నాకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఒకటే ఉంది. అందులో జీతమే పడుతుందని కొందరు.. పెన్షన్ తప్ప ఇంకేమీ వేయనని ఇంకొందరు.. మార్చి నెలాఖరుకల్లా చాలా తక్కువ.. అంటే మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంటుందని మరికొందరు చెప్తుంటారు. అక్షరాలా ఇదే నిజమైతే ఏ ఇబ్బందీ ఉండదు. కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంటు వ్యవహారాల మీద ఎలాంటి నిఘా ఉండదు. కేవలం ఫిక్సిడ్ డిపాజిట్ల మీదే దృష్టి ఉంటుందని కొందరి పిడివాదన.
డిపార్టుమెంటు వారికి అవేమీ పట్టవు. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా అన్ని బ్యాంకులు, అన్ని బ్రాంచీలు ప్రతి సంవత్సరం విధిగా, మీకు సంబంధించిన అన్ని సేవింగ్స్ ఖాతాల వ్యవహారాలను కొన్ని నిబంధనలకు లోబడి డిపార్టుమెంటుకు చేరవేస్తాయి. ఆ చేరవేత, ఆ తర్వాత ఏరివేత.. మెదడుకి మేత.. కృత్రిమ మేథస్సుతో వాత.. వెరసి మీకు నోటీసుల మోత! అసాధారణమైన నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ వారి దృష్టిలో పడతాయి. వివిధ సంస్థలు, ఏజెన్సీలు ప్రతి సంవత్సరం ‘‘నిర్దేశిత ఆర్థిక వ్యవహారాల’’ను ఒక రిటర్ను ద్వారా తెలియజేస్తాయి.
పది లక్షలు దాటిన నగదు డిపాజిట్లు
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి కాని, దఫదఫాలుగా కానీ వెరసి నగదు డిపాజిట్లు రూ. 10,00,000 దాటితే మీ ఖాతా వ్యవహారాలు.. సేవింగ్స్ ఖాతాలో పడినట్లు కాదు.. డిపార్టుమెంటు వారి చేతిలో పడ్డట్లే.
విత్‌డ్రాయల్స్
కొందరు తమ ఖాతాల నుంచి పెద్ద మొత్తాలు విత్‌డ్రా చేస్తారు. వ్యాపారం నిమిత్తం, పెళ్లి ఖర్చుల నిమిత్తం.. ఇలా చేయడం చట్టపరంగా తప్పు కాకపోవచ్చు. అసమంజసంగా అనిపిస్తే ఆరా తీస్తారు. ‘సోర్స్’ గురించి కూపీ లాగుతారు.
క్రెడిట్ కార్డులపై భారీ చెల్లింపులు
అకౌంటు ద్వారా పెద్ద పెద్ద మొత్తాలు క్రెడిట్ కార్డుల చెల్లింపులకు వెళ్తుంటాయి. వీటి మీద నిఘా, విచారణ ఉంటాయి.
రూ. 30,00,000 దాటిన క్రయ విక్రయాలు..
ఇలాంటి క్రయవిక్రయాలను సబ్‌రిజిస్టార్ వాళ్లు ప్రతి సంవత్సరం రిపోర్ట్ చేస్తారు. వెంటనే బ్యాంకు అకౌంట్లను చెక్ చేస్తారు. సాధారణ పద్దులు/రొటీన్ పద్దులు ఉండే అకౌంట్లలో పెద్ద పెద్ద పద్దులుంటే, వారి అయస్కాంతంలాగా వారి దృష్టికి అతుక్కుపోతాయి.
విదేశీయానం.. విదేశీ మారకం..
విదేశీయనం నిమిత్తం, విదేశీ చదువు కోసం, విదేశాల్లో కార్డుల చెల్లింపులు... ఇలా వ్యవహారం ఏదైనా కానీ రూ. 10,00,000 దాటితో పట్టుకుంటారు. దీనికి ఉపయోగించిన విదేశీ మారకం, చట్టబద్ధమైనదేనా లేక హవాలానా అనేది ఆరా తీస్తారు.
నిద్రాణ ఖాతాల్లో నిద్ర లేకుండా చేసే వ్యవహారాలు
కొన్ని సంవత్సరాలపాటు ఎటువంటి లావాదేవీలు ఉండని ఖాతాలను నిద్రాణ లేదా ని్రష్కియ ఖాతాలని అంటారు. వాటిలో అకస్మాత్తుగా పెద్ద పెద్ద వ్యవహారాలేమైనా జరిగాయంటే.. అధికారుల కళ్లల్లో పడతాయి. ఇలాంటి వ్యవహారాలు అధికారుల దృష్టిని ఆకట్టుకుంటే.. వారు వెంటనే పట్టుకుంటారు.
డిక్లేర్ చేయని వ్యవహారాలు
చనిపోయిన మావగారు, పెళ్లప్పుడు ఇచ్చిన స్థలాన్నో, ఇళ్లనో ఇప్పుడు అమ్మేసి, వచి్చన ఆ పెద్ద మొత్తాన్ని అకౌంటులో వేసి, ఆయన ఆత్మశాంతి కోసం మౌనం పాటిస్తే అది మౌనరాగం కాదు. గానాబజానా అయిపోతుంది. ఖజానాకి చిల్లులు పడతాయి.
పొంతన లేని డివిడెండ్లు.. వడ్డీ..
కొన్న షేర్లు భారీగా ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్లు కొండంత ఉన్నా డివిడెండ్లు, వడ్డీల రూపంలో ఆదాయం ఆవగింజంత కనిపిస్తోందంటే ..తస్మాత్ జాగ్రత్త.
ఎన్నో అకౌంట్లు .. కానీ ఒక్కదాన్నే..
కొందరికి ఎన్నో అకౌంట్లు ఉంటాయి. తప్పు లేదు. కానీ వారు ఇన్‌కంట్యాక్స్ రిటర్నుల్లో ‘ఏకో నారాయణ’ అన్నట్లు ఒక దాన్ని మాత్రమే డిక్లేర్ చేస్తారు. డిపార్టుమెటు వారి దగ్గర మీ పది అకౌంట్ల వివరాలు పదిలంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.
వేరే వ్యక్తుల సహాయార్థం..
ఏదో, సహాయమని, బంధువులు, స్నేహితుల పెద్ద పెద్ద వ్యవహారాలను మీ అకౌంట్లలో నడిపించకండి. వివరణ మీరు ఇవ్వాల్సి వస్తుంది.. ఇవ్వగలరా? అప్పులను తిరిగి చెల్లించేటప్పుడే ఆశగా ఎక్కువ వడ్డీ చూపించి, పెద్ద మొత్తాన్ని మీ అకౌంట్లో వేసి, ‘నా పేరు చెప్పకు గురూ’ అని అంటారు.. కానీ, వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేంటి అనే అటలాగా, వీళ్ల వ్యవహారాలేంటి.. వాళ్ల వ్యవహారాలేంటి అని ఆరా తీస్తూ, దొంగ లావాదేవీలు లేదా డిక్లేర్ చేయని లావాదేవీలను డిపార్టుమెంటు వారు కళ్లు మూసుకుని సైతం పట్టేస్తారనే విషయాన్ని అర్థం చేసుకుని మనం కళ్లు తెరుచుకుని ఉండాలి.



