శ్లాబ్‌లు తగ్గాయి. ఇది గృహ కొనుగోలుదారులకు డిస్కౌంట్‌గానే కాకుండా దీర్ఘకాలంలో పొదుపుగా మారుతుంది.  

30 ఏళ్ల వయసులో రుణం.. 
సాధారణంగా ఇంటి యాజమాన్యానికి దాదాపు 30 సరైన వయసు. ఈ వయస్సులో చాలా మంది తమ కెరీర్‌ మార్గాలు, స్థిరమైన ఆదాయం, భవిష్యత్తు ఖర్చుల గురించి బాగా అర్థం చేసుకుంటారు. అలాగే కుటుంబాలతో స్థిరపడాలని ప్లాన్‌ చేసుకుంటారు కాబట్టి గృహ రుణం దీర్ఘకాలిక ఆర్థిక నిబద్ధతను తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. కెరీర్‌ ప్రారంభంలోనే అంటే 25–30 ఏళ్ల వయస్సులోనే గృహ రుణం తీసుకుంటే ఈఎంఐ ఎక్కువ కాలపరిమితి తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో జేబుకు అధిక భారం కాకుండా తక్కువ ఈఎంఐ చెల్లించే వీలుంటుంది. కెరీర్‌ ప్రారంభంలోనే ఉండటంతో సిబిల్‌ స్కోర్‌కు కూడా మెరుగ్గా ఉంటుంది. దీంతో ఎక్కువ రుణం తీసుకునే వీలుతో పాటు కొంత వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. 750కు మించి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నప్పుడే బ్యాంక్‌ రుణం తేలిగ్గా లభిస్తుంది. ఇక క్రెడిట్‌ స్కోర్‌ 800 దాటితే వడ్డీలోనూ 0.5 శాతం వరకూ తగ్గింపులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా క్రెడిట్‌ స్కోర్‌ ఎక్కువగా ఉంటే కాస్త ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునేందుకు వీలవుతుంది. 

నలభైలో ఒత్తిళ్లు.. 
ఉద్యోగ విరమణ లేదా జీవితంలో చివరి దశలో 40– 50 ఏళ్ల వయసు ప్రారంభంలో ఇల్లు కొనడమనేది కొంత సవాళ్లతో కూడుకున్న అంశం. సాధారణంగా గృహ రుణ కాలపరిమితి 20 సంవత్సరాలకు మించి ఉంటుంది కాబట్టి జీవితంలోని ఈ దశలో నెలవారీ వాయిదా(ఈఎంఐ) భారం ఒత్తిడితో కూడుకున్నది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి ఇతర బాధ్యతలు వంటి అధిక ఖర్చులుండే వయసులో ఈఎంఐ లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏమైనా అనుకోని ఘటన జరిగితే 
సొంతిల్లుని బ్యాంక్‌ జప్తు చేసుకుంటుంది. కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుంది.  

అద్దెకూ వయసుందీ.. 
ఇల్లు కొనడమనేది వ్యక్తి ఆర్థిక సంసిద్ధత, స్థిరత్వం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సొంతిల్లు ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపును, హోదాను తీసుకొస్తుంది. భవిష్యత్తుకు భద్రతా భావాన్ని అందిస్తుంది. అయితే ప్రాపరీ్టని కొనడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి అనువైన సమయం ఎక్కువగా వ్యక్తి వ్యక్తిగత పరిస్థితులు లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. 20 ఏళ్ల వయసు ప్రారంభంలో అద్దెకు తీసుకోవడం ఆచరణాత్మకమైంది. ఎందుకంటే యువ నిపుణులు స్థిరమైన ఆదాయం కోసం పలు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయతి్నస్తుంటారు. ఉద్యోగ రీత్యా తరచూ నగరాలను మారుతుంటారు. అందుకే ఆర్థికంగా సిద్ధంగా ఉన్నవారు ఈ దశలో ఇల్లు కొనడాన్ని ఎంచుకోవచ్చు.

ఉమ్మడి రుణం.. తగ్గును భారం.. 
కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువమంది సంపాదిస్తుంటే ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవచ్చు. దీంతో ఇంటి కొనుగోలుకు అధిక మొత్తంలో బ్యాంక్‌ లోన్‌ లభిస్తుంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఈ ఉమ్మడి రుణం తీసుకోవచ్చు. రుణ అర్హత పెరగడమే కాకుండా ఈఎంఐ భారాన్ని పంచుకోవచ్చు. ఇంటి కొనుగోలుకు సంబంధించి అధిక మొత్తంలో బ్యాంక్‌ లోన్‌ అవసరమైనప్పుడు వ్యవధి వీలైనంత ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలి. దీంతో నెలవారి చెల్లించే ఈఎంఐ భారం తగ్గి, మీ రుణం పెరుగుతుంది. కాకపోతే వడ్డీ భారం అధికంగా ఉంటుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement