
అధిక మొత్తం ఎస్‌బీఐ పరిధిలోనే..
బ్యాంక్‌ల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు (కాల వ్యవధి ముగిసిపోయినప్పటికీ వెనక్కి తీసుకోనివి) జూన్ చివరికి రూ.67,003 కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.58,330 కోట్లు ఉంటే, రూ.8,673.72 కోట్లు ప్రైవేటు బ్యాంకుల పరిధిలోనివి. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు.
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒక్క ఎస్‌బీఐలోనే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.19,330 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత పీఎన్‌బీలో రూ.6,910 కోట్లు, కెనరా బ్యాంక్‌లో రూ.6,278 కోట్లు చొప్పున ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకుల్లో రూ.2,063 కోట్లు క్లెయిమ్ లేకుండా పడి ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రూ.1,609 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ.1,360 కోట్ల చొప్పున అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్ పోర్టల్ ద్వారా క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలోని దాదాపు 30 ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు ఇందులో పొందుపరిచారు.
ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ సర్వీసుల నిలిపివేత
అన్‌క్లెయిమ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు ముందుగా..
ఉద్గమ్ పోర్టల్(https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login)ను సందర్శించాలి.
రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అవ్వాలి.
మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి.
రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి.
తర్వాత పేజీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులను ఎంచుకోవాలి.
ధ్రువీకరణ కోసం పుట్టిన తేదీ, ఓటరు ఐడీ, పాస్ పోర్ట్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు వంటి వివరాలు ఇవ్వాలి.
ఒకవేళ అన్‌క్లెయిమ్ డిపాజిట్లు ఉంటే అన్‌క్లెయిమ్ డిపాజిట్ రిఫరెన్స్ నంబర్ (యూడీఆర్ఎన్) వస్తుంది.
ఈ పోర్టల్ ద్వారా ప్రతి బ్యాంకుకు క్లెయిమ్ సూచనలు వెళుతాయి.
యూడీఆర్‌ఎన్ ద్వారా బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది.