breaking news
Gold monetization scheme
-
బంగారానికి డబ్బులు కాస్తాయ్!
ధర ఎంతున్నా.. తమ తాహతు మేరకు పసిడి కొనుగోలు అన్నది భారతీయ కుటుంబాల్లో సాధారణంగా కనిపించే ధోరణి. మోర్గాన్ స్టాన్లీ సంస్థ 2025 అక్టోబర్ నివేదిక ప్రకారం.. భారతీయుల ఇళ్లల్లో 34,600 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. వీటి విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.334 లక్షల కోట్లు). దేశ జీడీపీలో 88.8 శాతానికి సమానం. పసిడి ధరలు రికార్డు గరిష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇంతటి విలువైన పసిడిని బీరువాల్లోనో.. లేదంటే బ్యాంక్ లాకర్లలో పెట్టే వారి ముందు మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాడకంలో లేని పసిడిని ఉత్పాదకతకు వినియోగించుకోవచ్చు. అదనపు రాబడి మార్గాలను ప్రయతి్నంచొచ్చు. బంగారం రుణాలు, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, పసిడి ఆధారిత పెట్టుబడుల పథకాలు ఇలా ఎన్నో సాధనాలున్నాయి. వాటి గురించి తెలియజేసే కథనమే ఇది. గోల్డ్ మానిటైజేషన్ పథకం కేంద్ర సర్కారు 2015లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్/పసిడి నగదీకరణ పథకం)ను తీసుకొచ్చింది. భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని ఉత్పాదకత వైపు తీసుకువచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద వ్యక్తులతోపాటు సంస్థలు భౌతిక బంగారాన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. జమ చేసిన మేర బంగారం విలువపై ఏటా 2.25–2.5 శాతం మేర వడ్డీని పొందొచ్చు. దీనివల్ల సదరు బంగారాన్ని ఎక్కడ భద్రంగా నిల్వ చేసుకోవాలన్న ఆందోళన ఉండదు. బంగారం ఆభరణాలు, కాయిన్లు, కడ్డీలను అధీకృత కేంద్రానికి తరలించి అక్కడ స్వచ్ఛత పరీక్షిస్తారు. ఈ పథకం కింద కనీసం 10 గ్రాముల బంగారం నుంచి ఎంత వరకు అయినా డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. జమ చేసిన మేర బంగారానికి (స్వచ్ఛత అనంతరం) బ్యాంక్‌లు డిపాజిట్ రసీదును జారీ చేస్తాయి. సదరు బంగారాన్ని కరిగించి వినియోగంలోకి తెచ్చుకుంటాయి. గడువు ముగిసిన తర్వాత జమ చేసినంత బంగారాన్ని తిరిగి పొందొచ్చు. లేదంటే అప్పటి విలువ మేరకు నగదు రూపంలోనూ తీసుకోవచ్చు. 2025 మార్చి నుంచి మధ్య, దీర్ఘకాల గోల్డ్ మానిటైజేషన్ డిపాజిట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఏడాది, మూడేళ్ల కాలానికే ప్రస్తుతం ఈ పథకం కింద బంగారం డిపాజిట్‌కు అనుమతి ఉంది. దీర్ఘకాలం కోసం డిపాజిట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు మూడేళ్ల మెచ్యూరిటీ తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు. మంచి విలువైన పథకం అయినప్పటికీ దీనిలో పాల్గొనే వారు చాలా తక్కువగా ఉంటున్నట్టు ఆనంద్‌రాఠి వెల్త్ మ్యూచువల్ ఫండ్స్ విభాగం హెడ్ స్వేత రజని తెలిపారు. బంగారం ఆభరణాలతో ఉన్న దీర్ఘకాల అనుబంధం, సెంటిమెంట్‌ను ఇందుకు కారణాలుగా పేర్కొన్నారు. కనీసం దెబ్బతిన్న ఆభరణాలు, వినియోగించని వాటి విషయంలో అయినా గోల్డ్ మానిటైజేషన్ పథకం ఎంతో అనుకూలం. రిస్క్ లేని రాబడులను అందుకోవచ్చు. ఆభరణాలతో భావోద్వేగమైన బంధం ఉన్న వారికి ఇది అనుకూలం కాదు. ఎందుకంటే మానిటైజేషన్ కింద డిపాజిట్ చేస్తే వాటిని పూర్వపు రూపంలో తిరిగి పొందలేరని రజని తెలిపారు. → ఇది ప్రభుత్వ హామీ కలిగిన పథకం. ఇందులో డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రాబడి 2.25–2.5%. వడ్డీని ఏటా చెల్లిస్తారు. → ఆభరణాలు, కాయిన్లను డిపాజిట్ చేయొచ్చు. గడువు తీరిన తర్వాత తిరిగి బంగారం లేదంటే నగదు రూపంలో తీసుకోవచ్చు. → కేవలం 1–3 ఏళ్ల కాలానికే అందుబాటులో ఉంటుంది. వేగంగా నగదు మార్చుకోవడానికి ఇందులో అవకాశం లేదు. గడువు ముగిసే వరకు ఆగాల్సిందే. → 10 గ్రాముల్లోపు బంగారండిపాజిట్కు అవకాశం లేదు. నగలపై రుణం.. వినియోగించకుండా ఉన్న ఆభరణాలను, వాటితో ఉన్న అనుబంధం దృష్ట్యా గోల్డ్ మానిటైజేషన్‌కు మనసొప్పని వారు.. వాటిని రుణాల కోసం వినియోగించుకోవచ్చు. తక్కువ వడ్డీ రేటుపై రుణాన్ని వేగంగా పొందొచ్చు. బంగారం తాకట్టు విలువపై 75 శాతం వరకు రుణం కింద బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఇస్తుంటాయి. రూ.5 లక్షల్లోపు రుణాలకు 85 శాతం విలువ వరకు కూడా (ఎల్టీవీ) ఇస్తాయి. ప్రతి నెలా వడ్డీ చెల్లించి, గడువు ముగిసిన తర్వాత అసలు చెల్లించొచ్చు. కొన్ని బ్యాంకులు గడువు చివర్లో వడ్డీ, అసలు చెల్లింపులకు అనుమతిస్తున్నాయి. కాకపోతే వడ్డీని ప్రతి నెలా చార్జ్ చేస్తుంటాయి. దీంతో ఏ నెలకు ఆ నెల వడ్డీ కట్టకపోతే, దానిపై రెండో నెలలో వడ్డీ భారీగా పెరిగిపోతుంది. రుణాన్ని సమాన నెలసరి వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించే ఆప్షన్ కూడా ఉంటుంది. బంగారం తాకట్టుపై ఓవర్‌డ్రాఫ్ట్ రుణాన్ని కూడా పొందొచ్చు. అనుమతించిన రుణాన్ని అవసరానికి అనుగుణంగా ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. తిరిగి ఎప్పుడైనా చెల్లించొచ్చు. ఎలాంటి ఆదాయపత్రాలు, క్రెడిట్ స్కోర్ ఈ రుణాలకు అవసరం లేదు. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 12–15 శాతం వరకు ఉంటోంది. అదే బంగారంపై రుణాలు 8 శాతం రేటు నుంచి లభిస్తున్నాయి. గోల్డ్ అప్రైజర్, ప్రాసెసింగ్ చార్జీల పేరుతో కొంత చార్జీ భరించాల్సి ఉంటుంది. ముందుగా రుణాన్ని చెల్లించేస్తే ఎలాంటి చార్జీ పడదు. కొన్ని సంస్థలు ముందస్తు చెల్లింపులపై కొంత చార్జీ వసూలు చేస్తున్నాయి. రుణ గడువు ముగిసిన తర్వాత చెల్లింపుల్లో విఫలమైతే 30–60 రోజుల వ్యవధి అనంతరం, బ్యాంక్‌లు/ఎన్బీఎఫ్సీలు వేలం వేస్తుంటాయి. → ఆభరణాల విలువపై 85 శాతం వరకు రుణంగా పొందొచ్చు. → వ్యక్తిగత రుణాలు తీసుకుని అధిక వడ్డీ భారం మోస్తున్న వారు.. తమ వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారం ఆభరణాలు, కాయిన్లపై రుణంతో భారాన్ని తగ్గించుకోవచ్చు. → గడువులోపు రుణాన్ని తీర్చివేయడంలో విఫలమైతే బంగారాన్ని వేలం వేస్తారు. → రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు గణనీయంగా పడిపోతే, కొంత మొత్తాన్ని మధ్యంతరంగా చెల్లించాల్సి రావడం ప్రతికూలత.బంగారం లీజుకు.. బంగారాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా కొంత రాబడి పొందొచ్చు. నగల వ్యాపారులకు (జ్యుయెలర్) మూలధన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వారు దుకాణాల్లో ఆభరణాల నిల్వ కోసం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అవసరం పడుతుంది. కనుక నగల వ్యాపారులు ఆభరణాలను లీజుకు తీసుకుని ఈ అవసరాలను గట్టెక్కుతుంటారు. దీనిపై కొంత రాబడి చెల్లిస్తుంటారు. దీనివల్ల బంగారాన్ని బీరువా లేదా బ్యాంకు లాకర్లకు పరిమితం కాకుండా, ఆదాయాన్ని తెచ్చిపెట్టే సాధనంగా మార్చుకోవచ్చు. సేఫ్గోల్డ్ అనే ప్లాట్‌ఫామ్ ఇందుకు వీలు కలి్పస్తోంది. ఈ సంస్థను సంప్రదించినట్టయితే అనుమతి తీసుకుని, లీజుకు ఇచ్చిన బంగారాన్ని కరిగించి అందులోని స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అనంతరం 24 క్యారెట్ బంగారం కిందకు మారుస్తారు. అనంతరం సంబంధిత వ్యక్తి పేరుపై డిజిటల్ గోల్డ్ ఖాతా తెరిచి బంగారం విలువ మేరకు జమ చూపిస్తారు. అనంతరం సేఫ్గోల్డ్ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ అయిన నగల వ్యాపారులకు మీ బంగారాన్ని లీజుకు ఇవ్వొచ్చు. ఏటా 2–5 శాతం మధ్య రాబడి లభిస్తుంది. రాబడిని రూపాయిల్లో కాకుండా తిరిగి బంగారం రూపంలోనే జమ చేస్తారు. దీనివల్ల దీర్ఘకాలంలో తాము లీజుకు ఇచ్చిన బంగారానికి అదనంగా మరికొంత పసిడిని పోగుచేసుకోవచ్చు. పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా, దీర్ఘకాలంలో అదనపు రాబడిని ఈ మార్గంలో సంపాదించుకోవచ్చు. → ఈ విధానంలో ఆభరణాలు, కాయిన్లను కరిగించి, వాటి విలువపై 2–5 శాతం మధ్య రాబడి చెల్లిస్తారు. → కోరుకున్నప్పుడు తిరిగి పాత ఆభరణాలను పొందడం సాధ్యపడదు. ఒకవేళ భౌతిక బంగారం రూపంలోనే వెనక్కి తీసుకునేట్టు అయితే డెలివరీ చార్జీలు చెల్లించుకోవాలి. ఫండ్స్‌లోకి మార్చుకోవడం భౌతిక బంగారాన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి మార్చుకోవడం మరో మార్గం. దీనివల్ల భద్రతపరమైన రిస్క్ ఉండదు. అవసరమైనప్పుడు వేగంగా నగదుగా మార్చుకోవచ్చు. ఇందులో లాభ, నష్టాలు రెండూ ఉన్నాయి. నాణ్యత, నిల్వ, భద్రతాపరమైన రిస్‌్కలను తొలగించుకోవడం సానుకూలతలు. పెద్ద మొత్తంలో బంగారం కలిగిన వారికి, దాన్ని కాపాడుకోవడం, ఒక చోట నుంచి మరో చోటకు తీసుకెళ్లడం పెద్ద సవాలే. ఇలాంటి వారు మొత్తం కాకపోయినా సగం బంగారాన్ని అయినా డిజిటల్ రూపంలోకి మార్చుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఏడాది నిండిన తర్వాత డిజిటల్ గోల్డ్‌ను విక్రయించిన సందర్భంలో వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. → భౌతిక బంగారాన్ని విక్రయించి, డిజిటల్‌గా మారిపోవడం వల్ల పారదర్శకత, భద్రత, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, డిజిటల్ రూపంలో (ఈటీఎఫ్‌లు) ఉంటే స్వల్ప స్థాయిలో ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సి వస్తుంది. → భౌతిక బంగారాన్ని విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసిన రెండేళ్లలోపు విక్రయిస్తే వచ్చిన లాభాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. రెండేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి.కొత్త ఆభరణాలకు అప్‌గ్రేడ్... కొందరు ఇంట్లో వినియోగంలో లేని బంగారాన్ని అలాగే ఉంచేసి, కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. దీనికి బదులు పాత బంగారాన్ని కొత్త ఆభరణాల కిందకు అప్‌గ్రేడ్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. కొత్త ఆభరణాల కిందకు మార్చుకోవడం వల్ల నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగంలోకి వస్తుంది. దీంతో కొత్తవాటి కొనుగోలుకు అదనపు పెట్టుబడి అవసరం రాదు. కొత్త డిజైన్లకు, తయారీ కోసం చార్జీల వరకు చెల్లిస్తే చాలు. సున్నా తరుగు లేదా అతి తక్కువ తరుగు చార్జీల ఆఫర్లను వినియోగించుకోవడం ద్వారా చార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చు. ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త ఆభరణాలను ధరించామన్న సంతృప్తి దక్కుతుంది. → గతంలో ఎప్పుడో కొన్న ఆభరణాల్లో స్వచ్ఛత పాళ్లు తక్కువ. ఇప్పుడు వాటిని హాల్‌మార్క్ ఆభరణాల కిందకు మార్చుకోవచ్చు. → వినియోగంలో లేని ఆభరణాలనే కొత్త ఆభరణాల అప్‌గ్రేడ్ కోసం పరిశీలించొచ్చు. → బంగారం విలువలో 10–15 శాతం చార్జీలను భరించాల్సి రావచ్చు. జీఎస్టీ కూడా పడుతుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
గోల్డ్ బాజా!
న్యూఢిల్లీ/న్యూయార్క్: ప్రపంచ దేశాలను భయాందోళనలోకి నెట్టిన మహమ్మారి కరోనా వైరస్ ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి, దీనితో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థలు, అనిశ్చితి పరిస్థితులు, ఈక్విటీల బలహీన ధోరణి అంతర్జాతీయంగా బంగారానికి బలాన్ని అందిస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు ప్రస్తుతం ప్రధాన మార్గంగా పసిడివైపు చూస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం 26 డాలర్లకుపైగా పెరిగి 1,778.95 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే సమయం రాత్రి 9.30 గంటల సమయంలో 1,774 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో చూస్తే, అంతర్జాతీయ ధోరణికితోడు డాలర్ మారకంలో రూపాయి బలహీనత పసిడికి వరమవుతోంది. దేశీయంగా 50 వేల దిశగా... హైదరాబాద్, విజయవాడసహా దేశ వ్యాప్తంగా పలు స్పాట్ బులియన్ మార్కెట్లలో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛత ధర ఒక దశలో రూ.50,000 దాటినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే అటు తర్వాత రూపాయి బలోపేతం పసిడి ధరను కొంత తగ్గించింది. ఈ వార్త రాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్)లో ధర స్వల్ప లాభంతో 48,026 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ గత శుక్రవారంతో పోల్చితే సోమవారం 17 పైసలు బలపడి 76.03 వద్ద ముగిసింది. కరోనా భయాలు, ఈక్విటీల అనిశ్చితికి తోడు చైనాతో ఉద్రిక్తతలూ ఇప్పుడు రూపాయి విలువను భయపెడుతున్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). మళ్లీ ఆ కనిష్టాల దిశగా రూపాయి కదిలితే దేశీయంగా పసిడి ధర వేగంగా రూ 50,000 దాటేస్తుందనేది నిపుణుల అంచనా. 1,800 డాలర్లు దాటితే పరుగే... అంతర్జాతీయంగా పసిడి ధరకు 1,800 డాలర్ల వద్ద పటిష్ట నిరోధం ఉంది. ఈ స్థాయిని దాటితే పసిడి వేగంగా తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు దూసుకుపోయే వీలుందని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. మాంద్యంలోకి జారుకుంటున్నపలు ప్రధా న దేశాల ఆర్థిక వ్యవస్థలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి అప్ట్రెండ్వైపు మొగ్గు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కరోనా కట్టడి జరక్కుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగి, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగటివ్‌లోకి వెళితే... పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,362 డాలర్లయితే, గరిష్ట స్థాయి 1,789 డాలర్లు. ప్రపంచ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఏడాది లోపు 2000 డాలర్లను అందుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్ ఇప్పటికే ఒక నివేదికలో పేర్కొంది. మా వద్ద 13,212 కేజీల పసిడి డిపాజిట్లు: ఎస్బీఐ పడిసి డిపాజిట్ స్కీమ్ (గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్– జీఎంఎస్) ద్వారా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మొత్తం 13,212 కేజీల పసిడిని సమీకరించింది. బ్యాంక్ వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. జీఎంఎస్ కింద ఒక్క 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3,973 కేజీల పసిడిని సమీకరించినట్లు వెల్లడించింది. వ్యక్తులు, ట్రస్టుల వద్ద నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగానికి ప్రభుత్వం 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) స్కీమ్ ద్వారా దాదాపు రూ.244 కోట్ల విలువైన 647 కేజీల పసిడిని సమీకరించినట్లు బ్యాంక్ పేర్కొంది. తద్వారా ఈ ఒక్క స్కీమ్‌తో పసిడి సమీకరణ పరిమాణం 5,098 కేజీలకు (రూ.1,561 కోట్లు) చేరినట్లు బ్యాంక్ తెలిపింది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఫిజికల్ గోల్డ్ డిమాండ్ తగ్గించడం లక్ష్యంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎస్జీబీని తీసుకువచ్చింది. -
నెలాఖరున గోల్డ్ బాండ్స్ ట్రేడింగ్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్‌బాండ్(ఎస్జీబీ) ట్రేడింగ్ ఈ నెలాఖరున ప్రారంభమవుతుందని ప్రభుత్వం తెలిపింది. ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత నాలుగో అంచె సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పుత్తడి సంబంధిత స్కీమ్‌ల ప్రగతిపై సమీక్ష జరపడానికి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోల్డ్ బాండ్ ట్రేడింగ్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్(జీఎంఎస్) కింద మరింత బంగారాన్ని సమీకరించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని బ్యాంక్‌లు ఆదేశించాలన్న నిర్ణయం కూడా తీసుకున్నామని ఆ వర్గాలు వివరించాయి. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్(ఎస్టీబీడీ), మీడియమ్ అండ్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్(ఎంఎల్‌టీజీడీ) కింద ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.2,891 కేజీల బంగారాన్ని సమీకరించింది. -
7.5 టన్నుల బంగారం గోల్డ్ మానిటైజేషన్ లోకి...
హైదరాబాద్: గోల్డ్ మానిటైజేషన్ పథకంలోకి శ్రీవారి బంగారాన్ని తీసుకురానున్నారు. మొత్తం 7.5 టన్నుల బంగారాన్ని ఈ స్కీంలో పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1.3 టన్నుల బంగారాన్ని టీటీడీ ఉంచింది. వివిధ పథకాల కింద నిల్వ ఉంచిన బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ పథకం కిందకి తీసుకురావాలని ఆ దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. ఇలా చేయడం వల్ల వడ్డీ రూపంలో మరికొంత బంగారం వస్తుందని టీటీడీ బోర్డు భావిస్తోంది. అయితే వడ్డీని బంగారం రూపంలో చెల్లించాలని బోర్డు కోరనుంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రూపాల్లో బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ పథకంలో వినియోగంలోకి తీసుకరానున్నారు. -
బంగారం రూపంలోనూ డిపాజిట్లు వెనక్కు : కేంద్రం
న్యూఢిల్లీ: గోల్డ్ మానిటైజే షన్ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా తయారుచేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా అందులో కొన్ని సవరణలు చేసింది. మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రభుత్వ స్కీముల్లో డిపాజిట్ చేసిన బంగారాన్ని ఇన్వెస్టర్లు మెచ్యూరిటీ సమయంలో నగదు రూపంలో గానీ బంగారం రూపంలో గానీ వెనక్కు తీసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే డిపాజిట్లపై వచ్చే వడ్డీని మాత్రం నగదుగానే తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇన్వెస్టర్లు బంగారం రూపంలో డిపాజిట్లను తీసుకుంటే వారి నుంచి ప్రభుత్వం 0.2 శాతం అడ్మినిస్ట్రేషన్ చార్జీలను వసూలు చేయనున్నది. ప్రభుత్వపు తాజా సవరణ ప్రధానంగా దేవాలయ ట్రస్టులకు ఉపయుక్తంగా మారనున్నది. దేశంలోని దేవాలయాల్లో అధిక మొత్తంలో బంగారం ఉన్న విషయం తెలిసిందే. -
కొత్త ‘బంగారు’ భారత్!
మూడు గోల్డ్ స్కీమ్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. అశోక చక్ర చిహ్నంతో తొలి భారతీయ పసిడి నాణెం.. అందుబాటులోకి పుత్తడి బాండ్లు, గోల్డ్ డిపాజిట్ పథకం న్యూఢిల్లీ: దీపావళి, ధన్తేరాస్లకు ముందే భారత్‌లో బంగారు కాంతులు విరజిమ్మాయి. మూడు కొంగొత్త పసిడి పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. దేశంలో నిరుపయోగంగా ఉన్న దాదాపు 20 వేల టన్నుల బంగారాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చే లక్ష్యంతో గోల్డ్ డిపాజిటల్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకుకొచ్చారు. ప్రజలు ప్రత్యక్షంగా బంగారాన్ని కొనుగోలు చేయకుండా పేపర్ గోల్డ్‌ను ప్రోత్సహించేందుకు గోల్డ్ బాండ్లను జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక తొలి భారతీయ బంగారు నాణేన్ని కూడా మోదీ ఆవిష్కరించారు. విదేశాల నుంచి బంగారం దిగుమతులను వీలైనంతమేరకు కట్టడి చేయడమే ఈ మూడు పథకాల ముఖ్యోద్దేశం. ప్రజలు ఈ స్కీమ్‌లలో పాలుపంచుకొని దేశాభివృద్ధికి తోడ్పాటునందించాలని మోదీ పిలుపునిచ్చారు. బంగారం అంటే సెంటిమెంట్‌గా భావించే దేశవాసులకు గోల్డ్ డిపాజిట్, బాండ్ల పథకాలు.. రెండిందాలుగా ప్రయోజనాన్ని అందిస్తాయని(సోనే పే సుహాగా) ప్రధాని పేర్కొన్నారు. పేద దేశమన్న ముద్రను చెరిపేయాలి... దేశవ్యాప్తంగా ఇళ్లు, గుళ్లు, వివిధ సంస్థల వద్ద ఎలాంటి ఉత్పాదకతకు నోచుకోని 20 వేల టన్నుల బంగారం ఉందని.. దీని ప్రకారం చూస్తే మనది పేద దేశం ఎలాఅవుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరంగా సరైన విధానాలు, చర్యలతో పేద దేశమన్న ముద్రను చెరిపేయొచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. అశోక చక్ర చిహ్నంతో గోల్డ్ కాయిన్‌ను తీసుకురావడం భారత్‌కు గర్వకారణమని ఆయన అభివర్ణించారు. దీనివల్ల భారతీయులు విదేశాల్లో ముద్రించిన నాణేలు/బంగారంపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని కూడా ప్రధాని వివరించారు. మరోపక్క, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌కు కూడా ఈ ఇండియా గోల్డ్ కాయిన్ చేయూతగా నిలుస్తుందని మోదీ వివరించారు. ‘భారత్‌లో ప్రజలకు స్వర్ణకారులపై ఉన్న అచంచలమైన నమ్మకం, బంధం ఉంటుంది. ఇప్పుడు మేం ప్రవేశపెట్టిన పథకాలను వారు పూర్తిగా అందిపుచ్చుకోగలిగితే.. ఈ స్కీమ్‌లకు వాళ్లే అధిక మొత్తంలో ఏజెంట్లుగా మారేందుకు అవకాశం ఉంటుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. భారతీయ మహిళల సంప్రదాయ పొదుపు, బంగారంపై వారికున్న మమకారం గురించి చెబుతూ... ‘పుత్తడి విషయంలో మహిళలను చైతన్యవంతం చేయాలంటే... ఆర్థిక శాస్త్రం, గృహ శాస్త్రం(ఇంటి ఆర్థిక నిర్వహణ) మధ్య తేడాను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గుర్తించాలి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దిగుమతులను తగ్గించడం కోసమే: జైట్లీ దేశంలోకి బంగారం దిగుమతులను కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌తో ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ తగ్గుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజలు బంగారం రూపంలో పొదుపు చేసుకోవడం వల్ల దేశాభివృద్ధికి తమవంతుగా ఎలాంటి సహకారాన్ని అందించలేకపోతున్నారని కూడా జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ ఏటా 1,000 టన్నుల బంగారం దిగుమతులతో ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి దిగుమతిదారుగా నిలుస్తోంది. ఇక ప్రజలు, గుళ్లు, వివిధ సంస్థల వద్ద 20 వేల టన్నులకు పైగానే బంగారం ఉంటుందని అంచనా. దీని విలువ రూ.52 లక్షల కోట్ల పైమాటే. పుత్తడి పథకాలతో ప్రయోజనమే...: డబ్ల్యూజీసీ ఈ కొత్త పసిడి స్కీమ్‌ల కారణంగా వినియోగదారులకు మరిన్ని ఎంచుకునే అవకాశాలు లభిస్తాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) పేర్కొంది. భారత స్వర్ణపరిశ్రమ తీరు తెన్నులను ఈ పథకాలు మార్చివేస్తాయని డబ్ల్యూజీసీ ఎండీ పీఆర్ సోమసుందరం చెప్పారు. నిరుపయోగంగా ఉన్న బంగారం ఈ స్కీమ్‌ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తగినవిధంగా తోడ్పాటునందిస్తుందని వివరించారు. అయితే ఈ పథకాలు వినియోగదారుల ఆదరణ పొందడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. కాగా, వృద్ధి పుంజుకోవడానికి ఈ గోల్డ్ స్కీమ్‌లు దోహదం చేస్తాయని ఫిక్కీ అభిప్రాయపడింది. సావరీన్ గోల్డ్ బాండ్లు... ఈ స్కీమ్‌లో ఒక్కో వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 2 గ్రాముల నుంచి ఒకో గరిష్టంగా 500 గ్రాముల వరకూ బంగారాన్ని పేపర్ గోల్డ్(బాండ్స్) రూపంలో కొనుగోలు చేయొచ్చు. వీటిపై 2.75 శాతం వార్షిక వడ్డీరేట్లును ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది. బంగారం ప్రత్యక్ష(ఫిజికల్‌గా) అమ్మకాలను తగ్గించడమే ఈ బాండ్ల జారీ ప్రధాన లక్ష్యం. తొలివిడత బాండ్ల జారీ ప్రక్రియ ఈ నెల 5 నుంచి 20 వరకూ జరుగుతుంది. ఈ నెల 26న కొనుగోలుదారులకు బాండ్లు జారీ అవుతాయి. నిర్ధేశిత బ్యాంకుల శాఖలు, పోస్టాఫీసుల్లో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో గ్రాముకు రూ.2,684 చొప్పున రేటును రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ప్రకటించింది. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. అవసరమైతే ఐదేళ్ల తర్వాత వీటిని నగదుగా మార్చుకోవచ్చు. అంతకంటే ముందే బాండ్ల నుంచి వైదొలగాలనుకునేవారి కోసం కమోడిటీ మార్కెట్లో ఈ బాండ్ల ట్రేడింగ్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇక ఫిజికల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్‌కు వర్తించేవిధంగానే ఈ బాండ్లను కొనుగోలుదారులకూ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. వడ్డీరాబడిపై ఆదాయపు పన్ను కూడా ఉంటుంది. గోల్డ్ డిపాజిట్ పథకం ఈ పథకం కింద బ్యాంకులు 15 ఏళ్ల వరకూ వివిధ కాలవ్యవధులతో ప్రజలు, సంస్థల వద్దనుంచి బంగారాన్ని డిపాజిట్ల రూపంలో స్వీకరిస్తాయి. 2.25 శాతం(మధ్యకాలిక డిపాజిట్లు), 2.5 శాతం(దీర్ఘకాలిక డిపాజిట్లకు) వార్షిక వడ్డీరేటు లభిస్తుంది. ఇక స్వల్పకాలిక డిపాజిట్లకు బ్యాంకులు వడ్డీరేటును నిర్ణయించే వెసులుబాటును కల్పించారు. 22 క్యారెట్ల స్వచ్ఛతగలిగిన కనీసం 30 గ్రాముల పసిడిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేదు. ఈ స్కీమ్‌లో లభించే రాబడికి ఆదాయపు పన్ను. సందప పన్ను, మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. 1-3 ఏళ్ల స్వల్పకాల డిపాజిట్లను బ్యాంకులు స్వయంగా నిర్వహిస్తాయి. ఇక 5-7 ఏళ్ల మధ్యకాలిక డిపాజిట్లు, 12-15 ఏళ్ల దీర్ఘకాలిక డిపాజిట్లను ప్రభుత్వ డిపాజిట్ స్కీమ్లుగా పరిగణిస్తారు. దీనికి కస్టమర్లు నో యువర్ కస్టమర్(కేవైసీ) పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. స్వల్పకాలిక డిపాజిట్లుగా స్వీకరించిన బంగారాన్ని బ్యాంకులు విక్రయించుకోవడానికి వీలుంది. లేదా ఇండియా గోల్డ్ కాయిన్లను ముద్రించే ఎంఎంటీసీకి, జువెల్లర్లకు లేదా ఈ స్కీమ్‌ను నిర్వహించే ఇతర బ్యాంకులకు రుణం రూపంలో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అనుమతిస్తోంది. గోల్డ్ కాయిన్ స్కీమ్.. దేశంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం సొంతంగా బాంగారు నాణేల విక్రయాలను ప్రారంభించింది. ఇండియా గోల్డ్ కాయిన్లో ఒకవైపు జాతీయ చిహ్నమైన అశోక చక్ర, మరోవైపు గాంధీ చిత్రాలను ముద్రించారు. 24 క్యారెట్ల స్వచ్ఛతతో తొలుత 5, 10 గ్రాముల చొప్పున నాణేలను అందుబాటులో ఉంచుతున్నామని, తర్వాత దశలో 20 గ్రాముల కడ్డీలు కూడా లభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ రంగ ఎంఎంటీసీకి దేశవ్యాప్తంగా ఉన్న 125 పుత్తడి విక్రయ అవుట్లెట్లలో ఇవి లభిస్తాయని వెల్లడించింది. నకిలీలకు ఆస్కారం లేనివిధంగా బీఐఎస్ హాల్‌మార్కింగ్‌తో ఈ కాయిన్లను రూపొందిస్తున్నట్లు తెలిపింది. రానున్నరోజుల్లో నిర్ధేశిత బ్యాంక్ శాఖలు, పోస్టాఫీసుల్లో కూడా ఈ నాణేలను విక్రయించే అవకాశం ఉంది. -
పసిడి డిపాజిట్ స్కీమ్...
మార్గదర్శకాలను జారీ చేసిన ఆర్బీఐ - నవంబర్ 5న అధికారికంగా స్కీమ్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(బంగారం డిపాజిట్ పథకం) మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) శుక్రవారం జారీ చేసింది. గోల్డ్ డిపాజిట్లకు వడ్డీరేట్లను నిర్ణయించే పూర్తి స్వేచ్ఛ బ్యాంకులకే ఇస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. వచ్చే నెల 5న అధికారికంగా ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్బీఐ నిబంధనల నోటిఫికేషన్ వెలువడింది. దేశంలోని ప్రజలు, వివిధ సంస్థల వద్దనున్న దాదాపు 20 వేల టన్నుల మేర ఉత్పాదకతకు నోచుకోని బంగారాన్ని తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది. సెప్టెంబర్‌లో కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. కాగా, నిరుపయోగంగా పడిఉన్న బంగారం విలువ దాదాపు రూ.5.4 లక్షల కోట్లుగా అంచనా. మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలివీ... - బంగారం డిపాజిట్ పరిమాణానికి సంబంధించి గరిష్ట పరిమితేమీ లేదు. అయితే, కనీస డిపాజిట్ పరిమాణం(కడ్డీలు, కాయిన్లు, ఆభరణాలు- రాళ్లు, ఇతరత్రా మెటల్స్ను తీసేసిన తర్వాత లెక్కించేది) 30 గ్రాములకు సమానంగా(99.5 స్వచ్ఛత) ఉండాలి. - డిపాజిటర్లు బ్యాంకులకు సమర్పించే బంగారాన్ని ట్రేడబుల్ గోల్డ్‌గా మార్చిన తర్వాత(కరిగించి, శుద్ధి చేశాక) లేదా డిపాజిట్ చేసిన రోజు నుంచి 30 రోజుల తర్వాత నుంచి వడ్డీ లెక్కింపు మొదలవుతుంది. - గోల్డ్ డిపాజిట్‌కు సంబంధించి అసలు, వడ్డీ మొత్తాన్ని బంగారం రూపంలోనే లెక్కిస్తారు. - మెచ్యూరిటీ(గడువు ముగింపు) సమయంలో డిపాజిటర్ బ్యాంకులో డిపాజిట్‌చేసిన బంగారానికి సమానమైన అసలు, వడ్డీని అప్పటి పసిడి మార్కెట్ రేటు ప్రకారం రూపాయిల్లో లేదా సమాన విలువగల బంగారం రూపంలోగానీ బ్యాంకులు చెల్లించవచ్చు. - డిపాజిటర్ గోల్డ్‌ను డిపాజిట్ చేసే సమయంలోనే ఈ రెండు ఆప్షన్లలో ఒకదాన్ని లిఖితపూర్వకంగా బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. దీన్ని ఆతర్వాత మార్చుకోవడానికి వీలుండదు. - గోల్డ్ డిపాజిట్లను స్వీకరించేందుకు అనుమతి ఉన్న బ్యాంకులు స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్ (ఎస్టీబీడీ, 1-3 ఏళ్లు), మధ్యకాలిక (5-7 ఏళ్లు), దీర్ఘకాలిక (12-15 సంవత్సరాలు) ప్రభుత్వ డిపాజిట్ స్కీమ్‌లను ఆఫర్ చేస్తాయి. - కాగా, గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కనీస లాకిన్ వ్యవధి కంటే ముందే డిపాజిటర్లు వైదొలిగితే.. బ్యాంకులు నిర్దేశించే జరిమానా రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. - స్వల్పకాలిక బ్యాంక్ డిపాజిట్లను బ్యాంకులే నేరుగా తమ సొంత ఖాతాల్లోనే అనుమతిస్తాయి. మధ్య, దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ స్కీమ్‌ను మాత్రం భారత ప్రభుత్వం తరఫున అమలు చేయాల్సి ఉంటుంది. - బ్యాంకులకు ఆర్బీఐ నిర్దేశించే నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్- బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన మొత్తం), చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్- డిపాజిట్ నిధుల్లో ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం) పరిధిలోకే ఎస్‌టీబీడీలు వస్తాయి. - ఈ స్కీమ్ ద్వారా సమీకరించే బంగారాన్ని బ్యాంకులు పాటించాల్సిన ఎఎస్ఎల్ఆర్లో చూపించుకోవచ్చు. దీనివల్ల ఉత్పాదక రంగాల కు రుణాలిచ్చేందుకు అదనంగా మరిన్ని నిధులు బ్యాంకులకు అందుబాటులోకి రానున్నాయి. - ప్రస్తుతం సీఆర్ఆర్ 4 శాతంగా, ఎస్ఎల్ఆర్ 21.5 శాతంగా ఉన్నాయి. - ఈ స్కీమ్‌లో బంగారాన్ని డిపాజిట్‌గా సమీకరించిన బ్యాంకులు జ్యువెలర్లకు లేదా ఇండియా గోల్డ్ కాయిన్లను తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీకి విక్రయించుకోవచ్చు లేదా రుణంగా ఇవ్వొచ్చు. ఇతర నిర్దేశిత బ్యాంకులకు కూడా విక్రయించవచ్చు. - ఇక మధ్య, దీర్ఘకాలిక ప్రభుత్వ డిపాజిట్ స్కీమ్‌ల కింద సమీకరించే బంగారాన్ని ఎంఎంటీసీ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇతర ఏజెన్సీ ద్వారా వేలం రూపంలో విక్రయిస్తారు. తద్వారా లభించే నిధులను ఆర్బీఐ వద్ద ఉండే కేంద్ర ప్రభుత్వ ఖాతాలో జమచేస్తారు.


