న్యూయార్క్ సిటీ బడ్జెట్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా, నగర మేయర్ జోహ్రాన్ క్వామే మమ్దానీ ప్రజలకు బడ్జెట్ ప్రాముఖ్యతను వివరించారు. నగర బడ్జెట్ అనేది కేవలం సంఖ్యల పట్టిక మాత్రమే కాదని, అది ప్రజల దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని ఆయన తెలిపారు.
“బడ్జెట్ అనేది ఒక స్ప్రెడ్‌షీట్ కాదు. లైబ్రరీలు తెరిచి ఉంటాయా లేదా, కుటుంబాలు చైల్డ్‌కేర్‌ను భరించగలుగుతాయా అనే విషయాలను ఇది నిర్ణయిస్తుంది,” అని మమ్దానీ అన్నారు. “ఇది మన విలువల ప్రతిబింబం, మనం నిర్మించాలనుకుంటున్న నగరానికి ఒక ప్రకటన.”
న్యూయార్క్ సిటీలో రెండు రకాల బడ్జెట్లు ఉన్నాయి. ‘క్యాపిటల్ బడ్జెట్’ ద్వారా పార్కులు, పాఠశాలలు వంటి దీర్ఘకాలిక అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తారు. ‘ఎక్స్‌పెన్స్ బడ్జెట్’ ద్వారా అద్దె సహాయం, శానిటేషన్ సిబ్బంది నియామకం, ఇతర ముఖ్యమైన నగర సేవలకు ఖర్చు చేస్తారు. ఈ వివరణలో మమ్దానీ ప్రధానంగా ఎక్స్‌పెన్స్ బడ్జెట్‌పై దృష్టి పెట్టారు.
ఇతర నగరాలతో పోలిస్తే, న్యూయార్క్ సిటీ బడ్జెట్ ప్రక్రియ ప్రత్యేకమైనది. ఇక్కడ ఒక్క బడ్జెట్ మాత్రమే కాకుండా నాలుగు దశల్లో బడ్జెట్‌ను విడుదల చేస్తారు. మొదటగా ప్రిలిమినరీ బడ్జెట్ విడుదల అవుతుంది. ఇందులో నగరానికి అందుబాటులో ఉన్న ఆదాయం, రాబోయే సంవత్సరాల్లో చేయాల్సిన ఖర్చుల అంచనాలు ఉంటాయి. ఈ బడ్జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, తదుపరి సంవత్సరం, ఇంకా మూడు భవిష్యత్ సంవత్సరాల అంచనాలను కూడా కలిగి ఉండాలి. ఇది 1970ల ఆర్థిక సంక్షోభం తర్వాత తీసుకొచ్చిన సంస్కరణల ఫలితం.
ప్రిలిమినరీ బడ్జెట్ తర్వాత సిటీ కౌన్సిల్ విచారణలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించి తమ ప్రాధాన్యాలను ప్రతిపాదిస్తుంది. మే నెలలో ‘ఎగ్జిక్యూటివ్ బడ్జెట్’ విడుదలవుతుంది. ఇందులో సవరించిన ఖర్చుల ప్రణాళిక ఉంటుంది. అనంతరం మరోసారి కౌన్సిల్ విచారణలు జరిగి, చర్చలు ప్రారంభమవుతాయి.
జూన్ చివరికి సిటీ కౌన్సిల్ బడ్జెట్‌పై ఓటింగ్ నిర్వహిస్తుంది. మేయర్, కౌన్సిల్ మధ్య అధికారిక అంగీకారం తర్వాత బడ్జెట్ ఖరారవుతుంది.
రాష్ట్ర బడ్జెట్ కూడా నగర బడ్జెట్‌పై ప్రభావం చూపుతుందని మమ్దానీ గుర్తు చేశారు. ఆల్బనీ (రాష్ట్ర ప్రభుత్వం) తీసుకునే నిర్ణయాలు నగరం ఏం చేయగలదో నిర్ణయిస్తాయి. ఫెడరల్ ప్రభుత్వంలా కాకుండా, న్యూయార్క్ సిటీ లోటు బడ్జెట్ నడపడానికి చట్టపరంగా అనుమతి లేదు. అందువల్ల అన్ని ఖర్చులు అందుబాటులో ఉన్న ఆదాయంతోనే కప్పబడాలి.
బడ్జెట్ ప్రక్రియలో పెద్ద లోటులు రాకుండా చూసుకోవడమే తమ లక్ష్యమని, సాధ్యం కాని హామీలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు.
“ఈ బడ్జెట్ మీ భవిష్యత్.. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకునే హక్కు మీకు ఉంది” ” అంటూ న్యూయార్క్ నగరవాసులను ఉద్దేశించి మమ్దానీ పేర్కొన్నారు.
The City’s budget is our future. And you deserve to know how it works. pic.twitter.com/W2GtYgRYFS
— Mayor Zohran Kwame Mamdani (@NYCMayor) January 30, 2026


