
జియో పేమెంట్స్ బ్యాంక్ ‘సేవింగ్స్ ప్రో’ (Savings Pro) పేరుతో కొత్త సేవింగ్స్ ఖాతాను తీసుకొచ్చింది. ఇందులో మిగులు నిల్వలపై 6.5 శాతం వరకు వడ్డీ రాబడి పొందొచ్చని ప్రకటించింది. ఇందుకోసం కస్టమర్లు నిర్దేశిత మొత్తాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది కనీసం రూ.5,000 లేదా అంతకుమించి ఉండొచ్చు. ఖాతాలో మొత్తం బ్యాలన్స్ కస్టమర్లు ఎంపిక చేసిన నిర్ణీత మొత్తం మించినప్పుడు, అదనంగా ఉన్న నిధులు ఓవర్‌నైట్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లుతాయి. ఇలా ఒక ఖాతాదారుడు ఒక రోజులో గరిష్టంగా రూ.1.5 లక్షలను ఓవర్‌నైట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ (Invest) చేసుకోవచ్చు.
అవసరమైనప్పుడు ఈ పెట్టుబడుల నుంచి 90 శాతాన్ని వెంటనే వెనక్కి తీసుకోవచ్చు. కాకపోతే ఇలా తక్షణం తీసుకునే మొత్తం రూ.50,000గా ఉంటుంది. మిగిలిన మొత్తం 1–2 రెండు రోజుల్లో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ మొత్తాన్ని జియో ఫైనాన్స్ యాప్ నుంచి సులభంగా చేసుకోవచ్చు. జియో పేమెంట్స్ బ్యాంక్ (Jio Payments Bank) ప్రస్తుత ఖాతాదారులు సైతం సేవింగ్స్ ప్రో ఖాతాకు అప్‌గ్రేడ్ కావొచ్చని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. ఇందులో ఎలాంటి ఎగ్జిట్ లోడ్, ఇతర చార్జీల్లేవని స్పష్టం చేసింది.