గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఊహకందని రీతిలో.. తొలిసారిగా ఔన్స్‌కు 5,000 డాలర్లు దాటేసింది. ఇదే సమయంలో వెండి ధర కూడా ఔన్స్‌కు 100 డాలర్ల నుంచి 105 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతూ.. రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో చీఫ్ ఎకనామిస్ట్ & గ్లోబల్ స్ట్రాటజిస్ట్ పీటర్ షిఫ్ (Peter Schiff) చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బంగారం ధర 100 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి.. 5,085 డాలర్లు దాటేసింది. వెండి ధర 5 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి.. 108.25 డాలర్లు క్రాస్ చేసింది. ఈ రెండూ కొత్త గరిష్ట స్థాయిలలో ఉన్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన అస్థిరతకు సంకేతం. ఇది రాబోయే రోజుల్లో సాధారణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే విధంగా పీటర్ షిఫ్ పేర్కొన్నారు.
Gold is up over $100, trading above $5,085. Silver is up over $5, trading above $108.25, both at new record highs. Most people are clueless about what this means and are in for quite a shock. Those of us who understand have been expecting the economic crisis that’s about to hit.
— Peter Schiff (@PeterSchiff) January 26, 2026
బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక & రాజకీయ ఉద్రిక్తతలు. ముఖ్యంగా గ్రీన్‌ల్యాండ్ విషయంలో.. అమెరికా & నాటో దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీనితో పాటు ఉక్రెయిన్, గాజా వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా తీసుకుంటున్న చర్యలు కూడా.. పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు కూడా మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా చైనాతో ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాపై 100% సుంకం విధిస్తామని ఆయన బెదిరించిన తర్వాత.. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటివాటిపై పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఇది వీటి ధరలను అమాంతం పెంచేసింది.
ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనా
ఇదిలా ఉండగా.. విశ్లేషకులు బంగారం ధర మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఔన్సుకు 6000 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. గోల్డ్ & సిల్వర్ ధరల భారీ పెరుగుదల కేవలం పెట్టుబడి అవకాశంగా మాత్రమే చూడాల్సిన విషయం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అస్థిరతకు, అప్పుల భారానికి, రాజకీయ ఉద్రిక్తతలకు స్పష్టమైన హెచ్చరిక. కాబట్టి రాబోయే కాలంలో ఆర్థికంగా అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం అని నిపుణులు చెబుతున్నారు.


