బంగారానికి డబ్బులు కాస్తాయ్‌! | Explanation of the Gold Monetisation Scheme, sakshi special story | Sakshi
Sakshi News home page

బంగారానికి డబ్బులు కాస్తాయ్‌!

Nov 17 2025 5:04 AM | Updated on Nov 17 2025 5:04 AM

Explanation of the Gold Monetisation Scheme, sakshi special story

భారీగా పెరిగిన పసిడి ధరలు

పుత్తడిని నిరుపయోగం కానీయొద్దు 

వినియోగించకపోతే ప్రత్యామ్నాయాలు 

గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌కు వెళ్లొచ్చు 

లీజుకు ఇస్తే అదనపు ఆదాయం 

కాదంటే డిజిటల్‌ రూపంలోకి మార్చుకోవచ్చు

ధర ఎంతున్నా.. తమ తాహతు మేరకు పసిడి కొనుగోలు అన్నది భారతీయ కుటుంబాల్లో సాధారణంగా కనిపించే ధోరణి. మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ 2025 అక్టోబర్‌ నివేదిక ప్రకారం.. భారతీయుల ఇళ్లల్లో 34,600 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. వీటి విలువ 3.8 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ.334 లక్షల కోట్లు). దేశ జీడీపీలో 88.8 శాతానికి సమానం. 

పసిడి ధరలు రికార్డు గరిష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇంతటి విలువైన పసిడిని బీరువాల్లోనో.. లేదంటే బ్యాంక్‌ లాకర్లలో పెట్టే వారి ముందు మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాడకంలో లేని పసిడిని ఉత్పాదకతకు వినియోగించుకోవచ్చు. అదనపు రాబడి మార్గాలను ప్రయతి్నంచొచ్చు. బంగారం రుణాలు, గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్, పసిడి ఆధారిత పెట్టుబడుల పథకాలు ఇలా ఎన్నో సాధనాలున్నాయి. వాటి గురించి తెలియజేసే కథనమే ఇది.  
 

గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకం 
కేంద్ర సర్కారు 2015లో గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ (జీఎంఎస్‌/పసిడి నగదీకరణ పథకం)ను తీసుకొచ్చింది. భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని ఉత్పాదకత వైపు తీసుకువచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద వ్యక్తులతోపాటు సంస్థలు భౌతిక బంగారాన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయొచ్చు. జమ చేసిన మేర బంగారం విలువపై ఏటా 2.25–2.5 శాతం మేర వడ్డీని పొందొచ్చు. 

దీనివల్ల సదరు బంగారాన్ని ఎక్కడ భద్రంగా నిల్వ చేసుకోవాలన్న ఆందోళన ఉండదు. బంగారం ఆభరణాలు, కాయిన్లు, కడ్డీలను అధీకృత కేంద్రానికి తరలించి అక్కడ స్వచ్ఛత పరీక్షిస్తారు. ఈ పథకం కింద కనీసం 10 గ్రాముల బంగారం నుంచి ఎంత వరకు అయినా డిపాజిట్‌ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. జమ చేసిన మేర బంగారానికి (స్వచ్ఛత అనంతరం) బ్యాంక్‌లు డిపాజిట్‌ రసీదును జారీ చేస్తాయి. సదరు బంగారాన్ని కరిగించి వినియోగంలోకి తెచ్చుకుంటాయి. 

గడువు ముగిసిన తర్వాత జమ చేసినంత బంగారాన్ని తిరిగి పొందొచ్చు. లేదంటే అప్పటి విలువ మేరకు నగదు రూపంలోనూ తీసుకోవచ్చు.  2025 మార్చి నుంచి మధ్య, దీర్ఘకాల గోల్డ్‌ మానిటైజేషన్‌ డిపాజిట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఏడాది, మూడేళ్ల కాలానికే ప్రస్తుతం ఈ పథకం కింద బంగారం డిపాజిట్‌కు అనుమతి ఉంది. దీర్ఘకాలం కోసం డిపాజిట్‌ చేయాలనుకునే ఇన్వెస్టర్లు మూడేళ్ల మెచ్యూరిటీ తర్వాత రెన్యువల్‌ చేసుకోవచ్చు. 

మంచి విలువైన పథకం అయినప్పటికీ దీనిలో పాల్గొనే వారు చాలా తక్కువగా ఉంటున్నట్టు ఆనంద్‌రాఠి వెల్త్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ విభాగం హెడ్‌ స్వేత రజని తెలిపారు. బంగారం ఆభరణాలతో ఉన్న దీర్ఘకాల అనుబంధం, సెంటిమెంట్‌ను ఇందుకు కారణాలుగా పేర్కొన్నారు. కనీసం దెబ్బతిన్న ఆభరణాలు, వినియోగించని వాటి విషయంలో అయినా గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకం ఎంతో అనుకూలం. రిస్క్‌ లేని రాబడులను అందుకోవచ్చు. ఆభరణాలతో భావోద్వేగమైన బంధం ఉన్న వారికి ఇది అనుకూలం కాదు. ఎందుకంటే మానిటైజేషన్‌ కింద డిపాజిట్‌ చేస్తే వాటిని పూర్వపు రూపంలో తిరిగి పొందలేరని రజని తెలిపారు.  

→ ఇది ప్రభుత్వ హామీ కలిగిన పథకం. ఇందులో డిపాజిట్‌ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రాబడి 2.25–2.5%. వడ్డీని ఏటా చెల్లిస్తారు.  
→ ఆభరణాలు, కాయిన్లను డిపాజిట్‌ చేయొచ్చు. గడువు తీరిన తర్వాత తిరిగి బంగారం లేదంటే నగదు రూపంలో 
తీసుకోవచ్చు.  
→ కేవలం 1–3 ఏళ్ల కాలానికే అందుబాటులో ఉంటుంది. వేగంగా నగదు మార్చుకోవడానికి ఇందులో అవకాశం లేదు. గడువు ముగిసే వరకు ఆగాల్సిందే.  
→ 10 గ్రాముల్లోపు   బంగారండిపాజిట్‌కు అవకాశం లేదు.  

నగలపై రుణం.. 
వినియోగించకుండా ఉన్న ఆభరణాలను, వాటితో ఉన్న అనుబంధం దృష్ట్యా గోల్డ్‌ మానిటైజేషన్‌కు మనసొప్పని వారు.. వాటిని రుణాల కోసం వినియోగించుకోవచ్చు. తక్కువ వడ్డీ రేటుపై రుణాన్ని వేగంగా పొందొచ్చు. బంగారం తాకట్టు విలువపై 75 శాతం వరకు రుణం కింద బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇస్తుంటాయి. రూ.5 లక్షల్లోపు రుణాలకు 85 శాతం విలువ వరకు కూడా (ఎల్‌టీవీ) ఇస్తాయి. 

ప్రతి నెలా వడ్డీ చెల్లించి, గడువు ముగిసిన తర్వాత అసలు చెల్లించొచ్చు. కొన్ని బ్యాంకులు గడువు చివర్లో వడ్డీ, అసలు చెల్లింపులకు అనుమతిస్తున్నాయి. కాకపోతే వడ్డీని ప్రతి నెలా చార్జ్‌ చేస్తుంటాయి. దీంతో ఏ నెలకు ఆ నెల వడ్డీ కట్టకపోతే, దానిపై రెండో నెలలో వడ్డీ భారీగా పెరిగిపోతుంది. రుణాన్ని సమాన నెలసరి వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించే ఆప్షన్‌ కూడా ఉంటుంది. బంగారం తాకట్టుపై ఓవర్‌డ్రాఫ్ట్‌ రుణాన్ని కూడా పొందొచ్చు. అనుమతించిన రుణాన్ని అవసరానికి అనుగుణంగా ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. తిరిగి ఎప్పుడైనా చెల్లించొచ్చు. 

ఎలాంటి ఆదాయపత్రాలు, క్రెడిట్‌ స్కోర్‌ ఈ రుణాలకు అవసరం లేదు. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 12–15 శాతం వరకు ఉంటోంది. అదే బంగారంపై రుణాలు 8 శాతం రేటు నుంచి లభిస్తున్నాయి. గోల్డ్‌ అప్రైజర్, ప్రాసెసింగ్‌ చార్జీల పేరుతో కొంత చార్జీ భరించాల్సి ఉంటుంది. ముందుగా రుణాన్ని చెల్లించేస్తే ఎలాంటి చార్జీ పడదు. కొన్ని సంస్థలు ముందస్తు చెల్లింపులపై కొంత చార్జీ వసూలు చేస్తున్నాయి. రుణ గడువు ముగిసిన తర్వాత చెల్లింపుల్లో విఫలమైతే 30–60 రోజుల వ్యవధి అనంతరం, బ్యాంక్‌లు/ఎన్‌బీఎఫ్‌సీలు వేలం వేస్తుంటాయి.  

→ ఆభరణాల విలువపై 85 శాతం వరకు రుణంగా పొందొచ్చు. 
→ వ్యక్తిగత రుణాలు తీసుకుని అధిక వడ్డీ భారం మోస్తున్న వారు.. తమ వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారం ఆభరణాలు, కాయిన్లపై రుణంతో భారాన్ని తగ్గించుకోవచ్చు. 
→ గడువులోపు రుణాన్ని తీర్చివేయడంలో విఫలమైతే బంగారాన్ని వేలం వేస్తారు. 
→ రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు గణనీయంగా పడిపోతే, కొంత మొత్తాన్ని మధ్యంతరంగా చెల్లించాల్సి రావడం ప్రతికూలత.

బంగారం లీజుకు.. 
బంగారాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా కొంత రాబడి పొందొచ్చు. నగల వ్యాపారులకు (జ్యుయెలర్‌) మూలధన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వారు దుకాణాల్లో ఆభరణాల నిల్వ కోసం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అవసరం పడుతుంది. కనుక నగల వ్యాపారులు ఆభరణాలను లీజుకు తీసుకుని ఈ అవసరాలను గట్టెక్కుతుంటారు. దీనిపై కొంత రాబడి చెల్లిస్తుంటారు. దీనివల్ల బంగారాన్ని బీరువా లేదా బ్యాంకు లాకర్లకు పరిమితం కాకుండా, ఆదాయాన్ని తెచ్చిపెట్టే సాధనంగా మార్చుకోవచ్చు. సేఫ్‌గోల్డ్‌ అనే ప్లాట్‌ఫామ్‌ ఇందుకు వీలు కలి్పస్తోంది. 

ఈ సంస్థను సంప్రదించినట్టయితే అనుమతి తీసుకుని, లీజుకు ఇచ్చిన బంగారాన్ని కరిగించి అందులోని స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అనంతరం 24 క్యారెట్‌ బంగారం కిందకు మారుస్తారు. అనంతరం సంబంధిత వ్యక్తి పేరుపై డిజిటల్‌ గోల్డ్‌ ఖాతా తెరిచి బంగారం విలువ మేరకు జమ చూపిస్తారు. అనంతరం సేఫ్‌గోల్డ్‌ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్‌ అయిన నగల వ్యాపారులకు మీ బంగారాన్ని లీజుకు ఇవ్వొచ్చు. ఏటా 2–5 శాతం మధ్య రాబడి లభిస్తుంది. రాబడిని రూపాయిల్లో కాకుండా తిరిగి బంగారం రూపంలోనే జమ చేస్తారు. దీనివల్ల దీర్ఘకాలంలో తాము లీజుకు ఇచ్చిన బంగారానికి అదనంగా మరికొంత పసిడిని పోగుచేసుకోవచ్చు. పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా, దీర్ఘకాలంలో అదనపు రాబడిని ఈ మార్గంలో సంపాదించుకోవచ్చు.  

→ ఈ విధానంలో ఆభరణాలు, కాయిన్లను కరిగించి, వాటి విలువపై 2–5 శాతం మధ్య రాబడి చెల్లిస్తారు. 
→ కోరుకున్నప్పుడు తిరిగి పాత ఆభరణాలను పొందడం సాధ్యపడదు. ఒకవేళ భౌతిక బంగారం రూపంలోనే వెనక్కి తీసుకునేట్టు అయితే డెలివరీ చార్జీలు చెల్లించుకోవాలి.  

ఫండ్స్‌లోకి మార్చుకోవడం 
భౌతిక బంగారాన్ని గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి మార్చుకోవడం మరో మార్గం. దీనివల్ల భద్రతపరమైన రిస్క్‌ ఉండదు. అవసరమైనప్పుడు వేగంగా నగదుగా మార్చుకోవచ్చు. ఇందులో లాభ, నష్టాలు రెండూ ఉన్నాయి. నాణ్యత, నిల్వ, భద్రతాపరమైన రిస్‌్కలను తొలగించుకోవడం సానుకూలతలు. పెద్ద మొత్తంలో బంగారం కలిగిన వారికి, దాన్ని కాపాడుకోవడం, ఒక చోట నుంచి మరో చోటకు తీసుకెళ్లడం పెద్ద సవాలే. ఇలాంటి వారు మొత్తం కాకపోయినా సగం బంగారాన్ని అయినా డిజిటల్‌ రూపంలోకి మార్చుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఏడాది నిండిన తర్వాత డిజిటల్‌ గోల్డ్‌ను విక్రయించిన సందర్భంలో వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.  

→ భౌతిక బంగారాన్ని విక్రయించి, డిజిటల్‌గా మారిపోవడం వల్ల పారదర్శకత, భద్రత, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, డిజిటల్‌ రూపంలో (ఈటీఎఫ్‌లు) ఉంటే స్వల్ప స్థాయిలో ఎక్స్‌పెన్స్‌ రేషియో చెల్లించాల్సి వస్తుంది.  
→ భౌతిక బంగారాన్ని విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసిన రెండేళ్లలోపు విక్రయిస్తే వచ్చిన లాభాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. రెండేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి.

కొత్త ఆభరణాలకు అప్‌గ్రేడ్‌... 
కొందరు ఇంట్లో వినియోగంలో లేని బంగారాన్ని అలాగే ఉంచేసి, కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. దీనికి బదులు పాత బంగారాన్ని కొత్త ఆభరణాల కిందకు అప్‌గ్రేడ్‌ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. కొత్త ఆభరణాల కిందకు మార్చుకోవడం వల్ల నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగంలోకి వస్తుంది. దీంతో కొత్తవాటి కొనుగోలుకు అదనపు పెట్టుబడి అవసరం రాదు. కొత్త డిజైన్లకు, తయారీ కోసం చార్జీల వరకు చెల్లిస్తే చాలు. సున్నా తరుగు లేదా అతి తక్కువ తరుగు చార్జీల ఆఫర్లను వినియోగించుకోవడం ద్వారా చార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చు. ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త ఆభరణాలను ధరించామన్న సంతృప్తి దక్కుతుంది. 

→ గతంలో ఎప్పుడో కొన్న ఆభరణాల్లో స్వచ్ఛత పాళ్లు తక్కువ. ఇప్పుడు వాటిని హాల్‌మార్క్‌ ఆభరణాల కిందకు మార్చుకోవచ్చు.   
→ వినియోగంలో లేని ఆభరణాలనే కొత్త ఆభరణాల అప్‌గ్రేడ్‌ కోసం పరిశీలించొచ్చు. 
→ బంగారం విలువలో 10–15 శాతం చార్జీలను భరించాల్సి రావచ్చు. జీఎస్‌టీ కూడా పడుతుంది.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement