
అమెరికా సుంకాలు భారత వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న దృష్ట్యా కొన్ని సడలింపులు కావాలని దేశీయ ఎగుమతిదారులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను కోరుతున్నారు. యూఎస్ సుంకాలతో దెబ్బతింటున్న ఉత్పాదకత, సరఫరా సవాళ్లకు తాత్కాలిక పరిష్కారంగా ఇప్పటికే తీసుకున్న రుణాలపై వడ్డీని తొలగించాలంటున్నారు. డిసెంబర్ 2024లో ముగిసిన వడ్డీ ఈక్వలైజేషన్ స్కీమ్ (ఐఈఎస్)ను పునరుద్ధరించాలని లేదా ఎగుమతి ప్రోత్సాహక రూపంలో డ్యూటీ క్రెడిట్ స్క్రిప్‌లను(దిగుమతి చేసుకునే ముడి సరుకుపై సుంకాల సడలింపు) తిరిగి ప్రవేశపెట్టాలని చెబుతున్నారు. అయితే అందుకు మంత్రిత్వశాఖ సుముఖంగా లేదని తెలుస్తుంది. ఈ అంశం ఇంకా చర్చల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.
ఎగుమతిదారులు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) డిసెంబర్ 2024లో ముగిసిన ఐఈఎస్‌ను కొనసాగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఈ పథకం కింద ప్రభుత్వం ఎగుమతి రుణంపై వడ్డీ రేట్లను మాఫీ చేసింది. భారతీయ ఎగుమతిదారులు వారి రుణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని, దాని ద్వారా కొత్త మార్కెట్‌ల్లో ఎగుమతులను పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
‘ఐఈఎస్ లేదా డ్యూటీ క్రెడిట్ స్క్రిప్స్ ద్వారా నేరుగా ఎగుమతులు పెరుగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నమ్మడం లేదు. దీనిపై ఎగుమతిదారులు, వాణిజ్య విభాగం మధ్య చర్చలు జరుగుతున్నాయి’ అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. 2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.2,250 కోట్ల వార్షిక వ్యయంతో ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది గతంలో ఐఈఎస్ కింద చేసిన పంపిణీల కంటే చాలా తక్కువగా ఉంది.
ఇదీ చదవండి: స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ మంచిదా?