2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేస్తున్నాం
గ్రిడ్‌ల బలోపేతం, డిజిటల్ పంపిణీ లాంటి వాటిపై దృష్టిపెడతాం
‘ద జస్ట్ ట్రాన్సిషన్ ఇన్‌టు 2047: పవరింగ్ తెలంగాణ
ఫ్యూచర్’ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం 2047 నాటికి నిర్దేశించుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ విజన్‌కు విద్యుత్ వ్యవస్థే కేంద్ర బిందువని.. తాము ఎదగడంతోపాటు నలుగురూ ఎదిగేలా బాధ్యతతో ఈ విజన్‌లో ముందుకెళ్లాలని అనుకుంటున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. పారిశ్రామీకరణ నుంచి జీవన ప్రమాణాల నాణ్యత వరకు నిర్దేశించే విద్యుత్ వ్యవస్థ మార్పు, వాతావరణ చర్యలను కీలక అభివృద్ధి వ్యూహంగా ఎంచుకున్నామని వెల్లడించారు.
గ్లోబల్ సమ్మిట్–2025లో భాగంగా సోమవారం ఫ్యూచర్ సిటీలో ‘ద జస్ట్ ట్రాన్సిషన్ ఇన్‌టు 2047: పవరింగ్ తెలంగాణ ఫ్యూచర్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో భట్టి పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాన్ని, విద్యుత్ రంగంలో మార్పుల ఆవశ్యకత, ప్రణాళికలు, సహకారం గురించి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విజన్‌కు విద్యుత్ వ్యవస్థే కేంద్ర బిందువు లాంటిదని చెప్పారు. పారిశ్రామీకరణ, ఉద్యోగ సృష్టి, వ్యవసాయ శ్రేయస్సు, జీవన ప్రమాణాల నాణ్యతను విద్యుత్ వ్యవస్థ నిర్దేశిస్తుందన్నారు. అందుకే రాష్ట్రాభివృద్ధి వ్యూహంలో ఇంధన మార్పు, వాతావరణ చర్యలను చేర్చామని పేర్కొన్నారు.
100 శాతం స్వచ్ఛ వాహనాల రవాణా వ్యవస్థ, 2030 నాటికి దేశంలోనే ఈ–బస్సులను ఎక్కువగా వినియోగించే నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడం, ప్రస్తుతమున్న 11.4 గిగావాట్లకు తోడు మరో 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి కోసం ఇప్పటికే రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నట్లు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం, అటవీ ప్రాంతాల విస్తరణ, కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండే పారిశ్రామిక వృద్ధిని తెలంగాణ భవిష్యత్ కార్యాచరణగా నిర్దేశించుకున్నాం. 2047 నాటికి పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా 1.39 లక్షల మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ అవసరమవుతుందని అంచనాలున్నాయి.
అందుకు పునరుత్పాదక ఇంధనాలతోపాటు నిల్వ సౌకర్యం, అవసరమైనంత థర్మల్ సామర్థ్యం, డిజిటల్ గ్రిడ్, పంపిణీ వ్యవస్థలు కావాలని అభిప్రాయపడ్డారు. సదస్సులో ఇదం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ కో ఫౌండర్ అజిత్ పండిట్, ఎనీ్టపీసీ గ్రీన్ సీఈవో సరిత్ మహేశ్వరి, మహాలక్ష్మి గ్రూప్ ఫౌండర్ హరీశ్ యార్లగడ్డ, ఈవై పార్ట్‌నర్ మహ్మద్ సైఫ్, నెట్‌జీరో ట్రాన్స్‌మిషన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నేత్రా వాల్క్‌వాకర్, ‘ఆస్కి’ ప్రొఫెసర్ రాజ్‌కిరణ్ వి. బిలోలికర్, తదితరులు ప్యానెల్ స్పీకర్లుగా వ్యవహరించారు.


