రుణం భారమా...‘రాజీ’ ఉందిగా! | Loan Settlement Its Impact on Your Credit Score, special story | Sakshi
Sakshi News home page

రుణం భారమా...‘రాజీ’ ఉందిగా!

Aug 25 2025 5:28 AM | Updated on Aug 25 2025 7:58 AM

Loan Settlement Its Impact on Your Credit Score, special story

చెల్లించలేకపోతే రాజీ చేసుకోవడమే ఏకైక మార్గం 

లోన్‌ సెటిల్‌మెంట్‌తో బయటపడొచ్చు 

బాకీలో 50 శాతం వరకు తప్పదు 

రుణ చరిత్రపై దీర్ఘకాలం పాటు మచ్చ 

తర్వాత రుణం లభించడం కష్టం 

ఎన్నో అవసరాలకు నేడు అరువు ఆధారంగా మారుతోంది. రుణంపై ఖరీదైన కొనుగోళ్లకు సైతం వెనుకాడడం లేదు. ఈఎంఐతో చిన్నగా తీర్చేయొచ్చులే అన్న ధీమా కనిపిస్తోంది. కానీ, ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే..? లేదంటే ప్రమాదం/వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులై.. రుణం తీర్చడం కష్టంగా మారితే? ఈ రిస్క్ ను రుణం తీసుకునే ముందు ఎవరూ ఆలోచించడం లేదు. ఒకవేళ రుణం చెల్లించలేని క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడు ఉన్న ఏకైక మార్గం.. రాజీ (సెటిల్‌మెంట్‌) చేసుకోవడమే. ఇది ఎలా పనిచేస్తుంది..? రుణ చరిత్రపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? తదితర విషయాలతో కూడిన కథనమిది.

రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల అసలుకు వడ్డీ తోడవుతుంది. దీనిపై పెనాల్టీ తదితర చార్జీలు కూడా పడతాయి. సకాలంలో రుణాన్ని చెల్లించాల్సిన బాధ్యత రుణ గ్రహీతలపై, దీన్ని చట్టబద్ధంగా వసూలు చేసుకునే హక్కు రుణదాతలకు ఉంటుంది. అసాధారణ పరిస్థితులు ఎదురై రుణాన్ని సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో వన్‌టైమ్‌ లోన్‌ సెటిల్‌మెంట్‌ (రుణ పరిష్కారం) కోసం అభ్యర్థించొచ్చు. 

రుణం ఇచ్చిన బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఇందుకు అనుమతిస్తే.. చెల్లించాల్సిన మొత్తం చాలా వరకు తగ్గిపోతుంది. కానీ, దీని కారణంగా తర్వాతి కాలంలో రుణం పొందడం కష్టంగా మారొచ్చు. ‘‘వ్యక్తిగత రుణం, వాహన రుణం, గృహ రుణం, విద్యా రుణం, వ్యాపార రుణం, క్రెడిట్‌ కార్డు రుణం తదితర రుణాల్లో సెటిల్‌మెంట్‌కు వెళ్లొచ్చు. రుణాన్ని పరిష్కరించుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇది క్రెడిట్‌ స్కోరుపై, ఆర్థిక భవిష్యత్‌పై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది’’ అని ఎంపాకెట్‌ (ఇన్‌స్టంట్‌ లోన్‌ ప్లాట్‌ఫామ్‌) వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్‌ జలాన్‌ వివరించారు.   

రుణ పరిష్కారం అన్నది అంతిమ ఆప్షన్‌గానే ఉండాలన్నది నిపుణుల సూచన. నెలవారీ చెల్లింపులు చేయలేక రుణ ఎగవేత పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడే లోన్‌ సెటిల్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ‘బేసిక్‌ హోమ్‌ లోన్‌’ సంస్థ సీఈవో అతుల్‌ మోంగా సూచించారు. దీనివల్ల చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన అవసరం తప్పుతుందన్నారు.

ప్రధానంగా.. ‘‘అన్‌ సెక్యూర్డ్‌ రుణాలైన వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డు, వ్యాపార రుణాల విషయంలో రుణ పరిష్కారాన్ని పరిశీలించొచ్చు. అదే సమయంలో సెక్యూర్డ్‌ కిందకు వచ్చే గృహ రుణాలు, ఆటో రుణాలు లేదా ప్రాపర్టీపై రుణాలు, బంగారంపై రుణాల పరిష్కారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే తనఖాలో ఉన్న వాటిని రుణదాతలు స్వా«దీనం చేసుకుంటారు’’ అని మైమనీ మంత్ర డాట్‌ కామ్‌ వ్యవస్థాపకుడు, ఎండీ రాజ్‌ ఖోస్లా పేర్కొన్నారు.

తగ్గే భారం ఎంత? 
రుణం తీర్చే అవకాశం లేనప్పుడు పరిష్కారం మాత్రం ఎందుకు? అని సందేహించొచ్చు. చట్టపరమైన చర్యలకు దూరంగా ఎంతో కొంత చెల్లించి భయపడే మార్గం దీంతో లభిస్తుంది. దీనివల్ల మానసిక నిశి్చంత లభిస్తుంది. సెటిల్‌మెంట్‌తో తగ్గే భారం ఎంత? అన్న దానికి ఇతమిద్ధమైన సూత్రం ఏమీ లేదు. రుణం ఇచ్చిన సంస్థతో బేరసారాలు.. నియమ, నిబంధనలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రహీత చెల్లింపుల సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అధిక వడ్డీ భారం ఉండే క్రెడిట్‌ కార్డు, వ్యక్తిగత రుణాల విషయంలో సెటిల్‌మెంట్‌తో చెప్పుకోతగ్గ భారం తగ్గుతుంది. 

రుణగ్రహీత తన ఇబ్బందికర పరిస్థితుల గురించి రుణదాతకు సమర్థవంతంగా వివరించగలిగితే.. పాక్షిక చెల్లింపులకు బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ అంగీకరించొచ్చు. అవకాశం ఉంటే పూర్తి మొత్తంతో పరిష్కరించుకోవడం మెరుగైన ఆప్షన్‌ అవుతుందని నిపుణుల సూచన. మొత్తం బకాయి ఎంత? దానిపై వడ్డీ భారం ఎంత? చర్చల సామర్థ్యంపైనే తుదకు ఎంత మొత్తం చెల్లించాలన్నది ఆధారపడి ఉంటుందని అతుల్‌ మోంగా తెలిపారు. అసలు రుణం కంటే కొంచెం ఎక్కువగాను.. అసలు, వడ్డీ అన్ని చార్జీలు మొత్తం కంటే తక్కువ చెల్లించే పరిష్కారానికి వీలుంటుంది. 

‘‘ఏక మొత్తంలో చెల్లిస్తారు గనుక మొత్తం బకాయిలో తక్కువకే రుణ దాతలు అంగీకరిస్తారు. ఒకవేళ పాక్షిక చెల్లింపులకు సైతం కటకట ఎదుర్కొంటుంటే.. మొత్తం బకాయిలో 25 శాతం లేదా 30 శాతం చెల్లించే ప్రతిపాదన చేయొచ్చు. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి రుణదాతకు వివరించాలి. దీంతో చెల్లించాల్సిన మొత్తం 30–50 శాతానికి పరిమితం అవుతుంది’’ అని విద్యా రుణాల పంపిణీ సంస్థ ‘ప్రాపెల్డ్‌’ వైస్‌ ప్రెసిడెంట్‌ రవికిషోర్‌ గోయల్‌ తెలిపారు. చెల్లించాల్సిన మొత్తం భారీగా ఉండి, చెల్లించే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటే మరింత తక్కువ మొత్తానికి లోన్‌ సెటిల్‌ చేసుకునేందుకు అభ్యర్థించొచ్చని ఖోస్లా సూచించారు.

 బకాయిలో 10 నుంచి 50 శాతం మధ్య చెల్లింపులు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. సాధారణంగా రుణదాతలు బకాయిలో 50 శాతానికి పైన చెల్లించే పరిష్కారానికి అంగీకరిస్తుంటారని.. అయినప్పటికీ, సాధ్యమైనంత తక్కువకు పరిష్కారం కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేయొచ్చని సూచించారు. సమీప కాలంలో ఆర్థిక పరిస్థితులు కుదుటపడే అవకాశం లేని పరిస్థితుల్లోనే లోన్‌ సెటిల్‌మెంట్‌ను పరిశీలించాలన్నారు. కొన్ని సందర్భాల్లో ఒకే విడత కాకుండా నిర్ణీత కాల వ్యవధిలోపు ఒకటికి మించిన వాయిదాల్లో చెల్లించే పరిష్కారం సైతం కుదుర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.  

మధ్యవర్తుల సాయం.. 
రుణ గ్రహీతల తరఫున రుణ పరిష్కారం కోసం బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలతో చర్చలు నిర్వహించేందుకు డెట్‌ కౌన్సిలర్‌ లేదా డెట్‌ సెటిల్‌మెంట్‌ ఏజెన్సీ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. రుణ పరిష్కారం గురించి ఎలాంటి అవగాహన లేని వారు, ఎలా మాట్లాడాలో తెలియని వారు ఈ తరహా సేవలను పొందొచ్చు. ‘‘నిపుణుల సాయం తీసుకోవడం వల్ల స్పష్టమైన ప్రయోజనాలు లభిస్తాయి. సంప్రదింపుల్లో డెట్‌ సెటిల్‌మెంట్‌ కంపెనీలు ఎంతో అనుభవం కలిగి ఉంటాయి. 

రుణగ్రహీత తరఫున మెరుగైన ప్రయోజనాలతో కూడిన పరిష్కారాన్ని చూడగలవు’’ అని గౌరవ్‌ జలాన్‌ తెలిపారు. అంగీకార పత్రాలు సంబంధిత డాక్యుమెంట్ల పని కూడా సులభతరం అవుతుందన్నారు. ఇలాంటి సేవలు అందించే కంపెనీల చార్జీలు ఎక్కువగా ఉంటాయి. కనుక అందుబాటు ధరలపై అందించే సంస్థలను చూసుకోవడం ముఖ్యం. కొన్ని సంస్థలు ఫ్లాట్‌ ఫీజు వసూలు చేస్తుంటే, కొన్ని బకాయిలో 15–25% వరకు తీసుకుంటాయని మోంగా తెలిపారు. ఇలాంటి సంస్థల సేవలను పొందే ముందు వాటి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి.

క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం
రుణాన్ని సెటిల్‌ చేసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ క్రెడిట్‌ బ్యూరోలకు అందిస్తాయి. ‘సెటిల్డ్‌’ లేదా ‘సెటిల్డ్‌ ఫర్‌ లెస్‌ దెన్‌ ద ఫుల్‌ అమౌంట్‌’ (అసలు కంటే తక్కువ మొత్తంతో పరిష్కారం) అంటూ బ్యాంక్‌లు తెలియజేస్తాయి. రుణ గ్రహీత క్రెడిట్‌ రిపోర్ట్‌లోకి ఇదే సమాచారం చేరుతుంది. సెటిల్డ్‌ అకౌంట్‌కు సంబంధించిన సమాచారం ఏడేళ్ల వరకు క్రెడిట్‌ రిపోర్ట్‌లో కొనసాగుతుంది. సెటిల్డ్‌ అని ఉంటే రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం లేమిని సూచిస్తుంది. కనుక క్రెడిట్‌ స్కోరుపై గణనీయమైన ప్రభావమే పడుతుంది. దీంతో భవిష్యత్తులో అవసరానికి రుణం లభించదు. ఒకవేళ రుణం లభించినా ఇతరులతో పోలి్చతే చెల్లించాల్సిన వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. రుణ బకాయిని పూర్తిగా చెల్లించినట్టయితే క్రెడిట్‌ రిపోర్ట్‌లో అది క్లోజ్డ్‌ (ముగిసినట్టు) అని ఉంటుంది.  

మరో రుణం పుడుతుందా? 
రుణాన్ని పరిష్కరించుకున్నాక చేయాల్సిన మొదటి పని, తిరిగి తమ క్రెడిట్‌ స్కోర్‌ను పునర్‌నిర్మించుకోవడం. తిరిగి మరో రుణం తీసుకునేందుకు కనీసం రెండేళ్లయినా విరామం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. అప్పటి వరకు ఏ రుణం కోసం విచారణ చేయొద్దు. రుణ విచారణలు సైతం క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం చూపిస్తాయి. రుణ పరిష్కారం చేసుకున్న వారు సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డు తీసుకోవడం మంచి ఆలోచన. అంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై జారీ చేసే క్రెడిట్‌ కార్డు. ఈ కార్డుపై 30–50 రోజుల కాలానికి వడ్డీ లేని రుణ సదుపాయం లభిస్తుంది. ఈ కార్డు మొత్తం లిమిట్‌లో 50 శాతం మించకుండా క్రమశిక్షణతో వినియోగిస్తూ, సకాలంలో చెల్లింపులు చేస్తూ వెళ్లాలి. దీనివల్ల రెండేళ్ల కాలంలో క్రెడిట్‌ స్కోరు బలపడుతుంది. తద్వారా గతంలో చేసుకున్న రుణ పరిష్కారం తాలూకు ప్రభావాన్ని అధిగమించొచ్చు.  

చివరి ఎంపికే.. 
క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది కనుక లోన్‌ సెటిల్‌మెంట్‌ అన్నది చివరి ఎంపికగానే ఉండాలి. దీనికంటే ముందు రుణ బకాయి మొత్తాన్ని చెల్లించే మార్గాలను పరిశీలించాలి. రుణదాతతో చర్చించుకుని, కొంత కాలం పాటు మారటోరియం (విరామం/6–12 నెలలు) కోరొచ్చు. ఈ లోపు ఆర్థిక పరిస్థితులను గాడిన పెట్టుకుని రుణ బకాయిని వడ్డీ సహా చెల్లించే వెసులుబాటును పరిశీలించాలి. లేదంటే దీర్ఘకాలానికి రుణాన్ని పునర్వ్యవస్థీకరించి, తక్కువ నెలసరి వాయిదాలతో చెల్లించే పరిష్కారం కుదుర్చుకోవచ్చు. ఏవైనా ఆస్తులు ఉంటే విక్రయించి చెల్లించడం మెరుగైన మార్గం అవుతుంది. అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సాయంతో గట్టెక్కే మార్గం చూడొచ్చు. ఏ విధంగా చూసినా అవకాశం లేనప్పుడు రుణ పరిష్కారానికి వెళ్లొచ్చు.  

ఇవి గుర్తుంచుకోండి... 
కొన్ని వేల రూపాయిల బకాయి కోసం లోన్‌ సెటిల్‌మెంట్‌ కోరడం అస్సలు సూచనీయం కాదు. ఎంత కష్టమైనా సరే చెల్లించడమే మెరుగైన ఆప్షన్‌ అవుతుంది. రుణ బకాయి వ్యక్తి వార్షిక ఆదాయంలో 20–30 శాతం ఉన్నప్పుడు లోన్‌ సెటిల్‌మెంట్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుని క్రెడిట్‌ స్కోరులో రాజీ పడవద్దని ఖోస్లా సూచించారు.  
→ లోన్‌ సెటిల్‌మెంట్‌లో భాగంగా అంగీకారం మేర చెల్లింపులు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రుణ దాత మాఫీ చేస్తారు. దాంతో చట్టపరంగా ఇకమీదట చెల్లించాల్సిన బాధ్యత ఉండదు.  

→ రుణ పరిష్కారం కంటే దివాలా పిటిషన్‌ దాఖలు చేయడమే తేలిక కదా అని అనుకోవద్దు. దివాలాతో రుణాలకు శాత్వతంగా దారులు మూసుకుపోయినట్టు అవుతుంది. దీనికంటే సెటిల్‌మెంట్‌ నయం.  

→ కొన్ని బ్యాంక్‌లు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు తక్కువ మొత్తం చెల్లింపులకు అంగీకరించకపోవచ్చు. 

→ రుణం చెల్లించకుండా లేదా పరిష్కారం కుదుర్చుకోకుండా కాలయాపన చేస్తే బ్యాంక్‌లు/ఎన్‌బీఎఫ్‌సీలు చట్టపరమైన చర్యలు మొదలు పెడతాయి. రుణగ్రహీతలపై కోర్టులో సివిల్‌ కేసు దాఖలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో క్రిమినల్‌ కేసు దాఖలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనివల్ల లేనిపోని చార్జీల భారం నెత్తిన పడుతుంది. 

→ సకాలంలో వసూలు కాని రుణ ఖాతాలను బ్యాంక్‌లు/ఎన్‌బీఎఫ్‌సీలు థర్డ్‌ పార్టీ సంస్థలకు అప్పగించొచ్చు. దీనివల్ల వారి నుంచి కఠిన వసూళ్ల చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement