ప్రపంచవ్యాప్తంగా 77% మంది మహిళలకు ఖాతాలు
భారత్‌లో ఏకంగా 89% మందికి బ్యాంక్ అకౌంట్స్
జన్ ధన్ యోజన ఖాతాల్లోనూ మహిళలదే ఆధిక్యం
ప్రపంచవ్యాప్తంగా 100 మంది మహిళల్లో 77 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మన దేశం మాత్రం ఈ విషయంలో ప్రపంచ సగటు కంటే చాలా మెరుగ్గా ఉంది. ప్రపంచ బ్యాంకు ఫైండెక్స్ రిపోర్ట్–2025, సీఎంఎస్–టెలికం రిపోర్ట్–2025 ప్రకారం భారత్‌లో ఏకంగా 89% మంది మహిళలు బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తుండడం విశేషం. ఆర్థిక కార్యకలాపాల్లోనూ అత్యధిక మహిళలు నిమగ్నమయ్యారనడానికి ఇది నిదర్శనం. ఆర్థిక విషయాలపట్ల పెరుగుతున్న అవగాహన, జన్ ధన్ ఖాతాలు, ప్రభుత్వ పథకాల తాలూకా ఆర్థిక ప్రయోజనాలు నేరుగా ఖాతాల్లోకి చేరడం.. వెరసి బ్యాంకు సేవలు అందుకుంటున్న స్త్రీల సంఖ్య పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా 2025 ఆగస్టు నాటికి 56 కోట్లకుపైగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు తెరిచారు. వీటిలో 55.7 శాతం ఖాతాలు మహిళలకు చెందినవి కావడం విశేషం. ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఫైండెక్స్ డేటాబేస్ 2025 ప్రకారం 54% భారతీయ మహిళలు తమ మొదటి బ్యాంకు ఖాతాను ప్రధానంగా ప్రభుత్వ ప్రయోజనాలు లేదా వేతనాలను పొందడానికి తెరిచారు. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా, ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువగా 89% మంది భారతీయ మహిళలు బ్యాంకు ఖాతాను కలిగి ఉండడం గమనార్హం.
తగినంత నగదు లేక..
ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా అందుకున్న నగదుపై మహిళల నియంత్రణ పెరిగిందని నివేదిక తెలిపింది. స్త్రీ పేరుతో ఉన్న ఆదాయం.. గృహ నిర్ణయాలలో ఆమె వాటాను పెంచుతుందని.. కుటంబ అభివృద్ధికి దోహదపడుతుందని పరిశోధనలో తేలింది. బ్యాంకు ఖాతాల విషయంలో ప్రపంచ సగటుతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఖాతాల్లో తగినంత నగదు లేకపోవడం, తక్కువ అవసరం, అధికారిక బ్యాంకింగ్‌లో పాల్గొనడంలో అసౌకర్యం కారణంగా 17.5 శాతం బ్యాంకు ఖాతాలు క్రియాశీలకంగా లేవు.
మరొకరిపై ఆధారం..
డేటా ఖర్చులు, గోప్యత లేకపోవడం, సైబర్ మోసం భయం, సామాజిక నిబంధనల వంటివి మహిళలు మొబైల్ ఫోన్లు కొనకుండా అడ్డుకుంటున్నాయని నివేదిక తెలిపింది. సొంతంగా మొబైల్ లేకపోవడం స్వతంత్ర డిజిటల్ బ్యాంకింగ్‌ను పరిమితం చేస్తోంది. భారతీయ మహిళల్లో 66 శాతానికిపైగా ఇప్పటికీ ఆర్థిక లావాదేవీలు చేయడానికి పురుష బంధువులపై ఆధారపడుతున్నారట. ప్రభుత్వ పథకాలు ఆర్థిక సాధికారతకు నిజమైన సాధనంగా మారాలంటే.. మహిళల బ్యాంకు ఖాతాలలో డబ్బును జమ చేయడమేకాదు, లబ్ధిదారులకు దీర్ఘకాలిక మద్దతు అవసరమని నివేదిక వివరించింది. సబ్సిడీ స్మార్ట్‌ఫోన్లు, సరసమైన డేటా ప్లాన్లు.. మహిళలు తమ ఖాతాలను, డిజిటల్ చెల్లింపు సాధనాలను స్వతంత్రంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తాయి.
బ్యాంకు ఖాతాలను ఉపయోగించి ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం (శాతాల్లో)
⇒ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు - 89
⇒ డెబిట్ కార్డుదారులు - 30
⇒ నగదు పంపడం, విత్‌డ్రా - 25
⇒ ఖాతాలో పొదుపు - 21.2
⇒ డిజిటల్ చెల్లింపులకు కార్డు/మొబైల్ వాడకం - 18.9
⇒ క్రియాశీలకంగా లేని ఖాతాలు - 17.5
⇒ రుణం తీసుకున్నవారు - 11.9
⇒ వ్యాపారానికి రుణం - 9
⇒ యుటిలిటీ బిల్లులు చెల్లించినవారు - 8.4
⇒ డిజిటల్ పేమెంట్స్ చేసినవారు - 7.8
మహిళలకు అందుబాటులో మొబైల్.. ఆర్థిక లావాదేవీలలో దాని వినియోగం (శాతాల్లో)
⇒ ఖాతా నిల్వ పరిశీలనకు మొబైల్, ఇంటర్‌నెట్ వాడినవారు - 27
⇒ పురుషుల సాయం లేకుండా లావాదేవీ నిర్వహించినవారు - 28
⇒ కుటుంబ సభ్యులకు తన ఫోన్ ఇచ్చేవారు - 31
⇒ తన పేరుతో సిమ్ ఉన్నవారు - 32
⇒ ఇతరుల ఫోన్ వాడడం వల్ల సొంతంగా మొబైల్ లేనివారు - 24
⇒ భద్రతా కారణాలతో సొంతంగా ఫోన్ లేనివారు - 18
⇒ చదవడం, టైపింగ్ రాకపోవడం వల్ల ఫోన్ లేనివారు - 27
⇒ డబ్బులు లేక మొబైల్ కొనుక్కోలేనివారు - 32
⇒ టెలికం సేవలు ఖరీదు కావడం వల్ల ఫోన్ కొనలేనివారు - 38


