మెట్రో, బస్, రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 15 నిమిషాల్లోనే ఇల్లు.. ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లేంత దూరంలో ఆఫీసు.. సైకిల్ మీద వెళ్లేంత సమీపంలోనే మార్కెట్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్..సింపుల్‌గా 15 మినిట్స్ సిటీ అంటే ఇదీ! గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకొని విసుగు పడే బదులు మనకు ఇష్టమైన అభిరుచిలో గడిపేందుకు వీలు కల్పించేవే ఈ 15 నిమిషాల ప్రాజెక్ట్‌లు.
వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న మౌలిక సదుపాయాల సవాళ్లతో చాలా మంది డెవలపర్లు మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్‌లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా నిర్మాణ సముదాయాల్లో నివాసాలతో పాటు వర్క్‌ప్లేస్‌లు, మార్కెట్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, వినోదం వంటి అన్ని రకాల వసతులు కేవలం వాకింగ్, సైక్లింగ్ దూరంలో ఉంటాయి. ఈ రోజుల్లో గృహ కొనుగోలుదారులు గేటెడ్ కమ్యూనిటీ, సౌలభ్యం, కనెక్టివిటీలను కోరుకుంటున్నారు. కస్టమర్లు అనుభవపూర్వక జీవనాన్ని ఆస్వాదించాలని భావిస్తున్నారు.
బీమా, వెల్‌నెస్ సెంటర్లే కాదు ఫిజియోథెరపీ స్టూడియోలు, ప్లే స్కూళ్లు, పెంపుడు జంతువులను పెంచే ప్రత్యేక పార్క్‌లు ఇతరత్రా ఆధునిక వసతులు ఒకే చోట ఉండాలని కోరుకుంటున్నారు. కరోనా తర్వాత నుంచి కస్టమర్లకు పర్యావరణ స్పృహ పెరిగిపోయింది. నివాసం ఉండే చోటే గ్రీనరీ అధికంగా ఉండాలని భావిస్తున్నారు. ఐసోలేటెడ్, హైరైజ్ ప్రాజెక్ట్‌ల కంటే నడకకు వీలుండే బహిరంగ ప్రదేశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నిత్యావసరాలతో పాటు వారాంతంలో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు అందుబాటులో ఉండే వసతుల గురించి ఆరా తీస్తున్నారు. ప్రతీది కిలో మీటరులోపే ఉండాలని కోరుకుంటున్నారు.
స్వయం సమృద్ధి నగరాల వైపు..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాల నుంచి స్వయం సమృద్ధి గల పర్యావరణ వ్యవస్థల వైపు మళ్లుతోంది. రిటైల్, ఎంటర్‌టైన్ మెంట్ విభాగాలు నివాస సముదాయాలకు చేరువలోకి మారాయి. 15–20 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే ఆయా వసతులు, సౌకర్యాలు అందుకునే వీలు కలిగింది. కానీ, ఆఫీసు విభాగం మాత్రం ప్రధాన నగరంలో కంటే దూరంగా ఉంటున్నాయి. ఇందుకు అధిక అద్దెలు, ట్రాఫిక్ రద్దీ వంటి కారణాలనేకం.
కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ వర్క్ విధానాలతో కంపెనీలు కూడా నివాస సముదాయాలకు చేరువలోనే ఆఫీసుల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం నగరంలోని ఐటీ రంగంలోని 60–70 శాతం మంది సిబ్బంది వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ హైటెక్ సిటీ ప్రాంతానికి ప్రయాణిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీతో పాటు కర్బన ఉద్గారాలతో కాలుష్యం పెరుగుతోంది. దీంతో హైదరాబాద్‌లో 15మినిట్స్ సిటీ కాన్సెప్ట్ ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఏంటీ 15 మినిట్స్ సిటీ?
15 నిమిషాల నగరాలనేవి ప్రధానంగా పని, విద్య, విశ్రాంతి వంటి ముఖ్యమైన అంశాలతో కూడుకున్న కాన్సెప్ట్. ఇవన్నీ వాకింగ్, సైక్లింగ్ దూరంలో ఉండే ప్రాంతాలు. ఇక్కడ నివాసితులు ఇంటి నుంచి నడక లేదా సైక్లింగ్ రైడ్‌లో పని, విద్యా, వైద్యం, వినోదం, విశ్రాంతి వంటి రోజువారీ అవసరాలను పొందవచ్చు. ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రాంతాలే 15 మినిట్స్ సిటీలు. వాహనాల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ వ్యవస్థను పెంపొందించే మౌలిక, సామాజిక
వసతులను కల్పించడమే ఈ నగరాల ప్రధాన లక్ష్యం.
ఈ ప్రాంతాలలో ఎక్కువగా..
ఈ తరహా ప్రాజెక్ట్‌లు ఎక్కువగా దక్షిణ భారతీయ నగరాలలో కనిపిస్తుంది. కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నగరంలో 10,101 కొత్త నివాస యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో 39 శాతం వాటా కేవలం పశ్చిమం, ఆ తర్వాత 32 శాతం వాటా దక్షిణ హైదరాబాద్ కలిగి ఉంది. కొండాపూర్, మణికొండ, నార్సింగి, తెల్లాపూర్, నియోపొలిస్, మోకిలా, కొల్లూరు, కోకాపేట వంటి ప్రాంతాలు స్వయం సమృద్ధి గల మినీ నగరాలుగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి పశ్చిమం వైపు
పరిమితమైన ఐటీ పరిశ్రమను తూర్పువైపు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దీంతో ఉప్పల్, పోచారం, ఎల్బీనగర్ వంటి చుట్టుపక్కల ప్రాంతాలు 15 నిమిషాల్లోనే కార్యాలయానికి చేరుకునే విధంగా అభివృద్ధి చెందాయి.
ఈ నగరాల్లో ఏముంటాయంటే..
దట్టమైన పచ్చని ప్రదేశాలు, మిశ్రమ వినియోగ ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. వాక్ లేదా సైక్లింగ్ మార్గాలు, మెరుగైన ప్రజా రవాణాపై దృష్టిపెడతారు. పని చేసే ప్రాంతాలు, దుకాణాలు, పాఠశాలలు, ఉద్యానవనాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఇలా అన్నీ కిలో మీటరు దూరంలోనే ఉంటాయి. బైక్‌లు, కార్లు వంటి వాహనాలకు బదులుగా నడక, సైక్లింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మెరుగైన మౌలిక, సామాజిక వసతులతో పాటు ప్రజా రవాణా వ్యవస్థలతో అనుసంధానమై ఉంటాయి. కార్బన్ ఉద్గారాలను, ట్రాఫిక్‌ను తగ్గిస్తుంది. శారీరక శ్రమను ప్రోత్సహిస్తుంది. మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంది.


