ప్రపంచ 5జీ అగ్రగామిగా భారత్ | India telecom sector in 2025 defined by rapid 5G expansion Jio dominance | Sakshi
Sakshi News home page

ప్రపంచ 5జీ అగ్రగామిగా భారత్

Dec 22 2025 2:54 PM | Updated on Dec 22 2025 3:27 PM

India telecom sector in 2025 defined by rapid 5G expansion Jio dominance

కొద్దిరోజుల్లో 2025వ సంవత్సరం ముగుస్తున్న వేళ, టెలికమ్యూనికేషన్‌ రంగంలో భారత్ ప్రపంచ దిగ్గజంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. చరిత్రలోనే అత్యంత వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 40 కోట్లకు (400 మిలియన్లు) చేరుకుంది. ఇది భారతదేశ మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్యలో దాదాపు 32 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఫలితంగా ప్రపంచ డిజిటల్ వృద్ధికి భారత్ ప్రధాన ఇంజిన్‌గా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా 5G విస్తరిస్తున్నప్పటికీ, భారతదేశ వృద్ధి పథం సాటిలేనిదిగా ఉంది. 2025 చివరి నాటికి, ప్రపంచవ్యాప్తంగా 5G కస్టమర్ల సంఖ్య సుమారు 290 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ప్రపంచవ్యాప్త మొబైల్ కస్టమర్ల  సంఖ్య మూడింట ఒక వంతు. 110 కోట్లకు పైగా వినియోగదారులతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, భారత్ రికార్డు వేగంతో ఆ వ్యత్యాసాన్ని తగ్గిస్తోంది. జులై 2025 నాటికి 36.5 కోట్ల వినియోగదారులను చేరుకున్న భారతీయ మార్కెట్, 2030 నాటికి 100 కోట్లకు, 2031 నాటికి 110 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

ముందంజలో జియో

ఈ విప్లవంలో రిలయన్స్ జియో కేవలం భారతీయ లీడర్‌గానే కాకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా అవతరించినట్లు కంపెనీ తెలిపింది. సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2025లో జియో 50 కోట్ల మొబైల్ వినియోగదారుల చారిత్రక మైలురాయిని అధిగమించింది. అక్టోబర్ 31 నాటికి ఆ సంఖ్య 51 కోట్లకు పెరిగింది. కేవలం ఈ ఏడాది మొదటి పది నెలల్లోనే దాదాపు 3 కోట్ల మంది కొత్త వినియోగదారులు చేరారు. కేవలం 5G విభాగంలోనే, 2025 చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 24 కోట్లకు చేరుకోనుంది. జియో మొత్తం వైర్‌లెస్ డేటా ట్రాఫిక్‌లో 5G వాటా ఇప్పుడు 50 శాతంగా ఉంది. 2025 మొదటి తొమ్మిది నెలల్లో ఈ నెట్‌వర్క్ ద్వారా ఏకంగా 162 ఎక్సాబైట్ల (162 బిలియన్ జీబీ) డేటా వినియోగం జరిగింది. 5G నెట్‌వర్క్‌కు మారడం వల్ల ఏడాది ప్రారంభంలో 32.3 జీబీగా ఉన్న సగటు జియో వినియోగదారుని నెలవారీ డేటా వినియోగం ఇప్పుడు 38.7 జీబీకి పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రిలయన్స్ జియో తిరుగులేని డిజిటల్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లు కంపెనీ చెప్పింది. 2025 చివరి నాటికి ఈ ప్రాంతంలో జియో వైర్‌లెస్ వినియోగదారుల సంఖ్య 3.2 కోట్లు దాటినట్లు పేర్కొంది. దూకుడుగా విస్తరణ, సాంకేతిక విజయాలతో తెలుగు రాష్ట్రాల్లో జియో టాప్ పర్ఫార్మర్‌గా నిలిచినట్లు తెలిపింది. మొబైల్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కూడా కంపెనీ విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు స్పష్టం చేసింది. జియో ఎయిర్‌ఫైబర్ సేవలు మార్కెట్ వాటాలో సింహభాగాన్ని దక్కించుకోవడంతో, రెండు రాష్ట్రాల్లో వైర్‌లైన్ వినియోగదారుల సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరుకుందని చెప్పింది.

100 కోట్ల దిశగా ప్రయాణం

భారత ప్రభుత్వం ఈ డిజిటల్ ప్రయాణంపై ధీమాగా ఉంది. 2026 నాటికి దేశీయ 5G వినియోగదారుల సంఖ్య 43 కోట్లకు చేరుతుందని భావిస్తోంది. మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, 5G డివైజెస్ అందుబాటులోకి రావడంతో 2030 నాటికి 100 కోట్ల 5G వినియోగదారుల లక్ష్యం అసాధ్యమేమీ కాదనే అభిప్రాయాలున్నాయి. 5G ప్రారంభించిన కేవలం మూడేళ్లలోనే భారత్ ప్రపంచ నాయకత్వ స్థాయికి చేరుకుంది. ఈ చారిత్రక మార్పులో రిలయన్స్ జియో ముందు వరుసలో నిలిచినట్లు కంపెనీ చెప్పింది.

ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement