ఒక్కొక్కరికి ఎంత చెందాలో కూడా పేర్కొనవచ్చు
సేఫ్టీ లాకర్‌లకు ఒకరి తర్వాతే ఒకరు
నవంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాదారులు, డిపాజిటర్లు ఇకపై నలుగురు వ్యక్తులను నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సవరణ చట్టం, 2025ను ఈ ఏడాది ఏప్రిల్ 15న నోటిఫై చేయగా, నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇందులో మొత్తం 19 సవరణలు చేశారు. వీటి ప్రకారం బ్యాంక్ ఖాతాదారులు ఒకేసారి నలుగురిని నామినీగా (ప్రతినిధి/నియమితుడు) నమోదు చేసుకోవచ్చు.
ఖాతాదారుడు/డిపాజిటర్ మరణానంతరం క్లెయిమ్ సమయంలో ఎవరికి ఎంత శాతం చెందాలన్నది నిర్దేశించొచ్చు. ఒకే విడత నలుగురు లేదంటే ఒకరి తర్వాత ఒకరి నామినీ అమల్లోకి వచ్చేలా (సక్సెసివ్) ప్రతిపాదించొచ్చు. సేఫ్టీ లాకర్లలో ఉంచిన వస్తువులకు సంబంధించి ఒకే విడత నలుగురిని కాకుండా, ఒకరి తర్వాత ఒకరి నామినీ అమల్లోకి వచ్చేలా నమోదు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అంటే మొదటి నామినీ మరణించిన తర్వాతే రెండో నామినీ అమల్లోకి వస్తుంది.
ఒక్కరినే నామినీగా ప్రతిపాదించిన సందర్భాల్లో, సదరు వ్యక్తి కూడా అందుబాటులో లేకపోతే క్లెయిమ్ పరంగా ఇబ్బందులు రాకుండా ఈ సవరణ తీసుకొచి్చనట్టు తెలుస్తోంది. ‘‘ఈ కొత్త నిబంధనల అమలుతో నామినేషన్ల విషయంలో డిపాజిటర్లకు సౌలభ్యం ఏర్పడుతుంది. తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా నామినీలను ప్రతిపాదించొచ్చు. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ అంతటా క్లెయిమ్‌ల పరిష్కారాల విషయంలో పారదర్శకత, ఏకరూపత, సమర్థత నెలకొంటుంది’’అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది.
బ్యాంకుల్లో పాలన పటిష్టం
బ్యాంకింగ్ రంగంలో పాలనా ప్రమాణాలను పటిష్టం చేయడం, ఆర్‌బీఐకి వెల్లడించే సమాచారం విషయంలో ఏకరూపత, డిపాజిటర్లు, పెట్టుబడిదారుల ప్రయోజనాల రక్షణ, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఆడిట్ నాణ్యత పెంచడం, నామినీ సదుపాయం పరంగా కస్టమర్లకు సౌకర్యవంతమైన సేవలు అందించే లక్ష్యాలతో బ్యాంకింగ్ చట్టంలో సవరణలను కేంద్రం ప్రతిపాదించింది.


