
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు చేసిన ప్రకటన దేశ టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన ఆవరించింది. కాగా టీసీఎస్ లేఆఫ్‌ల ప్రకటన తరువాత జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బాధిత ఉద్యోగులకు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు ఉపాధి కల్పనను పెంచడానికి ఎలా సహాయపడతాయనే దానిపై కేంద్ర ఐటీ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నైపుణ్యం పెంపు, రీస్కిల్లింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయా వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది.
ఈ మొత్తం పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, టెక్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలగింపులపై మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది.. అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడానికి పరిశీలిస్తుంది.
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్ ఈ సంవత్సరం 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్న నేపథ్యంలో ఈ వైఖరి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ప్రభావం ఎక్కువగా మిడిల్, సీనియర్ గ్రేడ్ ఉద్యోగులపై పడుతుంది. 2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,000 మంది ఉద్యోగులు జతయ్యారు.