బ్యాంకు ఖాతాలో డబ్బు పోగవ్వకుండా ప్రభుత్వం నిర్ణయం
దేశవ్యాప్తంగా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల (బ్యాంకు ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని నగదు) సమస్య బ్యాంకులకు, ఖాతాదారుల కుటుంబాలకు దీర్ఘకాలంగా సవాలుగా మారింది. ఖాతాదారు చనిపోయిన తర్వాత సరైన నామినేషన్ లేకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో పోగవుతున్నాయి. దాంతోపాటు నామినీగా ఉన్న వారికిసైతం సరైన అవగాహన లేకపోవడంతో భారీగా డబ్బు ఖాతాల్లో మూలుగుతుంది. ఈ నేపథ్యంలో అన్‌క్లెయిమ్డ్ నగదును తగ్గించి, చట్టపరంగా నామినీలకు డబ్బు చేరే ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఒక ఖాతాకు నలుగురు నామినీలను నియమించుకునేలా నిబంధనలు సడలించింది. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఇప్పటివరకు ఇలా..
ఇప్పటివరకు బ్యాంకు పొదుపు ఖాతాకు ఒకే నామినీని మాత్రమే నియమించే అవకాశం ఉండేది. ఈ నిబంధన అనేక సమస్యలకు దారితీసింది. కొందరు ఖాతాదారులైతే అసలు నామినీని యాడ్ చేయాలని కూడా గుర్తించడం లేదు. ఇంకొందరు నామినీని చేర్చినా ఆ విషయం తమ నామినీకి చెప్పడంలేదు. ఖాతాలో పేరున్న ఒక్క నామినీ ప్రమాదవశాత్తు ఖాతాదారుడి కంటే ముందు మరణిస్తే అకౌంట్‌లోని నగదు మళ్లీ అన్‌క్లెయిమ్డ్‌గానే మిగిలిపోతుంది. ఆ నగదును చట్టబద్ధమైన వారసులు పొందడానికి సుదీర్ఘమైన, ఖర్చుతో కూడిన వ్యవహారం.
నలుగురు నామినీలు
ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక బ్యాంకు పొదుపు ఖాతాకు గరిష్ఠంగా నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఈ కొత్త నిబంధన ఖాతాదారులకు రెండు ముఖ్యమైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఖాతాదారుడు తన డిపాజిట్లలోని నగదును ప్రతి నామినీకి ఎంత శాతం చొప్పున చెందాలి (ఉదాహరణకు, భార్యకు 50 శాతం, ఇద్దరు పిల్లలకు చెరో 25 శాతం) అని స్పష్టంగా పేర్కొనే వీలుంది.
ప్రాధాన్యత క్రమంలో..
నామినీలను ప్రాధాన్యత క్రమంలో కూడా నిర్ణయించుకోవచ్చు. అంటే మొదటి నామినీ అందుబాటులో లేకపోతే లేదా మరణిస్తే, డబ్బు రెండో నామినీకి చెందుతుంది. ఈ విధంగా నలుగురిలో ఒకరి తర్వాత మరొకరికి డబ్బు చెందేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ద్వారా నామినీని యాడ్ చేయడం మరింత సులభతరం అవుతుంది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులను నామినీలుగా చేర్చడం వల్ల ఏదైనా అనుకోని సంఘటన సంభవించినా డబ్బు ఖచ్చితంగా వారసులకు చేరుతుంది అనే భరోసా లభిస్తుంది.
నామినీ నగదును క్లెయిమ్ చేసుకునే విధానం
ఖాతాదారు మరణించిన తర్వాత నామినీకి నగదు క్లెయిమ్ చేసుకునే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.
ఖాతాదారుడి మరణం గురించి నామినీ వెంటనే బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించి వారికి తెలియజేయాలి.
బ్యాంకులో అందుబాటులో ఉండే డెత్ క్లెయిమ్ ఫారంను నింపి సమర్పించాలి.
ఖాతాదారుడి మరణ ధ్రువపత్రం, మరణాన్ని ధ్రువీకరించిన కాపీ (Attested Copy)ని అందించాలి.
నామినీ ఆధార్, పాన్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు ఇవ్వాలి.
సంబంధిత బ్యాంకు పాస్ బుక్/ డిపాజిట్ రసీదు బ్యాంకులో సమర్పించాలి.
నామినీ సమర్పించిన పత్రాలను బ్యాంకు తనిఖీ చేస్తుంది. నామినేషన్ చట్టబద్ధంగా ఉంటే, ఎలాంటి వివాదాలు లేకపోతే, అకౌంట్‌లో ఉన్న మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది. ఈ డబ్బును నామినీ ఖాతాకు బదిలీ చేయడం లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లిస్తుంది.
ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా?


