గృహ రుణానికి ముందే గుడ్‌బై | Benefits of making extra Home Loan payments | Sakshi
Sakshi News home page

గృహ రుణానికి ముందే గుడ్‌బై

Dec 1 2025 5:41 AM | Updated on Dec 1 2025 5:41 AM

Benefits of making extra Home Loan payments

అదనపు చెల్లింపులతో అద్భుతాన్ని సాధించొచ్చు

రూ.5 వేలతో ఏకంగా 11 లక్షలు ఆదా 

మూడున్నరేళ్ల ముందే రుణం తీరిపోతుంది 

ఈఎంఐ చెల్లింపులకు అదనంగా కాస్త జత చేస్తే చాలు 

వీలైనంత త్వరగా తీర్చడానికే ప్రాధాన్యమివ్వాలి 

ఈఎంఐ మొత్తాన్ని తగ్గిస్తామని బ్యాంకులు ఆఫర్‌ చేస్తే నో

ఇల్లు, కారు, బైక్, ఫర్నీచర్‌... ఇలా ఏదైనా కానీండి. చాలామందికి బడ్జెట్‌తో పోరాటం తప్పనిసరి. చేతిలో ఉన్న సొమ్ముకు... కావాలనుకుంటున్న వస్తువుకు తేడా ఉంటూనే ఉంటుంది. కొందరు ఇంకాస్త ఎక్కువ పెట్టి కావాలనుకుంటున్న వస్తువు సొంతం చేసుకుంటారు. కొందరు ఉన్నదానికి తగ్గదే కొనుక్కుని సర్దుకుపోతారు. మరికొందరైతే ఇటు సర్దుకుపోలేక... అటు కావాలనుకున్నది కొనలేక తరువాత చూద్దామని వాయిదా వేసుకుంటుంటారు. 

కానీ... ‘తరువాత’ అనేది రావటం కష్టం. ఎందుకంటే మనం అప్‌గ్రేడ్‌ అయ్యేసరికి మన కోరిక, లేకపోతే ఆ వస్తువు ధర కూడా అప్‌గ్రేడ్‌ అవుతాయి కదా? ఇదంతా ఎందుకంటే... ఆ మొదటి కేటగిరీ గురించి. ఇంకాస్త ఎక్కువపెట్టి ముందుకెళ్లే వారి గురించి. వారు మొదట్లో కొంత ఇబ్బంది పడినా... తాను అనుకున్నది చేశామనే సంతృప్తి ఉంటుంది కదా!  అది ఆర్థికంగానూ లాభాన్నే ఇస్తుంది. గృహ రుణం చెల్లింపుల్లో అలా ఇంకాస్త ఎక్కువ పెట్టే వారి గురించే ఈ ప్రత్యేక కథనం...

ప్రతి ఒక్కరికీ సొంతిల్లు కలే. ఒకప్పుడు రిటైర్‌మెంట్‌ తరువాతే సొంతిల్లు. ఈజీ రుణాల కారణంగా... ఈ తరం మాత్రం ఉద్యోగంలో చేరిన మొదట్లోనే సొంతింటికి ఓటేస్తున్నారు. 20–30 ఏళ్ల పాటు రుణ చెల్లింపులకు గడువు పెట్టుకున్నా... వీలైనంత త్వరగా తీర్చేయడానికి కష్టపడుతున్నారు. మరి మీకు తెలుసా ఒక 5వేల రూపాయలు ఎంత మ్యాజిక్‌ చేస్తుందో? నెలనెలా చెల్లించే ఈఎంఐకి అదనంగా రూ.5వేలు గనక చెల్లిస్తే... 20 ఏళ్లలో ఏకంగా రూ.11.5 లక్షల వడ్డీ ఆదా అవుతుంది. పైపెచ్చు ఈఎంఐలు చెల్లించాల్సిన కాలమూ తగ్గుతుంది. అదెలాగంటే...

రూ.5,000 చేసే మ్యాజిక్‌ ఇదీ...
ఉదాహరణకు శ్రీకర్‌ రూ.50 లక్షల గృహరుణం తీసుకున్నాడు. 20 ఏళ్ల కాలానికి నెలకు రూ.40వేలు ఈఎంఐ చెల్లించడానికి ముందే మానసికంగా సిద్ధపడ్డాడు. కానీ మరో రూ.5వేలు అదనంగా చెల్లిస్తే..? ఏం జరుగుతుందో చూద్దాం... 
→ శ్రీకర్‌ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతం. ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ,.43,500 
→ 20 ఏళ్లలో రూ.50 లక్షల అసలుతో పాటు మరో రూ.54 లక్షలు వడ్డీ కింద చెల్లించాలి. 
→ కానీ ప్రతినెలా రూ.43,500 కాకుండా దానికి రూ.5వేలు జోడించి రూ.48,500 చెల్లిస్తే.... 
→ 20 ఏళ్ల రుణం కాస్తా 16 ఏళ్ల 6 నెలల్లో తీరిపోతుంది. వడ్డీ రూపంలో ఏకంగా రూ.11.5 లక్షలు ఆదా అవుతుంది. 
→ ఒకవేళ రూ.10,000 అదనంగా (రూ.53,500 చొప్పున) చెల్లిస్తే... రుణం 13 ఏళ్లకే తీరిపోతుంది. వడ్డీ రూపంలో రూ.20 లక్షలు మిగులుతుంది.  
→ ఇలా స్మార్ట్‌ చెల్లింపులతో 20 ఏళ్ల రుణ బంధాన్ని 12–13 ఏళ్లకే తీర్చుకోవచ్చు.

ఒకే విడతా లేక నెలవారీనా..?
→ వేతన జీవులు ప్రతి నెలా ఈఎంఐకి కొంత అదనంగా చెల్లిస్తూ వెళ్లడమే మంచి మార్గం 
→ దీనివల్ల ప్రతి నెలా అసలు కాస్త తగ్గుతూ వెళుతుంది. ఈ అదనపు చెల్లింపుల వల్ల ఇతర ఖర్చులపైనా నియంత్రణ వస్తుంది 
→ బోనస్‌ లాంటివి వచి్చనపుడు ఆ మొత్తాన్ని గృహ రుణం ముందస్తు చెల్లింపులకు వినియోగించుకోవచ్చు.  
→ అయితే ఎక్కువ మొత్తం ఒకేసారి చెల్లిస్తున్నపుడు... గృహ రుణం వడ్డీకన్నా ఎక్కువ వడ్డీ వచ్చే మార్గాలేవైనా ఉన్నాయేమో చూడాలి. 
→ అలాంటి మార్గాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాన్ని పరిశీలించాకే గృహ రుణం సంగతి చూడాలి. ఎందుకంటే గృహరుణాలపై వడ్డీ తక్కువ.

అంత ఆదా సాధ్యమా?
→ గృహ రుణంపై బ్యాంకులు ప్రతి నెలా చివర్లో మిగిలే నికర బకాయిపైనే వడ్డీ విధిస్తాయి. 
→ ప్రతి నెలా చెల్లించే అదనపు మొత్తం నేరుగా అసలులో జమవుతుంది. తదుపరి నెలలో ఆ మేరకు అసలుపై వడ్డీ మిగులుతుంది. 
→ ఈఎంఐకి అదనంగా ఇలా ఎంత అదనంగా చెల్లిస్తారో... అంత మేర వడ్డీ భారాన్ని, కాల వ్యవధిని తగ్గించుకోవచ్చు.  
→ రుణం తీసుకున్న మొదటి ఐదేళ్లలో వీలైనంత అదనంగా చెల్లిస్తే... వడ్డీ– కాలవ్యవధిని అంత గణనీయంగా తగ్గుతాయి. 
→ ఒకవేళ బ్యాంక్‌ రుణ కాల వ్యవధి పెంచుతూ, ఈఎంఐని తగ్గించే ఆఫర్‌ ఇస్తే.. అంగీకరించొద్దు.  

ఫ్లోటింగ్‌ – ఫిక్స్‌డ్‌ రేటు రుణం
→ ఫ్లోటింగ్‌ రేటుపై తీసుకున్న గృహ రుణం అయితే ముందస్తు చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీ పడదు. 
→ ఫిక్స్‌డ్‌ రేటుపై రుణం తీసుకున్న వారు ముందుగా చేసే చెల్లింపులపై 1– 3 శాతం మేర పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు.  
→ ప్రస్తుతం బ్యాంక్‌లు/ ఎన్‌బీఎఫ్‌సీలు ఫ్లోటింగ్‌ రేటునే అనుసరిస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ రేటుపై, పెనాల్టీ లేని ముందస్తు చెల్లింపులకు అవకాశం ఉంటే దాన్ని పరిశీలించొచ్చు. 
→ ఒకవేళ బ్యాంక్‌ రుణ కాల వ్యవధి పెంచుతూ, ఈఎంఐని తగ్గించే ఆఫర్‌ ఇస్తే.. అంగీకరించొద్దు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement