రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సాధారణంగా ఇల్లు కొనడం కంటే అద్దెకు ఉండటం చవక. కానీ అమెరికా నగరం పిట్స్‌బర్గ్ మాత్రం ఇందుకు విరుద్ధం. ఇక్కడ ఇల్లు కొనడం నిజంగా అద్దె కంటే చవకగా మారింది. అందుకే కొత్త గృహ కొనుగోలుదారులకు ఇది ఆకర్షణీయ గమ్యస్థానం అవుతోంది.
రియల్టర్.కామ్ (Realtor.com) సీనియర్ ఎకనామిక్ రీసెర్చ్ విశ్లేషకురాలు హన్నా జోన్స్ వివరాల ప్రకారం.. అక్టోబర్‌లో పిట్స్‌బర్గ్, అమెరికాలో అత్యంత చవకైన ప్రధాన హౌసింగ్ మార్కెట్‌గా ర్యాంకయింది. ఇక్కడ ఇళ్ల సగటు లిస్టింగ్ ధర 2.5 లక్షల డాలర్లు (దాదాపు రూ.2 కోట్లు) ఇది జాతీయ సగటు కంటే 1.5 లక్షల (సుమారు రూ.1.25 కోట్లు) డాలర్లపైగానే తక్కువ. ఈ నగరంలో ఐదు సంవత్సరాల క్రితం ఇళ్ల సగటు ధర 234,900 డాలర్లు ఉండగా, ఇప్పటి ధరలు కేవలం 6 శాతం మాత్రమే పెరిగాయి. మిగతా పెద్ద నగరాలతో పోలిస్తే ఇది చాలా స్థిరమైన పెరుగుదల.
ఇంకా ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ ఒకటి వేసవిలో ఇచ్చిన వివరాల ప్రకారం..
ప్రధాన యూఎస్ మెట్రో నగరాల్లో అద్దె కంటే ఇల్లు కొనడం మరింత చవకగా ఉన్న ఏకైక నగరం పిట్స్‌బర్గ్.
30% స్థోమత నియమం ప్రకారం కూడా మధ్యస్థ ఆదాయ కుటుంబాలు ఇక్కడ ఇల్లు కొనగలగడం చాలా సులభం.
జూలైలో పిట్స్‌బర్గ్ మాత్రమే మధ్యస్థ ఆదాయ కుటుంబం మార్కెట్లో ఉన్న ఇళ్లలో 50% కంటే ఎక్కువను భరించగల మెట్రోగా నిలిచింది.
యూఎస్ వ్యాప్తంగా ఇళ్ల ధరలు అందుబాటులో లేకుండా పోతున్నా, పిట్స్‌బర్గ్ మాత్రం ఇప్పటికీ చాలా కుటుంబాలకు అరుదైన అవకాశాన్ని అందిస్తోంది.
రియల్టర్.కామ్ ప్రకారం.. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో 5,842 ఇళ్లు ఉన్నాయి. అంటే ప్రతిఒక్కరి బడ్జెట్‌కీ అనువుగా ఇక్కడ ఇల్లు లభిస్తుంది. ఇంకా మంచి వార్త ఏమిటంటే ఈ నగరం మొదటిసారి ఇల్లు కొనుగోలు దారులకు గ్రాంట్లు వంటి ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది.


