ద్రవ్యలోటు పెరుగుతోంది జాగ్రత్త! | RBI warns on Telangana state financial situation | Sakshi
Sakshi News home page

ద్రవ్యలోటు పెరుగుతోంది జాగ్రత్త!

Jan 25 2026 4:36 AM | Updated on Jan 25 2026 4:36 AM

RBI warns on Telangana state financial situation

ఇది ఆర్థిక దుర్బలత్వానికి దారితీయొచ్చు.. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్‌బీఐ హెచ్చరిక 

సింకింగ్‌ ఫండ్‌ అంతంతే.. విద్య, వైద్య ఖర్చు మెరుగుపడాల్సిందే 

రాష్ట్రంలోకి వలసలను ఆహ్వానించాల్సిందే.. మహిళలకు మరింత ఉపాధి కల్పించాలి 

అప్పులు, మద్యం ఆదాయంపై ఎక్కువగా ఆధారపడొద్దు 

సబ్సిడీల హేతుబద్ధీకరణ జరగాలి.. ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి 

2036 నాటికి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు 17 శాతానికి..

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయంలో పెరుగుదల నెమ్మదించడం, మూలధన వ్యయం పెరుగుతున్న కారణంగా తెలంగాణ ద్రవ్యలోటు ఏటేటా పెరుగుతోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అభిప్రాయపడింది. మూలధన వ్యయం కోసం వడ్డీరహిత రుణాలను కేంద్రం అందిస్తున్నప్పటికీ క్రమంగా పెరుగుతున్న అప్పుల పద్దు, ఆకస్మికంగా చేయాల్సి వస్తున్న అప్పులు వెరసి ద్రవ్యలోటు పెరుగుతున్న రాష్ట్రాల్లో పరిస్థితి ఆర్థిక దుర్బలత్వానికి దారితీస్తోందని వెల్లడించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతానికి పదిలంగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోకుంటే పరిస్థితులు చేజారే అవకాశం ఉంటుందని పేర్కొంది. 

దీర్ఘకాలిక రుణాలు తీసుకోవడం ప్రస్తుతానికి బాగానే కనిపించినా భవిష్యత్‌ తరాలపై మాత్రం అది తీరని భారం మోపుతుందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ‘స్టేట్‌ ఫైనాన్సెస్‌: ఏ స్టడీ ఆఫ్‌ బడ్జెట్స్‌ ఆఫ్‌ 2025–26’పేరుతో తాజా నివేదిక విడుదల చేసింది. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ఆర్థిక సూచీలను పోలుస్తూ ఈ నివేదికలో ఆయా రాష్ట్రాల వాస్తవ పరిస్థితులను వివరించింది. బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పులు సమకూర్చుకునే క్రమంలో రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబట్టింది. అన్ని రాష్ట్రాలు అప్పులు, మద్యం ఆదాయాలపై ఆధారపడొద్దని.. సబ్సిడీలను హేతుబద్ధీకరించడంతోపాటు ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించాలని సూచించింది. 

ప్రస్తుతానికి సేఫ్‌... 
బహిరంగ మార్కెట్‌ ద్వారా రుణాల సేకరణ కోసం పూచీకత్తుగా పెడుతున్న సెక్యూరిటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని ఆర్‌బీఐ పేర్కొంది. సెక్యూరిటీ కింద పెట్టిన బాండ్లకు సంబంధించిన అప్పును దీర్ఘకాలంలో తీర్చుకునే వెసులుబాటు తీసుకుంటోందని తెలిపింది. ఇప్పటివరకు మార్కెట్‌లో పూచీకత్తు కింద పెట్టిన వాటిలో 20 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించేలా 28.2 శాతం బాండ్లు ఉన్నాయని వెల్లడించింది. అయితే ఇది తాత్కాలికంగా కొంత ఉపశమనం కలిగించినా భవిష్యత్తు తరాలపై మాత్రం అప్పుల భారాన్ని మోపుతుందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. 

అలాగే 10–20 ఏళ్లలోపు చెల్లించే విధంగా 41.6 శాతం, 5–10 ఏళ్లలో చెల్లించేలా 12.3 శాతం, 5 ఏళ్లలో చెల్లించేలా 13.3 శాతం సెక్యూరిటీలను తెలంగాణ రాష్ట్రం పూచీకత్తుగా పెట్టగా ఏడాదిలోగా చెల్లించాల్సినవి 4.6 శాతం ఉన్నట్లు నివేదికలో ఆర్‌బీఐ వివరించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న అప్పులతో పోలిస్తే కన్సాలిడేటెడ్‌ సింకింగ్‌ ఫండ్‌ (సీఎస్‌ఎఫ్‌) మొత్తం చాలా తక్కువగా ఉందని.. మొత్తం అప్పుల్లో 1.8 శాతం (రూ. 8,019 కోట్లు) మాత్రమే సీఎస్‌ఎఫ్‌ కింద రాష్ట్రం రిజర్వ్‌ చేసిందని ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. కర్ణాటక, మహారాష్ట్రతో సహా దేశంలోని 17 రాష్ట్రాలు మనకంటే ఎక్కువగా ఈ రిజర్వు నిధులను కలిగి ఉన్నాయని తెలిపింది.  

2036 నాటికి రాష్ట్రంలో 17 శాతం వృద్ధులు.. 
తెలంగాణలో 2036 నాటికి వృద్ధుల (60 ఏళ్లు దాటిన వారు) జనాభా 17.1 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ తన నివేదికలో అంచనా వేసింది. గత 25 ఏళ్లతో పోలిస్తే ఇది 7.9 శాతం పెరిగిందని పేర్కొంది. అదే సమయంలో ఈ ఏడాది నాటికి పనిచేసే వయసులో ఉన్న వారు 67.8 శాతం ఉండగా 2031కల్లా 67.4 శాతానికి, 2036 నాటికి 66.7 శాతానికి తగ్గుతారని ఆర్‌బీఐ నివేదిక తెలిపింది.  

ఆర్‌బీఐ నివేదికలోని ముఖ్యాంశాలు..  
– రాష్ట్ర ద్రవ్యలోటు ఏటేటా పెరుగుతోంది. ఆదాయం తక్కువగా వస్తుంటే ఖర్చు ఎక్కువ అవుతోంది. దీంతో ద్రవ్యలోటు నమోదవుతోంది. 2023–24లో రూ. 49,963 కోట్లు, 2024–25లో రూ. 46,764 కోట్లు, 2025–26 అంచనాల ప్రకారం రూ. 54 వేల కోట్లుగా ద్రవ్యలోటు తేలింది. 
– అప్పులకు వడ్డీల చెల్లింపు కింద రాష్ట్రం గత మూడేళ్లలో రూ. 60 వేల కోట్ల వరకు చెల్లించాల్సి వచి్చంది. 2025–26లో రూ.19,260 కోట్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా. 
– రాష్ట్రంలో పనిచేసే వారి సంఖ్య తగ్గుతున్నందున వలసలను ప్రోత్సహించాల్సిందే. ఇప్పటికే తెలంగాణలో ఇతర రాష్ట్రాల ప్రజల సంఖ్య పెరుగుతోంది. మహిళలకు ఉపాధి కల్పించడంపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

– కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 2023–24లో రూ.35,192 కోట్లుగా ఉంటే 2024–25లో రూ. 48,724 కోట్లు వచ్చాయి. 2025–26లో రూ. 56,130 కోట్లు వస్తాయని అంచనా. 
– అభివృద్ధి పనుల కోసం జరుగుతున్న ఖర్చు తెలంగాణలో ఏటేటా పెరుగుతోంది. రెవెన్యూ, మూల ధన వ్యయంతోపాటు అభివృద్ధి పనుల కోసం తీసుకునే రుణాలను కలిపి ఈ ఖర్చు కింద పరిగణిస్తారు. 2023–24లో 1.62 లక్షల కోట్లు, 2024–25లో రూ. 2.03 కోట్లు అభివృద్ధి నిధుల కింద ఖర్చు కాగా, 2025–26లో 2.34 లక్షల కోట్లు ఖర్చవుతుందనే అంచనాలున్నాయి. అదే సమయంలో అభివృద్ధేతర నిధుల ఖర్చు తగ్గుతోంది. 2023–24లో రూ. 56 వేల కోట్లకుపైగా ఇందుకోసం ఖర్చుకాగా, 2024–25లో రూ. 45,894 కోట్లు ఖర్చయింది. 2025–26లో ఈ ఖర్చు రూ.50వేల కోట్లు దాటుతుందని అంచనా.  

– రాష్ట్రం మార్కెట్‌ రుణాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. 2023–24లో రూ. 49,618 కోట్లను బహిరంగ మార్కెట్‌ రుణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించగా అది 2024–25లో రూ. 56,209 కోట్లకు చేరింది. 
– 2015–16 నుంచి 2024–25 వరకు పట్టణాభివృద్ధి కోసం ఎక్కువగా ఖర్చు చేస్తోన్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మనతో పాటు ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాలు ఎక్కువగా ఖర్చు పెట్టాయి. ఆయా రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల జనాభా పెరుగుతుండటంతో వారికి గృహ, రవాణా, మౌలిక సదుపాయాల కోసం ఈ మేరకు వెచ్చిస్తున్నాయి. సాగునీటి రంగంపైనా తెలంగాణ భారీగా ఖర్చు చేస్తోంది. అయితే విద్య, వైద్య రంగాల్లో ఖర్చు మాత్రం పెరగాల్సి ఉంది.  

– రాష్ట్ర సొంత ఆదాయంతోపాటు రెవెన్యూ వ్యయం 2023–24లో 80 శాతం నమోదవగా 2024–25లో 79.1 శాతంగా నమోదైంది. 2025–26లో అది 78 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. అప్పులకు వడ్డీల చెల్లింపు కూడా గత రెండేళ్లతో పోలిస్తే తగ్గినట్లు పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement