కొత్త విద్యుత్ బిల్లింగ్ విధానంతో పరిశ్రమలపై పెనుభారం
రూ.వేలల్లో బిల్లులు వచ్చేచోట ఏకంగా రూ.లక్షల్లో..
3 నుంచి 5 రెట్లు అదనపు వసూళ్లు
ఆఫ్ పీక్ అవర్స్‌లో రాయితీ కూడా తొలగింపు
ప్రతినెలా రూ.500 కోట్ల మేర భారం పడుతుందంటున్న పారిశ్రామిక వర్గాలు
పవర్ ఫ్యాక్టర్ విధానంపై పెదవి విరుస్తున్న వైనం..
అవగాహన కల్పించకుండా అమలు చేశారంటూ అసంతృప్తి.. పాత పద్ధతిలో బిల్లుల చెల్లింపు కోసం విజ్ఞాపనలు
పవర్ ఫ్యాక్టర్ స్థిరత్వం కోసమేనంటున్న డిస్కమ్‌లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ఓ పారిశ్రామిక వాడలో గత నెలలో రూ.39వేలు విద్యుత్ బిల్లు చెల్లించిన పరిశ్రమకు కొత్త విధానంలో రూ.3.50 లక్షల బిల్లు జారీ అయింది. ప్రతీ నెలా రూ.5 లక్షల కరెంటు బిల్లు చెల్లించే మరో పరిశ్రమకు ఏకంగా రూ.25 లక్షలు చెల్లించాలని బిల్లు వచ్చింది. పవర్ ఫ్యాక్టర్ పేరుతో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) తెచ్చిన నూతన బిల్లింగ్ విధానం పరిశ్రమల గుండెల్లో గుబులు రేపుతోంది. కొత్త బిల్లింగ్ విధానం పెనుభారం మోపుతోందని పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు వాపోతున్నాయి. మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా బిల్లులు చెల్లించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)లు రూ.వేల కోట్లు అదనంగా వసూలు చేయడంపైనే దృష్టి పెట్టాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. కొత్త బిల్లింగ్ అమలుకు కొంత సమయం ఇవ్వాలని, తమతో చర్చించిన తర్వాత దశల వారీగా అమలు చేయాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి.
పవర్ ఫ్యాక్టర్ నియంత్రణ కోసం..
టీజీఈఆర్‌సీ 2025–26 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు కొత్త కేవీఏహెచ్ (కిలో ఓల్ట్ యాంపియర్ అవర్) బిల్లింగ్ విధానాన్ని అమలు చేయాలని డిస్కమ్‌లను ఆదేశించింది. హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ కిందకు వచ్చే వినియోగదారుల విద్యుత్ వినియోగం (పవర్ ఫ్యాక్టర్) స్థిరంగా (విద్యుత్ పరిభాషలో ఒక యూనిటీకి సమానం లేదా కొంచెం తక్కువ) ఉంచేందుకు నూతన బిల్లింగ్ విధానం దోహదపడుతుందని చెప్పింది. పవర్ ఫ్యాక్టర్ స్థిరంగా ఉంచేందుకు ఈ ఏడాది మార్చిలోగా ‘ఆటోపవర్ ఫ్యాక్టర్ కంట్రోల్ ప్యానెల్స్’ (ఏపీఎఫ్‌సీపీ) మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని పరిశ్రమలను డిస్కమ్‌లు ఆదేశించాయి. ఈ నూతన బిల్లింగ్ విధానం గత డిసెంబర్ నుంచి అమలు కాగా.. జనవరి మొదటి వారం నుంచి పరిశ్రమలకు విద్యుత్ బిల్లులు జారీ అవుతున్నాయి. మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా బిల్లులు వస్తున్నాయంటూ ఆయా వర్గాలు డిస్కమ్ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలపై ప్రతి నెలా రూ.500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని వాపోతున్నాయి.
కొత్త విధానం ఎందుకంటే..
గతంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు కిలో వాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్) ఆధారంగా కేవీఏహెచ్ (కిలో ఓల్ట్ యాంపియర్ అవర్) బిల్లింగ్ విధానం ఉండేది. ఈ విధానంలో వినియోగించిన విద్యుత్‌కు మాత్రమే బిల్లులు వేస్తారు. కిలో ఓల్ట్ యాంపియర్ రియాక్టివ్ అవర్ (కేవీఏఆర్‌హెచ్)ను పరిగణనలోకి తీసుకునే వారు. కేవీఆర్‌ఎహెచ్ అంటే మోటార్ల లాంటి యంత్రాలు ఆన్‌లో లేకున్నా పరోక్షంగా కొంత విద్యుత్‌ను వినియోగించుకుంటాయి. దీనిని రియాక్టివ్ ఎనర్జీగా పరిగణిస్తారు. దీన్ని బిల్లుల వసూలులో పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఈ రియాక్టివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల గ్రిడ్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుంది. దీంతో పవర్ ఫ్యాక్టర్‌ను స్థిరీకరించేందుకు ‘ఆటో పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్ ప్యానెల్స్’ ఏర్పాటు చేసుకోవాలని పరిశ్రమలను డిస్కమ్‌లు ఆదేశించాయి. ఈ ప్యానెల్స్ రియాక్టివ్ ఎనర్జీని కూడా యూనిట్లుగా లెక్కిస్తాయి. అందువల్ల పరిశ్రమలు వినియోగించే విద్యుత్ యూనిట్లు పెరుగుతాయి. దీంతో బిల్లులు భారమవుతున్నాయి. ప్యానెల్స్‌లోని కెపాసిటర్లు రియాక్టివ్ ఎనర్జీ పవర్ ఫ్యాక్టర్ ఒక యూనిటీని మించకుండా చూస్తాయి. తద్వారా గ్రిడ్‌పై హెచ్చుతగ్గుదల ప్రభావం పడకుండా నెట్‌వర్క్‌లో ఓల్టేజీ సమస్యలు పరిష్కారమవుతాయని అంటున్నారు.
ఇందులోనూ మార్పులు..
కొత్త బిల్లింగ్ విధానంతోపాటు గతంలో అమలు చేసిన టైమ్ ఆఫ్ డే (టీఓడీ) టారిఫ్ విధానంలోనూ డిస్కమ్‌లు మార్పులు చేశాయి. టీఓడీ టారిఫ్‌లో పీక్ అవర్స్ (ఉదయం 6 నుంచి రాత్రి 10వరకు)లో పరిశ్రమల విద్యుత్ వినియోగంపై ఒక్కో యూనిట్‌పై అదనంగా రూ.1 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఆఫ్ పీక్ అవర్స్ (రాత్రి 10 నుంచి ఉదయం 6వరకు)లో ఒక్కో యూనిట్ వినియోగంపై రూ.1.50 చొప్పున రాయితీ ఉండేది. ఇటీవల టీఓడీలోనూ మార్పులు చేస్తూ పీక్ అవర్స్‌లో వినియోగంపై అదనపు వసూలును కొనసాగిస్తూనే, ఆఫ్ పీక్ అవర్స్‌లో వినియోగించే విద్యుత్‌పై రాయితీని తొలగించారు. టీఓడీ టారిఫ్‌లో మార్పులతోనూ అదనపు భారం పడుతోందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.
గడువు కోరుతున్న యజమానులు
కొత్త మెకానిజం ఏర్పాటు చేసుకునేంత వరకు పాత పద్ధతిలోనే బిల్లులు చెల్లించేలా వెసులుబాటు ఇవ్వాలని పరిశ్రమల యజమానులు డిస్కమ్‌లను కోరుతున్నారు. దీంతో వరంగల్, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని రైస్ మిల్లర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్) వెసులుబాటు కల్పిస్తూ రెండు నెలల్లోగా ఏపీఎఫ్‌సీపీ మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని గడువు విధించింది. మరోవైపు, కొత్త మెకానిజం ఏర్పాటుకు అవసరమైన పరికరాలు, కన్సల్టెన్సీల కోసం పరిశ్రమల యజమానులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దీంతో ఆయా పరికరాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో వెంటనే సమకూర్చుకునే పరిస్థితి కనిపించడం లేదు.
భట్టిని కలిసేందుకు సమాయత్తం
కొత్త బిల్లింగ్ విధానంతోపాటు పీక్, నాన్ పీక్ అవర్స్‌లో వసూలు చేసే టారిఫ్‌లపై పునరాలోచన చేయాలని పారిశ్రామిక సంఘాలు కోరుతున్నాయి. 50వేలకు పైగా పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య యూనిట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంఘాలు ఇటీవల భేటీ అయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ), తెలంగాణ ఇండ్రస్టియలిస్ట్స్ ఫెడరేషన్ (టిఫ్), తెలంగాణ ఐరన్ అండ్ స్టీల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టిస్మా), తెలంగాణ స్టేట్ టూల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టీఎస్‌టీఎంఏ), చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ (సీఐఏ)తో పాటు పలు సంస్థలు ఈ భేటీలో పాల్గొన్నాయి. ఈ అంశంపై త్వరలో డిప్యూటీ సీఎం, పరిశ్రమల శాఖ మంత్రిని కలిసేందుకు సమాయత్తం అవుతున్నాయి.


