చండీగఢ్: హర్యానాలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువ బాస్కెట్‌బాల్ క్రీడాకారులు ప్రాక్టీస్ సమయంలో మరణించిన ఘటనలు రాష్ట్రాన్ని విషాదంలో ముంచాయి. రోహ్‌తక్‌లో 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు హార్దిక్ మృతి చెందాడు. బహదూర్‌గఢ్‌లో 15 ఏళ్ల అమన్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా ఒక బాస్కెట్‌బాల్ స్తంభం అతనిపై పడి మరణించాడు. ఈ ఘటనలు క్రీడా మైదానాల్లో భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.
రోహ్‌తక్‌లోని లఖన్ మజ్రా ప్రాంతంలోని బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో హార్దిక్ ప్రాక్టీస్ చేస్తుండగా బాస్కెట్‌బాల్ స్తంభం అకస్మాత్తుగా అతని మీదకు కూలిపోయింది. తన స్నేహితులు అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించినా ఆ యువకుడిని రక్షించలేకపోయారు.
ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైంది. హార్దిక్ మూడు పాయింట్ల లైన్ నుంచి దూకి బాస్కెట్‌ను తాకిన తర్వాత స్తంభం తనపై పడిపోతున్నట్టు ఆ వీడియోలో రికార్డైంది. బాస్కెట్‌బాల్ ఆటగాళ్ళు తమ స్కోరింగ్ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి ఈ చర్యను అభ్యసిస్తారు.
మొదటి ప్రయత్నం సజావుగా చేసిన హార్దిక్, మరోసారి అదే పని చేశాడు. అయితే బాస్కెట్ అంచును పట్టుకున్న క్షణంలో స్తంభం నేరుగా అతని ఛాతీపై పడింది. వెంటనే అక్కడ ఉన్న తన స్నేహితులు పరుగెత్తి వచ్చి స్తంభాన్ని ఎత్తినప్పటికీ లాభం లేదు. అప్పటికే హార్దిక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
హార్దిక్ ఇటీవలే జాతీయ శిక్షణ శిబిరం నుండి తిరిగి వచ్చాడు. అతని తండ్రి సందీప్ రతి తన ఇద్దరు కుమారులను స్థానిక స్పోర్ట్స్ క్లబ్‌లో చేర్పించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బహదూర్‌గఢ్‌లో మరో విషాదం: 15 ఏళ్ల అమన్ మరణం
అయితే ఇదే తరహా ప్రమాదం బహదూర్‌గఢ్ జిల్లాలో జరిగింది. 15 ఏళ్ల అమన్ ప్రాక్టీస్ చేస్తుండగా బాస్కెట్‌బాల్ స్తంభం అతనిపై పడింది. తీవ్రంగా గాయపడిన అమన్‌ను PGIMS రోహ్‌తక్‌కు తరలించారు. కానీ ప్రాణం నిలవలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యులు సమయానికి సరైన చికిత్స అందించకపోవడం వల్లే అమన్ మరణించాడని ఆరోపించారు. 10వ తరగతి చదువుతున్న అమన్, ఇటీవలే పాఠశాల వార్షిక క్రీడా పోటీల్లో పతకం సంపాదించాడు.
రోహ్‌తక్, బహదూర్‌గఢ్ ప్రమాదాలపై కేసులు నమోదు కాగా క్రీడా శాఖ కూడా భద్రతా చర్యలపై సమీక్ష ఆదేశించినట్టు సమాచారం.


