సాక్షి, హైదరాబాద్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తైనా కూడా.. ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి(ఆర్థిక) బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై చేసిన అంకెల గారడీపై బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బుగ్గన మాట్లాడారు.
ఏడాదిన్నర అయినా కూడా ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది అని చంద్రబాబు వ్యూహాత్మకంగా చెప్పారు. ఆదాయం, స్థూల ఉత్పత్తిపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 2014-19 బాబు హయాంలో కేంద్రానికి 4.45 శాతం ఇస్తే.. వైఎస్సార్‌సీపీ హయాంలో 4.8 శాతం ఇచ్చాం. కోవిడ్ సమయంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్థూల ఉత్పత్తిని పెంచింది..
.. తలసరి ఆదాయంలో చంద్రబాబు పాలనలో ఏపీ 18వ స్థానంలో ఉంది. అదే.. జగన్ పాలనలో 15వ స్థానంలో ఉంది. జగన్ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు 3 లక్షల 32 వేల కోట్లు. చంద్రబాబు 18 నెలల్లో 2 లక్షల 66 వేల కోట్ల అప్పు చేశారు. కాగ్ లెక్కల ప్రకారం.. 2025-2026గానూ ఏపీ అప్పుల్లో నెంబర్ వన్‌గా ఉంది. చంద్రబాబు ప్రతీ నెలా 9 వేల కోట్ల అప్పు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఏజెన్సీలే చెబుతున్నాయి.
స్థూల ఉత్పత్తి లెక్కల్లో ఆర్బీఐ చెప్పినవి తప్పు.. కాగ్ చెప్పినవన్నీ తప్పు చంద్రబాబు అంటున్నారు. కేవలం తాను చెప్పినవే నిజాలు అనట్లు మాట్లాడుతున్నారు. సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆ పిచ్చి లెక్కలు, కాకి లెక్కలు జనం నమ్మరు అని బుగ్గన అన్నారు.
చంద్రబాబు పాలన అంటే అసమర్థతతో కూడిన విధ్వంసం. కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలను కోసే పరిస్థితుల్లో కూడా రైతులు లేరు.కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం చేశాం. రెండు పంటలకు ఇచ్చాం. 34 లక్షల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చాం.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు బాబు పాలనలో ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు కొలంబో అవుతుందా బాబు చెప్పాలి. సంపద ఎలా సృష్టిస్తున్నారో బాబు చెప్పాలి. పోలవరం కోసం కేంద్రం అడ్వాన్స్ ఇస్తుంది. కేంద్రం ఇచ్చిన ఆ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించారు.


