వడ్డీ తగ్గాలంటే క్రెడిట్‌ కీలకం | importance of credit score in getting a home loan | Sakshi
Sakshi News home page

వడ్డీ తగ్గాలంటే క్రెడిట్‌ కీలకం

Nov 22 2025 9:43 AM | Updated on Nov 22 2025 11:02 AM

importance of credit score in getting a home loan

సాక్షి, హైదరాబాద్‌: సొంతిల్లు కట్టుకోవాలన్నా లేదా కొనుక్కోవాలన్నా చాలా మంది బ్యాంక్‌ రుణం మీదే ఆధారపడుతుంటారు. నూటికి 
99 శాతం మంది లోన్‌ తీసుకునే ఇంటిని కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం గృహ రుణ వడ్డీ రేట్లు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు సొంతింటి కోసం ఆలోచిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. కొనుగోలుదారులకు బ్యాంక్‌లు ఎలా రుణాన్ని మంజూరు చేస్తాయో ఒకసారి చూద్దాం. 

క్రెడిట్‌ స్కోర్‌: గృహ రుణం తీసుకునే సమయంలో బ్యాంక్‌లు ప్రధానంగా పరిశీలించేది క్రెడిట్‌ స్కోరే. ఇప్పటి వరకు తీసుకున్న రుణాలను ఎలా చెల్లించారు అనేది ధృవీకరించేది ఈ క్రెడిట్‌ స్కోరే. ఇంటి కోసం అప్పును తీసుకోవాలనుకున్నప్పుడు క్రెడిట్‌ స్కోర్‌ ఎంతో కీలకంగా మారుతుంది. 750కు మించి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నప్పుడే బ్యాంక్‌ రుణం తేలిగ్గా లభిస్తుంది. ఇక క్రెడిట్‌ స్కోర్‌ 800 దాటితే వడ్డీలోనూ 0.5 శాతం వరకూ తగ్గింపులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా క్రెడిట్‌ స్కోర్‌ ఎక్కువగా ఉంటే కాస్త ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునేందుకు వీలవుతుంది. 

ఉమ్మడి రుణం: కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువమంది సంపాదిస్తుంటే ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవచ్చు. దీంతో ఇంటి కొనుగోలుకు అధిక మొత్తంలో బ్యాంక్‌ లోన్‌ లభిస్తుంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ఈ ఉమ్మడి రుణం తీసుకోవచ్చు. రుణ అర్హత పెరగడమే కాకుండా ఈఎంఐ భారాన్ని పంచుకోవచ్చు. ఇంటి కొనుగోలుకు సంబంధించి అధిక మొత్తంలో బ్యాంక్‌ లోన్‌ అవసరమైనప్పుడు వ్యవధి వీలైనంత ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలి. దీంతో నెలవారి చెల్లించే ఈఎంఐ భారం తగ్గి, మీ రుణం పెరుగుతుంది. కాకపోతే వడ్డీ భారం అధికంగా ఉంటుందన్న సంగతి మరవద్దు.  

అప్పులు: గృహ రుణ అర్హతను నిర్ణయించడంలో ఇతర అప్పులు కూడా కీలకమే. అప్పటికే వ్యక్తిగత రుణం, వాహనాల కోసం లోన్లు, పిల్లల ఎడ్యుకేషన్‌ కోసం రుణం వంటి రెండు మూడు రకాల లోన్లు ఉంటే వీటికి చెల్లించే ఈఎంఐ ఇంటి అప్పుకు అడ్డంకిగా మారుతుంది. అందుకే గృహ రుణం తీసుకునే సమయంలో చిన్న రుణాలను వీలైనంత మేర తీర్చేయడమే ఉత్తమం. ఆదాయంలో 40 శాతానికి మించి ఈఎంఐలు ఉండటం అంత మంచిది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో 50 శాతం వరకూ ఉండొచ్చు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement