breaking news
Bank loan plan
-
హోమ్ లోన్ ఏ వయసులో బెస్ట్?
ఈరోజుల్లో బ్యాంక్ నుంచి గృహ రుణం తీసుకోకుండా ఇల్లు కొనడం అసాధ్యమే. ఆకాశాన్నంటిన భూముల ధరలు, పెరిగిన నిర్మాణ వ్యయాలతో అపార్ట్మెంట్ల ధరలు రూ.కోట్లలో ఉంటున్నాయి. దీంతో పొదుపు చేసిన సొమ్ముతో పాటు గృహ రుణం తీసుకుంటే తప్ప ఇల్లు సొంతమయ్యేలా లేదు. అయితే ఏ వయసులో హోమ్ లోన్ తీసుకుంటే ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయో ముందుగానే కొంత అవగాహన కలిగి ఉండటం బెటర్. రుణానికి అర్హత ఉంది కదా అని ఏ వయసులో పడితే ఆ వయసులో గృహ రుణం తీసుకుంటే లేనిపోని చికాకులు, మానసిక ఒత్తిళ్లకు లోను కావాల్సి వస్తోందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పైసా పైసా కూడబెడుతుంటారు. ఖర్చులను ఆదుపులో పెట్టుకొని పొదుపుపై దృష్టి పెడుతుంటారు. అయితే మన సొంతింటి కలకు బ్యాంక్‌లు లోన్ రూపంలో సహకారం అందిస్తుంటాయి. వడ్డీ రేట్లు కూడా అందుబాటులోనే ఉండటంతో ప్రతి ఒక్కరూ గృహ రుణం వైపు మొగ్గు చూపిస్తుంటారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) 2.0 అమలులోకి వచ్చాక పన్ను విధానం సరళతరమైంది. స్టీల్, శానిటరీ ఉత్పత్తులు, రంగులు వంటి నిర్మాణ సామగ్రిపై పన్ను శ్లాబ్‌లు తగ్గాయి. ఇది గృహ కొనుగోలుదారులకు డిస్కౌంట్‌గానే కాకుండా దీర్ఘకాలంలో పొదుపుగా మారుతుంది. 30 ఏళ్ల వయసులో రుణం.. సాధారణంగా ఇంటి యాజమాన్యానికి దాదాపు 30 సరైన వయసు. ఈ వయస్సులో చాలా మంది తమ కెరీర్ మార్గాలు, స్థిరమైన ఆదాయం, భవిష్యత్తు ఖర్చుల గురించి బాగా అర్థం చేసుకుంటారు. అలాగే కుటుంబాలతో స్థిరపడాలని ప్లాన్ చేసుకుంటారు కాబట్టి గృహ రుణం దీర్ఘకాలిక ఆర్థిక నిబద్ధతను తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. కెరీర్ ప్రారంభంలోనే అంటే 25–30 ఏళ్ల వయస్సులోనే గృహ రుణం తీసుకుంటే ఈఎంఐ ఎక్కువ కాలపరిమితి తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో జేబుకు అధిక భారం కాకుండా తక్కువ ఈఎంఐ చెల్లించే వీలుంటుంది. కెరీర్ ప్రారంభంలోనే ఉండటంతో సిబిల్ స్కోర్‌కు కూడా మెరుగ్గా ఉంటుంది. దీంతో ఎక్కువ రుణం తీసుకునే వీలుతో పాటు కొంత వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. 750కు మించి క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడే బ్యాంక్ రుణం తేలిగ్గా లభిస్తుంది. ఇక క్రెడిట్ స్కోర్ 800 దాటితే వడ్డీలోనూ 0.5 శాతం వరకూ తగ్గింపులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే కాస్త ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునేందుకు వీలవుతుంది. నలభైలో ఒత్తిళ్లు.. ఉద్యోగ విరమణ లేదా జీవితంలో చివరి దశలో 40– 50 ఏళ్ల వయసు ప్రారంభంలో ఇల్లు కొనడమనేది కొంత సవాళ్లతో కూడుకున్న అంశం. సాధారణంగా గృహ రుణ కాలపరిమితి 20 సంవత్సరాలకు మించి ఉంటుంది కాబట్టి జీవితంలోని ఈ దశలో నెలవారీ వాయిదా(ఈఎంఐ) భారం ఒత్తిడితో కూడుకున్నది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి ఇతర బాధ్యతలు వంటి అధిక ఖర్చులుండే వయసులో ఈఎంఐ లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏమైనా అనుకోని ఘటన జరిగితే సొంతిల్లుని బ్యాంక్ జప్తు చేసుకుంటుంది. కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుంది. అద్దెకూ వయసుందీ.. ఇల్లు కొనడమనేది వ్యక్తి ఆర్థిక సంసిద్ధత, స్థిరత్వం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సొంతిల్లు ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపును, హోదాను తీసుకొస్తుంది. భవిష్యత్తుకు భద్రతా భావాన్ని అందిస్తుంది. అయితే ప్రాపరీ్టని కొనడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి అనువైన సమయం ఎక్కువగా వ్యక్తి వ్యక్తిగత పరిస్థితులు లక్ష్యాలు, ఆర్థిక స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. 20 ఏళ్ల వయసు ప్రారంభంలో అద్దెకు తీసుకోవడం ఆచరణాత్మకమైంది. ఎందుకంటే యువ నిపుణులు స్థిరమైన ఆదాయం కోసం పలు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయతి్నస్తుంటారు. ఉద్యోగ రీత్యా తరచూ నగరాలను మారుతుంటారు. అందుకే ఆర్థికంగా సిద్ధంగా ఉన్నవారు ఈ దశలో ఇల్లు కొనడాన్ని ఎంచుకోవచ్చు.ఉమ్మడి రుణం.. తగ్గును భారం.. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువమంది సంపాదిస్తుంటే ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవచ్చు. దీంతో ఇంటి కొనుగోలుకు అధిక మొత్తంలో బ్యాంక్ లోన్ లభిస్తుంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఈ ఉమ్మడి రుణం తీసుకోవచ్చు. రుణ అర్హత పెరగడమే కాకుండా ఈఎంఐ భారాన్ని పంచుకోవచ్చు. ఇంటి కొనుగోలుకు సంబంధించి అధిక మొత్తంలో బ్యాంక్ లోన్ అవసరమైనప్పుడు వ్యవధి వీలైనంత ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలి. దీంతో నెలవారి చెల్లించే ఈఎంఐ భారం తగ్గి, మీ రుణం పెరుగుతుంది. కాకపోతే వడ్డీ భారం అధికంగా ఉంటుంది. -
రుణం... నిరీక్షణం
రుణం కోసం రైతాంగం నిరీక్షిస్తోంది. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలకే సమయం వెచ్చిస్తూ రైతన్న నీరసించి పోతున్నాడు. ఆర్భాటంగా ప్రకటించిన రుణ ప్రణాళిక పది శాతం కూడా నెరవేరలేదు. - బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు - రూ.7,493.94 కోట్లు ఇస్తామని రుణ ప్రణాళిక - ఇప్పటి వరకు పది శాతం కూడా ఇవ్వని బ్యాంకులు - పట్టించుకోని ప్రభుత్వం సాక్షి, చిత్తూరు: ఈ ఏడాది రైతులకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.7,493.94 కోట్ల రుణాలిస్తామని బ్యాంకుల రుణ ప్రణాళిక ప్రకటించింది. కానీ ఐదు నెలల కాలం ముగుస్తున్నా ఇప్పటివరకు పది శాతం రుణాలు కూడా ఇవ్వలేదు. బ్యాంకుల మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. అటు ప్రభుత్వం రైతులకు రుణాల పంపిణీ సంగతి గాలికొదిలేసింది. రాబోయే 8 నెలల కాలంలో రుణాలు పంపిణీ వేగవంతం చేస్తామని కొందరు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఆర్థికసంవత్సరంలో ప్రకటించిన రుణ ప్రణాళికలో 40 శాతానికి మించి రుణాలు పంపిణీ చేసే అవకాశం లేదని మరికొందరు బ్యాంకు అధికారులు పేర్కొనడం గమనార్హం. గత ఏడాది కంటే 21.59 శాతం అధికంగా రుణాలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అన్నదాతలను వంచించింది. బ్యాంకుల రుణ ప్రణాళికలను పరిశీలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధాలకు సంబంధించి 4,03,601 ఖాతాల పరిధిలో 4,411.69 కోట్లు రుణాలివ్వనున్నట్లు ప్రకటించింది. వేరుశనగ సాగుకు సంబంధించి 1,21,992 ఖాతాల పరిధిలో 685.32 కోట్లు, చెరకు సాగుకు సంబంధించి 35,581 ఖాతాల పరిధిలో 506.98 కోట్లు, టమాటాకు సంబంధించి 16,714 ఖాతాల పరిధిలో రూ.197.63 కోట్లు, మామిడికి సంబంధించి 30,498 ఖాతాల పరిధిలో రూ.385.86 కోట్లు చొప్పున రుణాలివ్వనున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. దీంతో పాటు మైనర్ ఇరిగేషన్ విభాగంలో రూ.100 కోట్లు, భూ అభివృద్ధి పథకాలకు సంబంధించి రూ.40కోట్లు, హార్టికల్చర్ విభాగంలో రూ.100 కోట్లు, అటవీ, భూ అభివృద్ధి పథకాలకు సంబంధించి రూ.612 కోట్లు, డెయిరీ డెవలప్మెంట్ సెక్టార్లో రూ.832 కోట్లు, కోళ్ల పరిశ్రమకు సంబంధించి రూ.59 కోట్లు, మత్స్యకారులకు సంబంధించి రూ.19 కోట్లు, మార్కెట్‌యార్డు గోదాముల అభివృద్ధికి సంబంధించి రూ.32 కోట్లు రుణాలివ్వనున్నట్లు ప్రకటించాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని రంగాలకు సంబంధించి 5,18,515 ఖాతాల ద్వారా రూ.7,493.94 కోట్ల రుణాలిస్తామని బ్యాంకులు ప్రకటించాయి. ప్రకటనలు నీటి మూటలు నాలుగు నెలలు కాలం ముగిసినా ఇప్పటివరకు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఇస్తామన్న రూ.4,411.69 కోట్లల్లో పదిశాతం రూ.400 కోట్లు కూడా ఇంతవరకు పంపిణీ చేయలేదు. మిగిలిన విభాగాల్లో సైతం పదిశాతం లోపే రుణాలు పంపిణీ చేసినట్లు బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన రూ.7,493.94 కోట్ల రుణాలు పంపిణీ చేస్తామని చెప్పిన బ్యాంకులు నాలుగు నెలల కాలం ముగిసే నాటికి పట్టుమని రూ.700 కోట్లు కూడా పంపిణీ చేయలేదు. మిగిలిన ఎనిమిది నెలల కాలంలో పెద్ద ఎత్తున రుణాలు పంపిణీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే బ్యాంకు రుణప్రణాళికలో ప్రకటించిన దానిలో 40 శాతానికి మించి రుణాలు పంపిణీ జరిగే అవకాశం లేదని కొందరు బ్యాంకు అధికారులు పేర్కొంటుండడం గమనార్హం. ఈ లెక్కన 2014-15లో పంపిణీ చేసిన 3,791.83 కోట్లకు మించి రుణాలు అందే అవకాశం కనిపించడం లేదు. గత ఏడాది కంటే 21.90 శాతం అదనంగా రుణాలిస్తామని బ్యాంకుల మాటలు నీటిమూటలు కానున్నాయి. బ్యాంకు రుణాలు అందకపోవడంతో రైతులు పంటల బీమాకు సంబంధించి బీమా ప్రీమియం చెల్లించే అవకాశం లేకుండా పోయింది. దీంతో పంట నష్టం జరిగినా ఇన్సూరెన్స్ అందే అవకాశం లేదు. ఇప్పటికే వర్షాభావంతో ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ పంట నిలువునా ఎండిపోయింది. బీమా ప్రీమియం చెల్లించి ఉంటే నష్టపరిహారం అందేది.


