రిలయన్స్ కీలక నిర్ణయం
ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ ఆపరేటర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫిబ్రవరి నుంచి రష్యా ముడి చమురు దిగుమతులను తిరిగి ప్రారంభించనుంది. దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చే లక్ష్యంతో రోజుకు సుమారు 1,50,000 బ్యారెళ్ల వరకు రష్యన్ చమురును కొనుగోలు చేయాలని కంపెనీ నిర్ణయించింది. గోవాలో జరుగుతున్న ‘ఇండియా ఎనర్జీ వీక్’ సందర్భంగా రిలయన్స్ ఉన్నతాధికారి ఒకరు ఈ వివరాలను వెల్లడించారు.
ఆంక్షలకు లోబడే కొనుగోళ్లు
గతంలో రష్యా చమురు దిగ్గజాలైన రోస్ నెఫ్ట్, లుకోయిల్ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ గత డిసెంబర్ తర్వాత రష్యా నుంచి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ప్రస్తుతం అమెరికా ఆంక్షల పరిధిలోకి రాని విక్రేతలు, వాణిజ్య మధ్యవర్తుల ద్వారా తిరిగి రష్యా నుంచి చమురును సేకరించాలని రిలయన్స్ భావిస్తోంది. ‘ఫిబ్రవరి, మార్చి నెలల్లో అంతర్జాతీయ నిబంధనలు, ఆంక్షలకు లోబడి ఉన్న రష్యన్ చమురును రిలయన్స్ కొనుగోలు చేయనుంది’ అని రాయిటర్స్ నివేదిక తెలిపింది.
జామ్ నగర్ రిఫైనరీ సామర్థ్యం
గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ రోజుకు 1.4 మిలియన్ బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతంలో రోస్ నెఫ్ట్‌తో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం రోజుకు 5,00,000 బ్యారెళ్ల వరకు రష్యా చమురును దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రిలయన్స్ తన సరఫరా వనరులను వైవిధ్యపరుచుకుంటోంది.
టర్మ్ డీల్స్ ద్వారా నిరంతర సరఫరా కోసం సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. కొంతభాగం ఉత్తర అమెరికా-కెనడా నుంచి చమురు సేకరిస్తోంది. వెనిజువెలా ముడి చమురును తిరిగి దిగుమతి చేసుకునేందుకు అమెరికా అనుమతి కోసం రిలయన్స్ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది.
ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..


