breaking news
Unclaimed bank deposits
-
బ్యాంకుల్లో మూలుగుతున్న ప్రభుత్వ సొమ్ము!
కోటి, రెండు కోట్లు కాదు.. పదులు వందలు..వేల కోట్లు కూడా కాదు.. ఏకంగా ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు!బ్యాంకు అకౌంట్లలో మగ్గుతున్న మొత్తం ఇది! అది కూడా ప్రభుత్వ విభాగాలది.. స్వచ్ఛంద సంస్థలది!ఈ సొమ్ము అనుకున్నట్టుగా ఖర్చు పెట్టి ఉంటే...బోలెడన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవేమో. మరిన్ని ఆసుపత్రులు కట్టగలిగేవాళ్లమేమో...దేశంపై అప్పుల భారం ఎంతో కొంత తగ్గి ఉండేదేమో! అవునండి.. నిజం. దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు దేశంలోని వేర్వేరు బ్యాంకు అకౌంట్లలో మగ్గిపోతోంది. చనిపోయిన వారు.. లేదా డిపాజిట్లు చేసి మరచిపోయిన వ్యక్తులకు సంబంధించింది కాదీ మొత్తం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు శాఖలు, ప్రైవేటు ఛారిటబుల్ ట్రస్టులకు సంబంధించినవి. ఎవరూ అడక్కపోవడంతో ఇప్పుడు ఈ సొమ్మంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధిలోకి చేరిపోయింది. దేశంలో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ మొదలుకొని అనేక ఆర్థిక అక్రమాలపై పరిశోధనాత్మక కథనాలు రాసిన జర్నలిస్ట్ సుచేతా దలాల్ తాజాగా బయటపెట్టిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన సంగతి వివరాలు ఇలా ఉన్నాయి...చాలామంది బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేసి మరచిపోవడం కద్దు. కొంతమంది చనిపోయి ఉంటే.. మరికొందరు పట్టించుకోకపోవడం వల్ల సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేర వివిధ బ్యాంక్ అకౌంట్లు, డిపాజిట్లలో మగ్గిపోతున్నట్లు ఆర్బీఐ చాలా కాలం క్రితమే గుర్తించింది. దశాబ్ధాం పాటు ఎవరూ ఆపరేట్ లేదా క్లెయిమ్ చేయని వాటిని అన్క్లెయిమ్డ్ అకౌంట్లుగా గుర్తిస్తున్నారు. ఈ మొత్తాలను అసలు యజమానులు లేదా వారసులకు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నమూ చేస్తోంది. అయితే.. గత నెల 25న ఈ కార్యక్రమం రెండో దశ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఒకానొక బ్యాంకర్ ఒక అసాధారణ విషయాన్ని గుర్తించాడు. బ్యాంకింగ్ రంగంలోని వారికి మాత్రమే పరిమితమైన ఒక వాట్సప్ గ్రూపులో వచ్చిన సందేశం అతడిలో ఆసక్తిని రేకెత్తించింది. ఒక ప్రాంతంలోని టాప్-50 అన్క్లెయిమ్డ్ (ఎవరూ అడగని) అకౌంట్స్ జాబితాను పరిశీలిస్తే.. ఒకానొక ప్రభుత్వ విభాగం కూడా కోట్ల రూపాయల డిపాజిట్‌ను వదిలేసినట్లు ఈ సందేశం ద్వారా స్పష్టమైంది. కుతూహలం కొద్దీ అతడు ఆర్బీఐ పోర్టర్ ఉద్గమ్లో వెతకడం ప్రారంభించాడు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు చాలా ప్రభుత్వ విభాగాలతోపాటు ఛారిటబుల్ ట్రస్టులు కూడా కలిగి ఉన్నట్లు స్పష్టమైంది. ఆ వివరాలను జర్నలిస్ట్ సుచేతా దలాల్‌కు అందించగా.. అమె మరింత విసృ్తత స్థాయిలో శోధించడం మొదలుపెట్టింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో...సుచేతా దలాల్, మనీలైఫ్ అనే వెబ్సైట్ జర్నలిస్టుల బృందం ఉద్గమ్ పోర్టల్‌లోనే ‘ఫండ్’, ‘యోజన’, ‘రూరల్’, ‘ప్రధాన్‌మంత్రి’ వంటి పదాలతో సెర్చ్ చేసింది. వ్యక్తిగత అకౌంట్లను మినహాయించి చూసినప్పుడు ఒక్క స్టేట్‌బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లోనే సుమారు 134 అకౌంట్లు కనిపించాయి. అయితే ఇంతకుమించి పరిశోధించేందుకు వీరికి వీల్లేకుండా పోయింది. ఆర్బీఐ స్వయంగా ఈ శోధన చేపట్టినా.. లేదా తమకు అనుమతులిచ్చినా మరిన్ని వివరాలు తెలుస్తాయని సుచేత దలాల్ తన కాలమ్‌లో తెలిపారు. ప్రభుత్వ విభాగాలకు చెందిన అన్క్లెయిమ్డ్ అకౌంట్లలో అధికం ప్రజా సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపుదల, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలకు కేటాయించినవని, వాటితో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని తాను అనుకోలేదని సుచేత ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని వందల ప్రభుత్వ అకౌంట్లలో కోట్లకు కోట్లు అలా నిరుపయోగంగా పడి ఉన్నాయని.. కొన్ని అకౌంట్లలో పేర్లు తప్పుగా, గజిబిజిగా రాశారని.. ఎవరి పర్యవేక్షణ లేదన్న విషయం దీనిద్వారా స్పష్టమవుతోందని వివరించారు. ఎప్పుడో ఒక అవసరం కోసం కేటాయించిన నిధులు ఏమయ్యాయో తెలుసుకునేందుకూ ప్రభుత్వ పెద్దలు ఆసక్తి చూపలేదని, ఇలా అకౌంట్లలో మగ్గబెట్టడం కంటే వాటిని మళ్లీ వెనక్కు ఇచ్చేసి ఉంటే మరింత మేలు జరిగి ఉండేదని సుచేత అభిప్రాయపడ్డారు. ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే.. సుచేత బృందం జరిపిన చిన్నపాటి పరిశోధనలో కూడా దేశ మిలటరీకి సంబంధించిన నిధులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో మగ్గుతూండటం!ఈపీఎఫ్లోలు మొదలుకొని..సుచేత బృందం గుర్తించిన అన్క్లెయిమ్డ్ అకౌంట్లలో రెండు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లకు చెందిన అకౌంట్లు కూడా ఉన్నాయి. ఇవి న్యూఢిల్లీలోని భికాజీ కామా ప్యాలెస్‌లోని భవిష్య నిధి భవన్లో ఉన్నట్లు సుచేత బృందం గుర్తించింది. అలాగే ఢిల్లీ ఆసుపత్రులు, ఎంప్లాయీ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన పలు ఈఎస్ఐసీ అకౌంట్లలోనూ ఎంతో మొత్తం వృథాగా పడి ఉన్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనా, గోవా పబ్లిక్ వర్క్స్' డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజినీర్, రాష్ట్రీయ గ్రామీణ్ గ్యారెంటీ రోజ్‌గార్ యోజన, బీహార్‌లోని జార్ఖా, దినాపూర్ పంచాయతీరాజ్ శాఖ అకౌంట్లు కూడా ఎవరూ ఉపయోగించకుండా పడి ఉన్నాయి. ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే. కొన్నింటి పేర్లు తప్పుగా రాసిఉంటే.. కొన్ని డూప్లికేట్ ఎంట్రీలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తూంటే అసలు ఇవి నిజంగానే ప్రభుత్వ ఖాతాలా? బ్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి ఇలా అయ్యాయా? అన్న అనుమానం వస్తోందని, ఏ విషయం తేలాలి అన్నా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అవసరమని సుచేత స్పష్టం చేశారు. సెబీ పర్యవేక్షణలో ఉండే ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ - ధన్-80సీసీ అకౌంట్ కూడా ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కనిపించడం ఆశ్చర్యం కలిగించిందని సుచేత తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఫండ్లు కూడా ఇలా మరుగున పడి నిరుపయోగంగా మారాయి. సుచేత బృందం ఇలాంటివి కనీసం 46 ఖాతాలను గుర్తించింది. భోదిసత్వ ఫౌండేషన్ (పంచ్‌శీల్ నగర్, నాగ్‌పూర్), మానవ్ ఫౌండేషన్, మౌల్జీ వాల్జీ ఫౌండేషన్, ప్రత్యూష్ ఫౌండేషన్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. తాము తవ్వి తీసింది చాలా తక్కువని, ఉద్గమ్ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో పరిశోధిస్తే మరిన్ని బయటపడతాయని సుచేత అంటున్నారు. 2024 మార్చినాటికి రూ.78213 కోట్లు..ఆర్బీఐ డెఫ్ అకౌంట్లో గత ఏడాది మార్చి నాటికి రూ78,213 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అసలు వాడని బ్యాంకు అకౌంట్లలోని మొత్తం 2023లోనే మరో రూ.లక్ష కోట్లు ఉంది. పదేళ్ల తరువాత ఇవి కూడా డెఫ్ అకౌంట్లలోకి చేరతాయి. అంతేకాదు... వీటిల్లో ఎస్బీఐ ఖతాలేవీ లేవు. ప్రభుత్వ శాఖల బడ్జెట్లు, ఛారిటీ సంస్థల సగటు డిపాజిట్ల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం డెఫ్ అకౌంట్లలో కనీసం రూ.లక్షన్నర కోట్లు మగ్గుతూ ఉండాలని సుచేత అంచనా వేస్తున్నారు. -
వారసులకు ఎంతెంతో ఇప్పుడే చెప్పేయవచ్చు
దేశవ్యాప్తంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల (బ్యాంకు ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని నగదు) సమస్య బ్యాంకులకు, ఖాతాదారుల కుటుంబాలకు దీర్ఘకాలంగా సవాలుగా మారింది. ఖాతాదారు చనిపోయిన తర్వాత సరైన నామినేషన్ లేకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో పోగవుతున్నాయి. దాంతోపాటు నామినీగా ఉన్న వారికిసైతం సరైన అవగాహన లేకపోవడంతో భారీగా డబ్బు ఖాతాల్లో మూలుగుతుంది. ఈ నేపథ్యంలో అన్క్లెయిమ్డ్ నగదును తగ్గించి, చట్టపరంగా నామినీలకు డబ్బు చేరే ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఒక ఖాతాకు నలుగురు నామినీలను నియమించుకునేలా నిబంధనలు సడలించింది. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.ఇప్పటివరకు ఇలా..ఇప్పటివరకు బ్యాంకు పొదుపు ఖాతాకు ఒకే నామినీని మాత్రమే నియమించే అవకాశం ఉండేది. ఈ నిబంధన అనేక సమస్యలకు దారితీసింది. కొందరు ఖాతాదారులైతే అసలు నామినీని యాడ్ చేయాలని కూడా గుర్తించడం లేదు. ఇంకొందరు నామినీని చేర్చినా ఆ విషయం తమ నామినీకి చెప్పడంలేదు. ఖాతాలో పేరున్న ఒక్క నామినీ ప్రమాదవశాత్తు ఖాతాదారుడి కంటే ముందు మరణిస్తే అకౌంట్లోని నగదు మళ్లీ అన్‌క్లెయిమ్డ్‌గానే మిగిలిపోతుంది. ఆ నగదును చట్టబద్ధమైన వారసులు పొందడానికి సుదీర్ఘమైన, ఖర్చుతో కూడిన వ్యవహారం.నలుగురు నామినీలుఈ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక బ్యాంకు పొదుపు ఖాతాకు గరిష్ఠంగా నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఈ కొత్త నిబంధన ఖాతాదారులకు రెండు ముఖ్యమైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఖాతాదారుడు తన డిపాజిట్లలోని నగదును ప్రతి నామినీకి ఎంత శాతం చొప్పున చెందాలి (ఉదాహరణకు, భార్యకు 50 శాతం, ఇద్దరు పిల్లలకు చెరో 25 శాతం) అని స్పష్టంగా పేర్కొనే వీలుంది.ప్రాధాన్యత క్రమంలో..నామినీలను ప్రాధాన్యత క్రమంలో కూడా నిర్ణయించుకోవచ్చు. అంటే మొదటి నామినీ అందుబాటులో లేకపోతే లేదా మరణిస్తే, డబ్బు రెండో నామినీకి చెందుతుంది. ఈ విధంగా నలుగురిలో ఒకరి తర్వాత మరొకరికి డబ్బు చెందేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ద్వారా నామినీని యాడ్ చేయడం మరింత సులభతరం అవుతుంది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులను నామినీలుగా చేర్చడం వల్ల ఏదైనా అనుకోని సంఘటన సంభవించినా డబ్బు ఖచ్చితంగా వారసులకు చేరుతుంది అనే భరోసా లభిస్తుంది.నామినీ నగదును క్లెయిమ్ చేసుకునే విధానంఖాతాదారు మరణించిన తర్వాత నామినీకి నగదు క్లెయిమ్ చేసుకునే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.ఖాతాదారుడి మరణం గురించి నామినీ వెంటనే బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించి వారికి తెలియజేయాలి.బ్యాంకులో అందుబాటులో ఉండే డెత్ క్లెయిమ్ ఫారంను నింపి సమర్పించాలి.ఖాతాదారుడి మరణ ధ్రువపత్రం, మరణాన్ని ధ్రువీకరించిన కాపీ (Attested Copy)ని అందించాలి.నామినీ ఆధార్, పాన్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు ఇవ్వాలి.సంబంధిత బ్యాంకు పాస్ బుక్/ డిపాజిట్ రసీదు బ్యాంకులో సమర్పించాలి.నామినీ సమర్పించిన పత్రాలను బ్యాంకు తనిఖీ చేస్తుంది. నామినేషన్ చట్టబద్ధంగా ఉంటే, ఎలాంటి వివాదాలు లేకపోతే, అకౌంట్లో ఉన్న మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది. ఈ డబ్బును నామినీ ఖాతాకు బదిలీ చేయడం లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లిస్తుంది.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా? -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల తగ్గింపునకు ప్రోత్సాహకం
బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను (గడువు తీరినా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయినవి) తగ్గించేందుకు ఆర్బీఐ(RBI) ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఒక ఖాతా కార్యకలాపాల్లేకుండా (ఇనాపరేటివ్) ఉండిపోయిన కాలం, అందులో ఉన్న డిపాజిట్ ఆధారంగా బ్యాంకులకు ప్రోత్సాహకం చెల్లించనుంది. 4 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లేని ఖాతాలకు సంబంధించి 5 శాతం లేదా రూ.5,000, అలాగే పదేళ్లకు పైగా కార్యకలాపాల్లేని ఖాతాలకు సంబంధించిన డిపాజిట్ల విలువలో 7.5 శాతం లేదా రూ.25,000 ఏది తక్కువ అయితే ఆ మేరకు బ్యాంకులకు ప్రోత్సాహంగా అందనుంది.ప్రస్తుతమున్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను అలాగే.. నిర్ణీత కాలం దాటిన తర్వాత డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ అయ్యే ఇలాంటి డిపాజిట్లను తగ్గించడం లక్ష్యంగా పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. కస్టమర్లు/ డిపాజిటర్లు తమ ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు.. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను వారికి చెల్లించేందుకు వీలుగా బ్యాంకులను చురుగ్గా పనిచేయించడమే దీని ఉద్దేశమని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల కింద బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ లేకుండా 10 ఏళ్లకు మించిన డిపాజిట్లను డీఈఏ ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇలా డీఈఏ కిందకు బదిలీ అయిన తర్వాత కూడా వాటిని డిపాజిటర్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.67,000 కోట్లుగా ఉన్నాయి. బంగారం తయారీదారులకు మూలధన రుణాలుబంగారం, వెండి ముడి పదార్థంగా వినియోగించే తయారీదారులకు సైతం మూలధన రుణాలను (అవసరం మేరకు) అందించేందుకు బ్యాంక్‌లను ఆర్బీఐ అనుమతించింది. ఇప్పటి వరకు జ్యుయలర్లకే ఈ వెసులుబాటు ఉండేది.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.67వేల కోట్లు
బ్యాంక్‌ల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు (కాల వ్యవధి ముగిసిపోయినప్పటికీ వెనక్కి తీసుకోనివి) జూన్ చివరికి రూ.67,003 కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.58,330 కోట్లు ఉంటే, రూ.8,673.72 కోట్లు ప్రైవేటు బ్యాంకుల పరిధిలోనివి. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు.ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒక్క ఎస్బీఐలోనే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.19,330 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత పీఎన్బీలో రూ.6,910 కోట్లు, కెనరా బ్యాంక్‌లో రూ.6,278 కోట్లు చొప్పున ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకుల్లో రూ.2,063 కోట్లు క్లెయిమ్ లేకుండా పడి ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో రూ.1,609 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ.1,360 కోట్ల చొప్పున అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్ పోర్టల్ ద్వారా క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలోని దాదాపు 30 ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు ఇందులో పొందుపరిచారు.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ సర్వీసుల నిలిపివేతఅన్క్లెయిమ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు ముందుగా..ఉద్గమ్ పోర్టల్(https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login)ను సందర్శించాలి.రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అవ్వాలి.మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి.రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి.తర్వాత పేజీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులను ఎంచుకోవాలి.ధ్రువీకరణ కోసం పుట్టిన తేదీ, ఓటరు ఐడీ, పాస్ పోర్ట్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు వంటి వివరాలు ఇవ్వాలి.ఒకవేళ అన్‌క్లెయిమ్ డిపాజిట్లు ఉంటే అన్‌క్లెయిమ్ డిపాజిట్ రిఫరెన్స్ నంబర్ (యూడీఆర్ఎన్) వస్తుంది.ఈ పోర్టల్ ద్వారా ప్రతి బ్యాంకుకు క్లెయిమ్ సూచనలు వెళుతాయి.యూడీఆర్ఎన్ ద్వారా బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల రికవరీ సులభతరం
భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఎవరూ క్లెయిమ్ చేయని డబ్బును తిరిగి చెల్లించేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నాయి. బ్యాంకు ఖాతాదారులు, వారి నామినీలు రూ.78,213 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను తిరిగి పొందడంలో సహాయపడటానికి ఒక క్రమబద్ధమైన ప్రక్రియను అవలంబించేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సాధారణ దరఖాస్తు ఫారాలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియను 2026 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తిగా ఆన్లైన్లో అమలులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాయి. ఇది భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరింత పారదర్శకతను పెంచేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.రాష్ట్రాల బడ్జెట్‌తో సమానంక్లెయిమ్ చేయని డిపాజిట్లు భారత ఆర్థిక వ్యవస్థకు నిరంతర సవాలుగా మారుతున్నాయి. సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా ఇతర బ్యాంకింగ్ సాధనాల్లో తరచుగా నిధులు పేరుకుపోతున్నాయి. ఖాతాదారులు తమ డబ్బును ఉపసంహరించుకోవడంలో విఫలమైనప్పుడు లేదా నామినీలకు వారి అర్హతల గురించి తెలియనప్పుడు ఇది మరింతగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ క్లెయిమ్ చేయని రూ.78,213 కోట్ల డబ్బు బ్యాంకుల వద్ద మూలుగుతుంది. ఈ మొత్తం కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌తో సమానం ఉండడం గమనార్హం.డిజిటలైజేషన్ వల్ల లాభాలు..ప్రస్తుత నిబంధనల ప్రకారం అన్క్లెయిమ్డ్ నగదును క్లెయిమ్ చేయాలంటే విస్తృతమైన పేపర్ వర్క్, వ్యక్తిగత విజిట్లు ఉంటున్నాయి. దాంతో చాలామంది వీటిని క్లెయిమ్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే దీన్ని సరళతరం చేస్తూ కొన్ని కామన్ అప్లికేషన్ ఫారాలను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలున్నాయి. ఇది కార్యరూపం దాలిస్తే బ్యాంకులకు అతీతంగా ఆన్లైన్లో కామన్ వివరాలు నమోదు చేసేందుకు వీలవుతుంది. ఇది ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. దీనితో పాటు అవసరమైన డాక్యుమెంట్ల ప్రామాణీకరణ గందరగోళం, జాప్యాన్ని తగ్గిస్తుంది. నామినీలు లేదా ఖాతాదారులు ఇకపై బ్యాంక్ నిర్దిష్ట పేపర్ వర్క్ కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?ఇంటర్నెట్ వాడుతున్న వారికి ప్రయోజనం2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ మొత్తం పునరుద్ధరణ ప్రక్రియ ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది. ఈ మార్పు దరఖాస్తుదారులు అప్లికేషన్ సమర్పించడానికి, పత్రాలను అప్లోడ్ చేయడానికి, వారి అభ్యర్థనలను తాము ఉన్న ప్రదేశంలో నుంచే ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇటీవలి అంచనాల ప్రకారం 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులన్న దేశంలో ఇలా ఆన్లైన్లో క్లెయిమ్ సేవలందించడం ఎంతో తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది కీలకంగా మారనుందని చెబుతున్నారు. -
చనిపోయినవారి ఖాతాలో డబ్బులు ఏమౌతాయి..?
బ్యాంకుల వద్ద క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన డిపాజిట్లు ఏటా పెరుగుతున్నాయి. అందులో కొందరు ఖాతాదారులు చనిపోయి ఉంటారు. మరికొందరు ఇతర కారణాల వల్ల వారి డబ్బుకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు చేయరు. దాంతో అవి ఎవరు క్లెయిమ్ చేయకుండా అలాగే బ్యాంకుల్లో పోగవుతాయి. అలా అని ఆ డబ్బును బ్యాంకు వాటి కార్యకలాపాలకు ఉపయోగించేందుకు మాత్రం నిబంధనలు ఒప్పుకోవు. కచ్చితంగా ఆ డబ్బును సదరు ఖాతాదారులకే చెల్లించేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయితే ఎవరు క్లెయిమ్ చేయని (అన్క్లెయిమ్డ్) డిపాజిట్లు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.42,270 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది కాలంతో పోలిస్తే 28 శాతం పెరిగాయి. పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు పనిచేయకుండా ఉన్న అకౌంట్లలోని డిపాజిట్లను అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. కిందటేడాది మార్చి 31 నాటికి రూ.32,934 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అవి ఈ ఏడాది మార్చి నాటికి రూ.42,272 కోట్లకు చేరిందని ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ పార్లమెంట్లో వెల్లడించారు. ఈ ఫండ్స్‌ను ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ)ఫండ్‌లో ఉంచుతారు. ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తిరిగి సదరు ఖాతాదారులకు పంపేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోందని కరాద్ వెల్లడించారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకులు తమ వెబ్సైట్లో ఉంచాలని ఇప్పటికే ఆర్బీఐ సూచించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఖాతాలకు సంబంధించి కస్టమర్లను సంప్రదించాలని, ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతే వారి లీగల్ వారసులకు వివరాలు అందించాలని ఆర్బీఐ ఆదేశించింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించేందుకు బోర్డు ఆమోదంతో కొన్ని రూల్స్ రెడీ చేయాలని, గ్రీవెన్స్ రిడ్రస్సల్ మెకానిజంను ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని ఆర్బీఐ సలహా ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు. రూ.1,432.68 కోట్లు రిటర్న్.. డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు సెంట్రలైజ్డ్ వెబ్సైట్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్‌వే టూ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చిందని కరాద్ అన్నారు. దీనికి తోడు ‘100 డేస్ 100 పేస్’ క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాల్లోని టాప్ 100 అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను 100 రోజుల్లో బ్యాంకులు సెటిల్ చేయనున్నాయి. ఈ ప్రచారం ఈ ఏడాది జూన్ 1న మొదలై సెప్టెంబర్ 8 వరకు కొనసాగిందని మంత్రి వెల్లడించారు. క్యాంపెయిన్ ముగిసే సమయానికి 31పెద్ద బ్యాంకులు రూ.1,432.68 కోట్లను నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారికి రిటర్న్ చేసినట్లు వివరించారు. ఇదీ చదవండి: జీడీపీలో తగ్గుతున్న వ్యవసాయం వాటా.. కారణం చెప్పిన మంత్రి -
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సొమ్ము క్లెయిమ్ చెయ్యలేదా?
-
రూ.35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎన్బీ) ఫిబ్రవరి 2023 నాటికి గడచిన 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆపరేట్ చేయని దాదాపు రూ.35,012 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి బదిలీ చేసినట్లు ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంటుకు తెలియజేశారు. ఇవి దాదాపు రూ.10.24 కోట్ల అకౌంట్లకు సంబంధించినవని ఆయన వెల్లడించారు. బదలాయింపులకు సంబంధించి తొలి స్థానాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.8,086 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.5,340 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ.4,558 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.3,904 కోట్లు) ఉన్నాయి. రెండు సంవత్సరాలకుపైగా నిర్వహణలో లేని ఖాతాలకు సంబంధించి ఖాతాదారులు/చట్టబద్ధమైన వారసుల ఆచూకీని కనుగొనడం కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకులకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. -
వామ్మో రూ. 35 వేల కోట్లా.. బ్యాంకులు ఏం చేశాయో తెలుసా?
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎవరూ క్లయిమ్ చేయని డిపాజిట్లు పేరుకుపోయాయి. 2023 ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35 వేల కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉన్నాయి. ఇవి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఆపరేట్ చేయని 10.24 కోట్ల ఖాతాలకు సంబంధించినవి. ఈ డబ్బును ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్‌కి బదిలీ చేశాయి. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) ఆర్బీఐ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం... 2023 ఫిబ్రవరి చివరి నాటికి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా నిర్వహించని డిపాజిట్లకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి బదిలీ చేసిన డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తాజాగా లోక్‌సభలో తెలియజేశారు. (రియల్ ఎస్టేట్‌కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన అమ్మకాలు) ఆర్బీఐకి బదిలీ చేసిన రూ. 35,012 కోట్ల అన్ క్లయిమ్డ్ డిపాజిట్లలో అత్యధికంగా రూ. 8,086 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు సంబంధించినవి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులవి రూ. 5,340 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ. 4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 3,904 కోట్లు ఉన్నాయి. -
ఆర్బీఐ వద్ద రూ.48వేల కోట్లు.. పది సంవత్సరాల నుంచి ఎవరూరారే!
ముంబై: బ్యాంకింగ్‌లో క్లెయిమ్ చేయని నిధుల మొత్తం భారీగా పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వార్షిక నివేదిక పేర్కొంది. దీని ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.39,264 కోట్లుగా ఉన్న ఈ నిధులు ఈ ఏడాది మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.48,262 కోట్లకు ఎగశాయి. ఈ నిధుల్లో అధిక మొత్తం తెలుగురాష్ట్రాలుసహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బిహార్‌లు జాబితాలో ఉన్న మిగిలిన ప్రధాన రాష్ట్రాలు. దీనితో ఈ అంశంపై ఆయా రాష్ట్రాల్లో విస్తృత ప్రాతిపదికన ప్రచారం నిర్వహించి, క్లెయిమ్ చేయని వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు బ్యాంకింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్లెయిమ్ చేయని నిధులు అంటే.. సెంట్రల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, 10 సంవత్సరాల పాటు ఎవ్వరూ నిర్వహించని సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలలోని నిల్వలు లేదా మెచ్యూరిటీ తేదీ నుండి 10 సంవత్సరాలలోపు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను ‘ క్లెయిమ్ చేయని డిపాజిట్లు‘గా వర్గీకరిస్తారు. ఈ తరహా డబ్బును బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్’కి బదిలీ చేస్తాయి. అయితే, డిపాజిటర్లు తమ డబ్బు ను వడ్డీతో పాటు బ్యాంక్ వద్ద ఎప్పటికైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకులు, అలాగే ఆర్బీఐ ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాలు చేపట్టినప్పటికీ, క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం పెరుగుతున్న ధోరణి కనబడ్డం గమనించాల్సిన అంశమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కారణాలు ఏమిటి? క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణం ప్రధానంగా సేవింగ్స్, కరెంట్ ఖాతాలను మూసివేయకపోవడం వల్ల పెరుగుతోంది. డిపాజిటర్లు కొద్దో గొప్పో బ్యాంక్ ఖాతాల్లో వదిలివేసి ఆపరేట్ చేయకూడదనుకోవడం లేదా మెచ్యూర్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం బ్యాంకులకు రిడెంప్షన్ క్లెయిమ్‌లను సమర్పించకపోవడం వంటి అంశాలు ప్రధానంగా తమ దృష్టికి వస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ఇక కొన్ని సందర్భాల్లో మరణించిన డిపాజిటర్లకు సంబంధించిన ఖాతాల విషయంలో నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు డబ్బును వెనక్కి తీసుకోవడానికి ముందుకు రాని కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. క్లెయిమ్ చేయడంలో సహాయపడటం తమ ప్రచార కార్యక్రమం లక్ష్యంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. చదవండి: EV: ఈవీ జోరు.. ముందుంది మంచి కాలం.. ఏకంగా 72 వేల కోట్ల వ్యాపారం!


