ఢిల్లీ: ఎర్రకోట కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కశ్మీర్ మిలిటెంట్ గ్రూప్ నాయకుడు, హిజ్బుల్ ముజాహిదీన్‌లో కమాండర్‌గా ప్రసిద్ధి పొందిన బుర్హాన్ ముజాఫర్ వాని ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఢిల్లీ కారు పేలుడు జరిపినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ‘సూసైడ్ బాంబర్’గా మారి పదుల సంఖ్యలు ప్రాణాలు తీశాడు.
అలా ప్రాణాలు తీసే ముందు తనలాగే వైట్ కాలర్ ఉగ్రవాదులగా మారిన ఇతరులకు తాను పాలకుడిని, నాయకుడిని అని, ఎమిర్(రాజుగా) అని పిలిపించుకునేవాడని తేలింది. బుర్హాన్ ముజాఫర్ వాని ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని గతంలో పలు మార్లు వారికి చెప్పినట్లు సమాచారం.
ఢిల్లీ కారు పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు హర్యానాలోని ఫరీదాబాద్‌లో అనుమానిత వైట్ కాలర్ ఉగ్రవాదుల్ని ప్రశ్నించినప్పుడు ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ ఉన్ నబీని ‘ఎమిర్’గా వర్ణించిన వ్యక్తి, అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా పనిచేసే ముజామిల్ షకీల్ అని అధికారులు నిర్ధారించారు. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రధాన వ్యక్తి మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ ద్వారా దేశంలోని పలువుర్ని వైట్ కాలర్ ఉగ్రవాదిగా మార్చేందుకు ప్రయత్నం చేశారు. అలా వైట్ కాలర్ ఉగ్రవాదిగా రిక్రూట్ చేసిన వ్యక్తి కూడా ఉమన్ ఉన్ నబీనేనని తేలింది.
షాహీన్ సయీద్ కూడా
విచారణలో అరెస్టయిన మరో అనుమానితుడు షాహీన్ సయీద్ కూడా దర్యాప్తుకు ఉపయోగపడే కీలక సమాచారాన్ని అందించినట్లు వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు అధికారుల ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన డాక్టర్ ముజామిల్ షకీల్ ఇటీవల ఎర్రకోట వద్ద కారు పేలుళ్ల కేసులో కీలక నిందితుడిగా అరెస్టయ్యాడు. ఆయన పేలుడు పదార్థాలు తయారు చేయడం, రసాయనాలను ప్రాసెస్ చేయడం, విపరీతమైన ఎక్స్‌ప్లోసివ్ మెటీరియల్ నిల్వ చేయడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు విచారణ సంస్థలు పేర్కొన్నాయి.
ఆపరేషన్ ఎమిర్
ముజామిల్ షకీల్ తనను తాను కేవలం పని వాడిగా మాత్రమే భావించేవాడని, ఉమర్ ఉన్ నబీకి ఉన్న హోదా, అనుభవం, ప్రభావం తమ మాడ్యూల్‌లో అత్యంత ఉన్నత స్థాయిలో ఉండేదని తెలిపాడు. మాడ్యూల్ సభ్యులు తమ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ ఎమిర్’ అని పేరు పెట్టడం కూడా ఉమర్ ఉన్ నబీకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆత్మాహుతి బాంబర్‌గా వ్యవహరించిన ఉమర్ ఉన్ నబీ వైట్ కాలర్ ఉగ్రవాదులకు ఆదేశాలు, సూచనలు ఆధారంగానే మిగతా సభ్యులు పనిచేసినట్లు విచారణలో బయటపడింది.
బుర్హాన్ ముజఫర్ వాని
బుర్హాన్ ముజఫర్ వాని దక్షిణ కశ్మీర్ లోని సంపన్న కుటాంబానికి చెందిన ఓ యువకుడు. అయితే 2010లో తన సోదరుడిని ఆర్మీ బలగాలు చంపాయన్న కారణంగా 15 ఏళ్ల వయసులోనే ఉగ్రవాద గ్రూపులో చేరిపోయాడు. అప్పటి నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మిలిటెంట్ల ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం, తన ప్రసంగాలతో యువకులను మిలిటెంట్లుగా మారేందుకు ఉత్తేజ పరిచేవాడు. అలా వందల సంఖ్యలో మిలిటెంట్లుగా మార్చడంలో బుర్హాన్ ముజఫర్ వాని కీలక పాత్ర పోషించాడు. 2016లో భారత భద్రతా బలగాలు అతడిని ఎన్‌కౌంటర్ చేశాయి. ఆ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఉమర్ ఉన్ నబీ ఢిల్లీ కారు పేలిన ఘటనలో సూసైడ్ బాంబార్‌గా మారి అమాయకుల్ని పొట్టనబెట్టుకున్నాడు.


