గోల్డ్‌ బాజా!

Gold rate jump as rising Covid-19 cases dent hopes of quick recovery - Sakshi

గరిష్టాల దిశగా దూసుకుపోతున్న బంగారం

ఒకేరోజు 26 డాలర్లు అప్‌

1,778 డాలర్లపైకి పెరుగుదల

దేశంలోని పలు స్పాట్‌ మార్కెట్లలో  రూ.50 వేలకు చేరువైన పరిస్థితి

పసిడికి బలమవుతున్న రూపాయి క్షీణత

న్యూఢిల్లీ/న్యూయార్క్‌: ప్రపంచ దేశాలను భయాందోళనలోకి నెట్టిన మహమ్మారి కరోనా వైరస్‌ ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి, దీనితో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థలు, అనిశ్చితి పరిస్థితులు, ఈక్విటీల బలహీన ధోరణి అంతర్జాతీయంగా బంగారానికి బలాన్ని అందిస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు ప్రస్తుతం ప్రధాన మార్గంగా పసిడివైపు చూస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌ (నైమెక్స్‌)లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర సోమవారం 26 డాలర్లకుపైగా పెరిగి 1,778.95 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే సమయం రాత్రి 9.30 గంటల సమయంలో 1,774 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో చూస్తే, అంతర్జాతీయ ధోరణికితోడు డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత పసిడికి వరమవుతోంది.

దేశీయంగా 50 వేల దిశగా...
హైదరాబాద్, విజయవాడసహా దేశ వ్యాప్తంగా పలు స్పాట్‌ బులియన్‌ మార్కెట్లలో సోమవారం  10 గ్రాముల స్వచ్ఛత ధర ఒక దశలో రూ.50,000 దాటినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే అటు తర్వాత రూపాయి బలోపేతం పసిడి ధరను కొంత తగ్గించింది. ఈ వార్త రాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌(ఎంసీఎక్స్‌)లో ధర స్వల్ప లాభంతో 48,026 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ గత శుక్రవారంతో పోల్చితే సోమవారం 17 పైసలు బలపడి 76.03 వద్ద ముగిసింది. కరోనా భయాలు, ఈక్విటీల అనిశ్చితికి తోడు చైనాతో ఉద్రిక్తతలూ ఇప్పుడు రూపాయి విలువను భయపెడుతున్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). మళ్లీ ఆ కనిష్టాల దిశగా రూపాయి కదిలితే దేశీయంగా పసిడి ధర వేగంగా రూ 50,000 దాటేస్తుందనేది నిపుణుల అంచనా.

1,800 డాలర్లు దాటితే పరుగే...
అంతర్జాతీయంగా పసిడి ధరకు 1,800 డాలర్ల వద్ద పటిష్ట నిరోధం ఉంది. ఈ స్థాయిని దాటితే పసిడి వేగంగా తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు దూసుకుపోయే వీలుందని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. మాంద్యంలోకి జారుకుంటున్నపలు ప్రధా న దేశాల ఆర్థిక వ్యవస్థలను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి అప్‌ట్రెండ్‌వైపు మొగ్గు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. 

కరోనా కట్టడి జరక్కుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా కొనసాగి, అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ వడ్డీరేటు నెగటివ్‌లోకి వెళితే... పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్‌ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌లో పసిడి 52 వారాల కనిష్ట స్థాయి 1,362 డాలర్లయితే, గరిష్ట స్థాయి 1,789 డాలర్లు.  ప్రపంచ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర ఏడాది లోపు 2000 డాలర్లను అందుకుంటుందని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మెన్‌ శాక్స్‌ ఇప్పటికే ఒక నివేదికలో పేర్కొంది.

మా వద్ద 13,212 కేజీల పసిడి డిపాజిట్లు: ఎస్‌బీఐ
పడిసి డిపాజిట్‌ స్కీమ్‌ (గోల్డ్‌ మోనిటైజేషన్‌ స్కీమ్‌– జీఎంఎస్‌) ద్వారా బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మొత్తం 13,212 కేజీల పసిడిని సమీకరించింది. బ్యాంక్‌ వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. జీఎంఎస్‌ కింద ఒక్క 2019–20 ఆర్థిక సంవత్సరంలో 3,973 కేజీల పసిడిని సమీకరించినట్లు వెల్లడించింది. వ్యక్తులు, ట్రస్టుల వద్ద నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగానికి ప్రభుత్వం 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా 2019–20 ఆర్థిక సంవత్సరంలో సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల (ఎస్‌జీబీ) స్కీమ్‌  ద్వారా దాదాపు రూ.244 కోట్ల విలువైన 647 కేజీల పసిడిని సమీకరించినట్లు బ్యాంక్‌ పేర్కొంది. తద్వారా ఈ ఒక్క స్కీమ్‌తో పసిడి సమీకరణ పరిమాణం 5,098 కేజీలకు (రూ.1,561 కోట్లు) చేరినట్లు బ్యాంక్‌ తెలిపింది. దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఫిజికల్‌ గోల్డ్‌ డిమాండ్‌ తగ్గించడం లక్ష్యంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎస్‌జీబీని తీసుకువచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top