
5.5 శాతం వృద్ధికి పరిమితం
ముంబై: పరిశ్రమలకు బ్యాంకుల రుణ సాయంలో వృద్ధి జూన్ 26తో ముగిసిన పక్షం రోజుల్లో 5.5 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.7 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఆహారేతర పరిశ్రమలకు రుణ సాయం 10.2 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 13.8 శాతం వృద్ధి చెందింది. 41 షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డేటా ఆధారంగా ఈ వివరాలను ఆర్‌బీఐ విడుదల చేసింది.
‘‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రుణ వితరణ స్థిరంగా పెరుగుతోంది. ప్రధాన రంగాల్లో ఇంజనీరింగ్, నిర్మాణం, టెక్స్‌టైల్స్‌కు రుణ వితరణ మెరుగైంది’’అని ఆర్‌బీఐ తెలిపింది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం రుణ సాయం నిదానించింది. 6.8 శాతం వృద్ధికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే పక్షం రోజుల్లో ఈ రంగాలకు రుణ వితరణ 17.4 శాతం పెరిగినట్టు ఆర్‌బీఐ డేటా స్పష్టం చేసింది. సేవల రంగానికి రుణ వితరణ 9.6 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 15.1 శాతం వృద్ధితో పోల్చి చూస్తే తగ్గుముఖం పట్టింది.