కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే రోజున దేశమంతా వివిధ శాఖలకు కేటాయింపుల గురించి చర్చించుకుంటుంటే ఫ్యాషన్ ప్రియులు, చేనేత వస్త్రాల ప్రేమికులు మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరపై దృష్టి సారిస్తున్నారు. ఏటా ఆమె ధరించే చీర భారతీయ సంస్కృతిని, వైవిధ్యాన్ని చాటిచెప్పడమే కాకుండా దేశీయ చేనేత కళాకారులకు ఇచ్చే గౌరవంలా కనిపిస్తుంది. ఈ కథనంలో గడిచిన ఎనిమిది బడ్జెట్ సెషన్లలో (2019 నుంచి 2025 వరకు) నిర్మలమ్మ ధరించిన చీరల ప్రత్యేకతలు తెలుసుకుందాం.
2019: మంగళగిరి చేనేత వైభవం
తొలి బడ్జెట్ ప్రసంగం కోసం నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగళగిరి చేనేత చీరను ఎంచుకున్నారు. బంగారు రంగు అంచు ఉన్న ఈ గులాబీ రంగు చీర ఆరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
2020: కంచి పట్టు సంప్రదాయం
రెండో బడ్జెట్ సమయంలో ఆమె దక్షిణ భారత దేశ సంప్రదాయానికి నిలువుటద్దమైన కంచి పట్టు చీరలో మెరిశారు. పవిత్రతకు, శ్రేయస్సుకు సూచిక అయిన పసుపు రంగు చీరను ధరించి సభలో హుందాతనాన్ని చాటారు.

2021: పోచంపల్లి ఇక్కత్ కళ
తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను 2021 బడ్జెట్ సందర్భంగా ఆమె ధరించారు. ఎరుపు, ఆఫ్-వైట్ కలయికతో ఉన్న ఈ చీరపై ఉన్న ఆకర్షణీయమైన గ్రీన్ బోర్డర్ దేశీయ చేనేత కళాకారుల ప్రతిభను ప్రతిబింబించింది.
2022: బొంకాయ్ సిల్క్
ఒడిశా రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ బొంకాయ్ శైలి చీరను 2022లో ఆమె ఎంచుకున్నారు. రస్ట్ బ్రౌన్ రంగులో ఉండి మెరూన్ బోర్డర్, సిల్వర్ జరీతో ఉన్న చీరను ధరించారు.
2023: కసూతి ఎంబ్రాయిడరీ
2023 బడ్జెట్ రోజున కర్ణాటక సంస్కృతిని ప్రతిబింబించే కసూతి ఎంబ్రాయిడరీ చీరలో ఆమె కనిపించారు. ఎరుపు రంగు చీరపై నలుపు రంగు టెంపుల్ బోర్డర్, చేతితో అల్లిన ప్రత్యేకమైన కసూతి వర్క్ ఆకర్షణీయంగా నిలిచింది.
2024 (మధ్యంతర బడ్జెట్): బెంగాల్ కాంతా వర్క్
2024 ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కోసం ఆమె పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంతా ఎంబ్రాయిడరీ ఉన్న ఇండిగో బ్లూ రంగులో ఉన్న సిల్క్ చీరను ధరించారు. ‘రామా బ్లూ’గా పిలిచే ఈ రంగు ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని సూచించింది.
2024 (పూర్తి స్థాయి బడ్జెట్): మంగళగిరి పట్టు పునరావృతం
మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ఆమె మళ్లీ మంగళగిరి పట్టు చీరను ఎంచుకున్నారు. ఆఫ్-వైట్ రంగులో ఉండి పర్పుల్, గోల్డ్ బోర్డర్ ఉన్న చీరను ధరించారు.
2025: మధుబని చిత్రకళా సౌరభం
2025 బడ్జెట్ సెషన్‌లో బిహార్‌కు చెందిన సుప్రసిద్ధ మధుబని పెయింటింగ్ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీమ్ కలర్ సిల్క్ చీరపై పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి స్వయంగా వేసిన చిత్రకళతో ఈ చీర రూపొందించారు.


