
రష్యన్ కంపెనీలపై యూరోపియన్ యూనియన్ ఆంక్షల నేపథ్యంలో నయారా ఎనర్జీకి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలు నిలిపివేసింది. దీనితో గతంలోనే పుర్తిగా చెల్లించి, లైసెన్సులను కొనుగోలు చేసినప్పటికీ సొంత డేటా, ఇతరత్రా టూల్స్ మొదలైనవి తమకు అందుబాటులోకి లేకుండా పోయాయని నయారా వెల్లడించింది. ఇలాంటివి చాలా ప్రమాదకర ధోరణులని ఆందోళన వ్యక్తం చేసింది.
మైక్రోసాఫ్ట్ ఏకపక్షంగా, హఠాత్తుగా సర్వీసులను నిలిపివేయడంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించింది. సర్వీసులను పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాను కట్టడి చేసే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నయారా ఎనర్జీపై కూడా యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించింది.
ఇదీ చదవండి: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!
అయితే, ఇవి ఈయూ చట్టాల పరిధిలోకే వస్తాయి తప్ప మైక్రోసాఫ్ట్‌లాంటి అమెరికన్ కంపెనీలకు, భారతీయ సంస్థలకు వర్తించవని నయారా ఎనర్జీ తెలిపింది. రిఫైనింగ్ సామర్థ్యంలో 8 శాతం, రిటైల్ పెట్రోల్ బంకుల నెట్‌వర్క్‌లో ఏడు శాతం వాటాతో భారత ఇంధన భద్రతలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది.