ఏటీఎంలకు డిజిటల్‌ గ్రహణం!  | Challenges Facing the ATM Industry in 2025 | Sakshi
Sakshi News home page

ATM: ఏటీఎంలకు డిజిటల్‌ గ్రహణం! 

May 16 2025 4:21 AM | Updated on May 16 2025 4:51 PM

Challenges Facing the ATM Industry in 2025

ఖర్చుల్లో కోతకు ఏటీఎంలను మూసేస్తున్న బ్యాంకులు 

డిజిటల్‌ లావాదేవీల జోరు ఎఫెక్ట్‌... 

ఏడాదిలో 5,500 ఏటీఎంలకు తాళం 

దేశంలో డిజిటల్‌ లావాదేవీల విప్లవం ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషీన్‌ (ఏటీఎం)లకు గండి కొడుతోంది. ఒకపక్క బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు చెలామణీ అంతకంతకూ ఎగబాకుతూ ఆల్‌టైమ్‌ గరిష్టాల్లో కొనసాగుతోంది. మరోపక్క ఏటీఎంలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకులు కొత్తగా తెరుస్తున్న ఏటీఎంల కంటే మూసేస్తున్నవే ఎక్కువ కావడం విశేషం!    

కొత్తిమీర కట్ట నుంచి బైకులో పెట్రోలు దాకా దేనికైనా డిజిటల్‌ చెల్లింపులే నడుస్తున్నాయిప్పుడు! మన దైనందిన ఆరి్థక లావాదేవీల్లో యూపీఐ పేమెంట్స్‌ అంతలా పెనవేసుకుపోయాయి మరి. దీంతో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాలు కూడా తగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే, ఒకప్పుడు మెయిన్‌ రోడ్లపైనే కాకుండా సందుల్లో కూడా ఎడాపెడా ఏటీఎంలను తెరిచిన బ్యాంకులు.. ఇప్పుడు చడీచప్పుడు లేకుండా వాటికి తాళాలేస్తున్నాయి. 

ఆర్‌బీఐ నిబంధనల మేరకు ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితులు విధించడం, ఏటీఎం ఇంటర్‌–ఆపరబిలిటీ, వేరే బ్యాంకుల కస్టమర్లు ఏటీఎంలను ఉపయోగించుకునేటప్పుడు విధించే ఇంటర్‌చేంజ్‌ ఫీజు పెరుగుదల పెద్దగా లేకపోవడంతో బ్యాంకులు ఏటీఎంల నిర్వహణ బిజినెస్‌ పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ఏటీఎంల ఏర్పాటుకు ముఖం చాటేస్తున్నాయి. 

బ్యాంకింగ్‌ రంగంలో దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్‌ నాటికి 2,19,882 ఏటీఎంలు ఉండగా, 2024 డిసెంబర్‌ నాటికి వీటి సంఖ్య 2,14,398కి తగ్గిపోయింది. అంటే దాదాపు ఏడాది వ్యవధిలో 5,484 ఏటీఎంలను ఎత్తేశాయన్నమాట! ముఖ్యంగా ఆఫ్‌సైట్‌ (బ్యాంకు బ్రాంచ్‌లలో కాకుండా ఇతర లొకేషన్లలో ఉన్నవి) ఏటీఎంల విషయంలో ఈ కోత భారీగా ఉంది. 2022 సెపె్టంబర్లో గరిష్టంగా 97,072 ఆఫ్‌సైట్‌ ఏటీఎంలు ఉండగా.. 2024 డిసెంబర్‌ నాటికి ఇవి 85,913కి తగ్గిపోవడం గమనార్హం. 

డిజిటల్‌ రయ్‌... 
బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు చెలామణీ ప్రస్తుతం ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలో రూ.34.7 లక్షల కోట్లకు పైగానే ఉంది. పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్‌) నుంచి చూస్తే రెట్టింపైంది. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 12 శాతం కింద లెక్క. ఇంతలా నగదు వ్యవస్థలో ఉన్నప్పటికీ, ఏటీఎంల సంఖ్య పెరక్కపోగా.. అంతకంతకూ తగ్గుతుండటం విశేషం.

 ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు 15 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. కాగా, 2024 పూర్తి ఏడాదికి చూస్తే, 17,200 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2023తో పోలిస్తే (11,760 కోట్లు) 46 శాతం దూసుకెళ్లాయి. మరోపక్క, ఆర్‌బీఐ అనుమతితో ఈ నెల 1 నుంచి ఏటీఎం చార్జీలను బ్యాంకులు పెంచేశాయి. 

దీంతో ఉచిత లావాదేవీల పరిమితి దాటితే, ప్రతి లావాదేవీకి ఇప్పు డున్న రూ.21 చార్జీ రూ.23కు పెరిగింది. నెలకు సొంత బ్యాంకుల ఏటీఎంలలో 5, ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయాని కొస్తే మెట్రోల్లో అయితే 3, నాన్‌ మెట్రోల్లో 5 లావాదేవీలు ఉచితం. క్యాష్‌ విత్‌డ్రాతో పాటు బ్యాలెన్స్‌ ఎంక్వయిరీ వంటివన్నీ లావాదేవీగానే పరిగణిస్తున్నారు.

ఎనీటైమ్‌ సమస్యలు...! 
కొన్ని బ్యాంకులు బ్రాంచ్‌ల వద్ద ఏటీఎంలను బాగానే నిర్వహిస్తున్నప్పటికీ, ఆఫ్‌సైట్‌ ఏటీఎంల విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు చూసినా సాంకేతిక సమస్యలు, లేదంటే క్యాష్‌ లేకపోవడం వంటివి కస్టమర్లకు నిత్యకృత్యంగా మారుతున్నాయి. దీంతో అత్యవసరంగా క్యాష్‌ విత్‌డ్రా చేసుకోవాలంటే రెండు మూడు ఏటీఎంలకు తిరగాల్సి వస్తోందనేది అధిక శాతం మంది ఖాతాదారుల ఫిర్యాదు. 

‘దేశంలో ప్రస్తుత ఏటీఎంల ట్రెండ్‌ను పరిశీలిస్తే, బ్యాంకింగ్‌ రంగంలో టెక్నాలజీ, ముఖ్యంగా డిజిటల్‌ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క, బ్యాంకింగ్‌ సేవలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాలపై బ్యాంకులు దృష్టి పెట్టడం కూడా మొత్తంమీద ఏటీఎంలు తగ్గుముఖం పట్టడానికి కారణం’ అని ఆన్‌లైన్‌ పేమెంట్‌ సరీ్వస్‌ ప్రొవైడర్‌ ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ చైర్మన్‌ రవి బి. గోయల్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల నేపథ్యంలో నెట్‌వర్క్‌ స్థిరీకరణ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.

34.7 లక్షల కోట్లు: బ్యాంకింగ్‌ వ్యవస్థలో చెలామణీలో ఉన్న నగదు (జీడీపీలో ఇది 12 శాతం).

2,14,398: 2024 డిసెంబర్‌ నాటికి దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల మొత్తం ఏటీఎంల సంఖ్య (స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు సహా). ఇందులో 1,28,485 ఆన్‌సైట్, 85,913 ఆఫ్‌సైట్‌ ఏటీఎంలు ఉన్నాయి.

36,000: దేశంలో వైట్‌ లేబుల్‌ ఏటీఎంల సంఖ్య దాదాపుగా. ప్రస్తుతం ఈపీఎస్, ఇండియా1 పేమెంట్స్, హిటాచి పేమెంట్‌ సరీ్వసెస్, టాటా కమ్యూనికేషన్స్‌ పేమెంట్‌ సొల్యూషన్స్, వక్రంగీ.. ఈ ఐదు ప్రైవేటు కంపెనీలు వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లుగా ఉన్నాయి. 
17,200 కోట్లు : 2024లో యూపీఐ లావాదేవీల సంఖ్య (రోజువారీగా సగటు విలువ రూ. 74,990 కోట్లు)

 – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement