
దత్తబోధ
ఒక వ్యక్తి స్తంభాన్ని గట్టిగా కౌగిలించుకొని ‘బాబోయ్! ఈ స్తంభం నన్ను వదిలి పెట్టటం లేదండోయ్!’ అంటూ అరిచాడట. సంసారం కూడా ఇంతే. సంసారం మనల్ని పట్టుకున్న దనుకొంటారు చాలామంది. కానీ సంసారాన్నే మనం పట్టుకొని సతమత మవుతున్నామని గ్రహించరు. సంసారంలోని సారం తెలిస్తే ఎవరూ బాధపడరు. చావుపుట్టుకల తగలాటమే సంసార సారం. భార్యాబిడ్డలు, ఇల్లూవాకిలి, పొలమూ పుట్ర ఇవన్నీ సంసారమను కొంటున్నాం. ఇవన్నీ జనన మరణాల మధ్య రాగంతో ఏర్పాటు చేసుకొన్న సామగ్రి.
జనన మరణాత్మకమైన సంసారంలో రాగద్వేషాలు వదలి తామరాకుపై నీటిబొట్టు లాగా ఉండగలిగితే ఈ సంసారం మనిషినేమీ చేయదు. అలాకాక రాగద్వేషాలతో వీటన్నిటి మీద ఆసక్తి కలిగి ఉన్నంతకాలం అది మనల్ని పట్టుకున్నట్లనిపిస్తుంది. సరిగ్గా దీనికి ఉదాహరణే స్తంభాన్ని కౌగలించుకోవటం! వైరాగ్య భావం అలవాటు చేసుకుంటే సంసారంలో ఆసక్తి ఉండదు. వైరాగ్యం పొందే విధం కోసం సద్గ్రంథ పఠనం చేసి, గురూపదేశం పొందాలి. మనిషి సంసారాన్ని తానే వరించి తెచ్చుకొన్నాడు తప్ప అది పట్టుకోలేదు.
‘ఉ’ అనే చీమ ఉప్పుగట్టు మీదనే ఉంటూ ఉప్పే తింటుండేది. అలాగే ‘ప’ అనే చీమ పంచదార గుట్ట మీద ఉంటూ పంచదార తింటూండేది. ఒకసారి ‘ప’ అనే చీమ ‘ఉ’ అనే చీమతో ‘మిత్రమా! కొంచెం పంచదార చవి చూడు. ఎంత తియ్యగా ఉంటుందో!’ అని అన్నది. సరే అలాగే అని కొద్దిగా పంచదార రుచి చూచి ‘అబ్బే! తియ్యగా ఉన్నట్లే లేదోయ్ మిత్రమా’ అంది ‘ఉ’ అనే చీమ. ‘అయితే ఒక పని చెయ్యి! నీ నోట్లో ఉప్పుకణాలున్నాయి. వాటిని పూర్తిగా ఉమ్మివేసెయ్యి. అప్పుడుగాని పంచదార రుచేమిటో నీకు తెలీదు’ అన్నది పంచదార చీమ.
‘అంతర్లవణమేవాస్తి బహిర్వమతుమే సఖా’ అనే సూక్తి ఈ విషయాన్నే సూచిస్తున్నది. ఈ మాదిరిగానే గుండెనిండా రాగద్వేషాలు, వ్యామోహాదులను నింపుకొని ఉన్నవానికి గురుబోధ ఎక్కడ ఎక్కుతుంది? వైరాగ్యం ఎలా కుదురుతుంది? వైరాగ్యం కుదరాలంటే అవన్నీ ముందు వదిలించుకోవాలి!
-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి