అద్దె.. సొంతిల్లు.. ఏది బెటర్‌? | Rent House or Own House | Sakshi
Sakshi News home page

అద్దె.. సొంతిల్లు.. ఏది బెటర్‌?

Dec 27 2025 8:08 AM | Updated on Dec 27 2025 8:08 AM

Rent House or Own House

ఏటేటా పెరుగుతున్న ఇంటి అద్దెలు ఒకవైపు.. తక్కువ వడ్డీ రేట్లతో ఆకర్షిస్తున్న గృహ రుణాలు మరోవైపు.. మధ్యలో సగటు కొనుగోలుదారుడు నలిగిపోతున్నాడు. అద్దె ఇంట్లోనే జీవితం సాగదీద్దామా లేక సొంతిల్లు కొనుగోలు చేసి జీవితంలో మరో మెట్టు ఎక్కుదామా? అని నిర్ణయించుకోలేకపోతున్నాడు. పోనీ, ధైర్యం చేసి ముందడుగు వేయాలంటే డౌన్‌ పేవ్‌మెంట్, ఈఎంఐల భయం.. అలా అని అద్దె ఇంట్లోనే సరిపెట్టుకుందామంటే పెరిగే అద్దెలు, అడ్వాన్స్‌లు భారంగా మారుతున్నాయి.    

..ప్రతీ గృహ కొనుగోలుదారుల సంకట పరిస్థితి ఇదే. వాస్తవానికి దేశంలోని పట్టణాలలో ఇది సర్వ సాధారణమైపోయింది. పెరుగుతున్న ఇంటి అద్దెలు, ఆకర్షణీయమైన గృహ రుణాలతో చాలా మంది తమ నెలవారీ వ్యయాల గురించి పునరాలోచిస్తున్నారు. అద్దె చెల్లిస్తూ ఉండటం మంచిదా? లేక ఈఎంఐ చెల్లిస్తూ సొంతింటిని కొనుగోలు చేయడం మంచిదా? అని! ∙సొంతిల్లు అనేది భావోద్వేగాలతో ముడిపడిన అంశం. ఇది సమాజంలో గౌరవాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారడం అంత సులభమేమీ కాదు. జీవితకాలం కష్టపడి చేసిన పొదుపు ఖర్చవడంతో పాటు బ్యాంక్‌ నుంచి తీసుకునే గృహ రుణానికి నెలవారీ వాయిదా(ఈఎంఐ) ఆర్థిక వ్యయం భారీగా ఉంటోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణె వంటి మెట్రో నగరాలలో అద్దెలు గణనీయంగాపెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులను పునరాలోచిస్తున్నారు. ఇంటి యాజమాన్యం తెలివైన దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తున్నారు. 

ఇల్లు కొనడం ప్రయోజనకరం.. 
అద్దె పెంచుతామనో, నచ్చినప్పుడు ఇల్లు ఖాళీ చేయమని చెప్పే ఇంటి యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇంటిని మనకు నచి్చనట్లు డిజైన్‌ చేసుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. పైగా సొంతింటి 
కొనుగోలులో ఆర్థిక ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌–80(సీ) కింద అసలు చెల్లింపులపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుతో పాటు సెక్షన్‌ 24(4) కింద గృహరుణంపై చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు రాయితీ పొందవచ్చు.  

ఇల్లు కొనడంలో సవాళ్లు.. 
తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేసే చాలా మందికి అతిపెద్ద అడ్డంకి డౌన్‌ పేమెంట్‌. సాధారణంగా బ్యాంక్‌లు ఆస్తి విలువలో 75–80 శాతం వరకు గృహ రుణాన్ని అందిస్తాయి. అంటే మీరు మిగిలిన 20 శాతం సొమ్మును ఏర్పాటు చేసుకోవాలి. దీనికి తోడు రిజి్రస్టేషన్, స్టాంప్‌ డ్యూటీ చార్జీలు, మధ్యవర్తులెవరైనా ఉంటే వాళ్ల కమీషన్‌ భరించక తప్పదు. ఉదాహరణకు.. రూ.60 లక్షల ఇంటిని కొనుగోలు చేద్దామని మీరు భావిస్తే.. ముందుగా రూ.15–18 లక్షలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రుణ అర్హత అంశం. ఆదాయం, వయస్సు, క్రెడిట్‌ స్కోర్, అప్పటికే ఉన్న అప్పులు.. ఇవన్నీ మీరు ఎంత రుణానికి అర్హత సాధిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాంక్‌లు స్థిరమైన ఆదాయం ఉన్న వేతన జీవులకే రుణం మంజూరుకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఎందుకంటే గృహ రుణమనేది సుమారు 15– 20 ఏళ్ల కాలం పాటు ఉండే దీర్ఘకాలిక నిబద్ధతతో కూడుకున్న అంశం. అందుకే అనుకోకుండా వచ్చే అత్యవసర ఖర్చుల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు చేసుకోవాలి. దీన్ని మీ ఆదాయం తట్టుకోగలదని నిర్ధారించుకోవాలి.

ఆర్థిక స్థోమత చెక్‌ చేసుకోవాలి
ఈ రోజుల్లో పెరిగిన ప్రాపర్టీ ధరలకు సొంతిల్లు కొనాలంటే బ్యాంక్‌ నుంచి గృహ రుణం తప్పనిసరి. తీసుకునే రుణానికి ఈఎంఐ ఎంత కట్టాలని మాత్రమే చూడకూడదు. కొనే ఇంటికి నిర్వహణ చార్జీలు, సొసైటీ రుసుములు, గృహ బీమా, భవిష్యత్తులో ఇతరత్రా ఖర్చులు కూడా ఉంటాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. 

క్రెడిట్‌ స్కోర్‌ను మెరుగుపర్చుకోవాలి  
బ్యాంక్‌ గృహ రుణానికి మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ తప్పనిసరి. ఆదాయం ఎక్కువ ఉండగానే సరిపోదు క్రెడిట్‌ స్కోర్‌కు కూడా బాగుండాలి. అందుకే మంచి క్రెడిట్‌ స్కోర్‌(750, అంతకంటే ఎక్కువ) ఉంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణం పొందే వీలుంటుంది. క్రెడిట్‌ కార్డ్‌ బిల్లులు, వ్యక్తిగత, వాహన రుణాలు ఏమైనా ఉంటే ముందుగా వాటిని క్లియర్‌ చేసి ఆ తర్వాత గృహ రుణానికి వెళ్లడం ఉత్తమం.

పొదుపును ప్రారంభించండి 
తీసుకున్న గృహ రుణానికి ఈఎంఐ చెల్లిస్తుండంతోనే సరిపోదు. మధ్యలో ఏమైనా అత్యవసర ఖర్చులు వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే డౌన్‌ పేమెంట్‌ కోసం ప్రత్యేక పొదుపు నిధిని ప్రారంభించండి. దీనికి కొన్నేళ్లు పట్టవచ్చు.. కానీ అంతిమంగా మీ రుణ భారాన్ని తగ్గిస్తుంది. 

సరసమైన గృహాలను వెతకండి:  
ఠి ఒక్కరి సంపాదనతోనే ఇల్లు గడుస్తుంటే మాత్రం సాధ్యమైనంత వరకు సరసమైన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్‌లనే ఎంచుకోవడం బెటర్‌. విలాసం, ఆధునిక వసతుల జోలికి వెళ్లకుండా.. మెరుగైన మౌలిక, సామాజిక వసతులు కల్పిపంచే ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడం ఉత్తమం. అంతేకాకుండా సరసమైన గృహ నిర్మాణాలకు ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద రుణ సబ్సిడీతో పాటు తక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు.

పెరుగుతున్న అద్దెలు.. 
మెట్రో నగరాలలో 2021 నుంచి 2024 మధ్యకాలంలో అద్దెలు ఏకంగా 72 శాతం మేర పెరిగాయి. ప్రజా రవాణా, మెట్రోలతో అనుసంధానమై ఉన్న చాలా ప్రాంతాల్లో అయితే ప్రాపరీ్టల ధరల కంటే ఇంటి అద్దెలే అధికంగా పెరిగాయి. నగరంలో ఇంటి అద్దెలు వార్షిక ప్రాతిపదికన 5 శాతం మేర పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హైటెక్‌ సిటీ, మాదాపూర్, గచి్చ»ౌలి, కూకట్‌పల్లి వంటి ఐటీ హబ్‌కు దగ్గరగా ఉండే ప్రాంతాలలో ఇంటి అద్దెలు భారీగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో 2బీహెచ్‌కే అద్దె సుమారు రూ.35 వేల నుంచి ప్రారంభమవుతోంది. ఇక, ఉప్పల్, ఎల్బీనగర్‌ వంటి శివారు ప్రాంతాలలో అయితే రూ.25 వేల నుంచి ఉంటున్నాయి. కోకాపేట, మోకిల, తెల్లాపూర్‌ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీల్లో రూ.50–70 వేల మధ్యలో చెబుతున్నారు.

ఆ పరిస్థితుల్లో అద్దె బెటర్‌.. 
స్థిరమైన ఉద్యోగం కాకపోయినా లేదా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకుండా అద్దెకు ఉండటమే ఉత్తమం. జీవితంలో స్థిరపడ్డాక సొంతిల్లు కొనాలనే ముందస్తు ఆలోచన అత్యంత తెలివైన దీర్ఘకాలిక నిర్ణయాలలో ఒకటి. అందుకోసం ముందునుంచే ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం ఉత్తమం. ఇది మొదట్లో కాస్త భారం, భయం అనిపించినా.. ప్రతి ఈఎంఐ చెల్లింపు సమయంలో నా జీవిత కలను సొంతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులనే ధైర్యం వస్తుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement