ఏలూరు నగరం జనసాగరాన్ని తలపించింది. మూడు నెలల పాటు విశేష పూజలందుకున్న నగర ఇలవేల్పు, కొంగు బంగారం గంగానమ్మవారి జాతర భారీ ఊరేగింపులు జరిగాయి.
నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మేడల వద్ద అమ్మవార్లకు నైవేద్యాలు, చీరలు, రవికలు, పసుపు, కుంకుమలను భక్తులు సమర్పించారు.
అమ్మవార్ల ఊరేగింపును అత్యంత పవిత్ర కార్యంగా భక్తులు భావిస్తారు. ఒకే వేప చెట్టు నుంచి తీసిన కలపతో కొర్లబండిని తయారుచేయించి పంబలవారి రూపంలో అమ్మవారిని కూర్చోబెట్టి యాత్ర ప్రారంభించారు. యాత్రలో అమ్మవారి అక్కాచెల్లెళ్లు కూడా వచ్చి చేరి కాలక్షేపం చేస్తారనే నమ్మకంతో వారి కోసం ప్రత్యేకంగా పీటలు, కోలాటం కర్రలు కూడా ఏర్పాటుచేశారు.


