ఇంధన రిటైలింగ్, మొబిలిటీ సంస్థ జియో-బీపీ తాజాగా ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా వినూత్నమైన ’యాక్టివ్’ టెక్నాలజీ పెట్రోల్‌ని ఆవిష్కరించింది. కీలకమైన ఇంజిన్ విడిభాగాలను శుభ్రంగా ఉంచుతూ, పనితీరును మెరుగుపరుస్తూ, మెయింటెనెన్స్ వ్యయాలను తగ్గిస్తూ, అదనంగా ఖర్చులేమీ లేకుండా వాహనం ఏటా మరో 100 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఉపయోగపడేలా ఈ ఇంధనం ఉంటుందని సంస్థ తెలిపింది.
మోటర్‌సైకిల్‌లో నింపి, కోయంబత్తూరులోని టెస్ట్ ట్రాక్‌లో 4,000కు పైగా కి.మీ. మేర దీని సామర్థ్యాలను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు సంస్థ చైర్మన్ సార్థక్ బెహూరియా తెలిపారు. దేశీయంగా వాహనదారులు సాఫీగా నడిచే, విశ్వసనీయమైన, తక్కువ మెయింటెనెన్స్ ఉంటూ ఇంధనంపై అదనంగా వెచి్చంచకుండా ఎక్కువ మైలేజీ ఉండాలని కోరుకుంటారని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే జియో–బీపీ యాక్టివ్ టెక్నాలజీ పెట్రోల్‌ని రూపొందించినట్లు వివరించారు. దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ దిగ్గజం బీపీ కలిసి జియో–బీపీని జాయింట్ వెంచరుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.


