- సుచేత దలాల్ సంచలనాత్మక పరిశోధన!
- మనీ లైఫ్‌లో ప్రత్యేక కథనం.
కోటి, రెండు కోట్లు కాదు..
పదులు వందలు..వేల కోట్లు కూడా కాదు..
ఏకంగా ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు!
బ్యాంకు అకౌంట్లలో మగ్గుతున్న మొత్తం ఇది!
అది కూడా ప్రభుత్వ విభాగాలది.. స్వచ్ఛంద సంస్థలది!
ఈ సొమ్ము అనుకున్నట్టుగా ఖర్చు పెట్టి ఉంటే...
బోలెడన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవేమో.
మరిన్ని ఆసుపత్రులు కట్టగలిగేవాళ్లమేమో...
దేశంపై అప్పుల భారం ఎంతో కొంత తగ్గి ఉండేదేమో!
అవునండి.. నిజం. దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు దేశంలోని వేర్వేరు బ్యాంకు అకౌంట్లలో మగ్గిపోతోంది. చనిపోయిన వారు.. లేదా డిపాజిట్లు చేసి మరచిపోయిన వ్యక్తులకు సంబంధించింది కాదీ మొత్తం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు శాఖలు, ప్రైవేటు ఛారిటబుల్ ట్రస్టులకు సంబంధించినవి. ఎవరూ అడక్కపోవడంతో ఇప్పుడు ఈ సొమ్మంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధిలోకి చేరిపోయింది. దేశంలో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ మొదలుకొని అనేక ఆర్థిక అక్రమాలపై పరిశోధనాత్మక కథనాలు రాసిన జర్నలిస్ట్ సుచేతా దలాల్ తాజాగా బయటపెట్టిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన సంగతి వివరాలు ఇలా ఉన్నాయి...
చాలామంది బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేసి మరచిపోవడం కద్దు. కొంతమంది చనిపోయి ఉంటే.. మరికొందరు పట్టించుకోకపోవడం వల్ల సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల మేర వివిధ బ్యాంక్ అకౌంట్లు, డిపాజిట్లలో మగ్గిపోతున్నట్లు ఆర్‌బీఐ చాలా కాలం క్రితమే గుర్తించింది. దశాబ్ధాం పాటు ఎవరూ ఆపరేట్ లేదా క్లెయిమ్ చేయని వాటిని అన్‌క్లెయిమ్డ్ అకౌంట్లుగా గుర్తిస్తున్నారు. ఈ మొత్తాలను అసలు యజమానులు లేదా వారసులకు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నమూ చేస్తోంది. అయితే.. గత నెల 25న ఈ కార్యక్రమం రెండో దశ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఒకానొక బ్యాంకర్ ఒక అసాధారణ విషయాన్ని గుర్తించాడు. బ్యాంకింగ్ రంగంలోని వారికి మాత్రమే పరిమితమైన ఒక వాట్సప్ గ్రూపులో వచ్చిన సందేశం అతడిలో ఆసక్తిని రేకెత్తించింది. ఒక ప్రాంతంలోని టాప్-50 అన్‌క్లెయిమ్డ్ (ఎవరూ అడగని) అకౌంట్స్ జాబితాను పరిశీలిస్తే.. ఒకానొక ప్రభుత్వ విభాగం కూడా కోట్ల రూపాయల డిపాజిట్‌ను వదిలేసినట్లు ఈ సందేశం ద్వారా స్పష్టమైంది. కుతూహలం కొద్దీ అతడు ఆర్‌బీఐ పోర్టర్ ఉద్గమ్‌లో వెతకడం ప్రారంభించాడు. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు చాలా ప్రభుత్వ విభాగాలతోపాటు ఛారిటబుల్ ట్రస్టులు కూడా కలిగి ఉన్నట్లు స్పష్టమైంది. ఆ వివరాలను జర్నలిస్ట్ సుచేతా దలాల్‌కు అందించగా.. అమె మరింత విసృ‍్తత స్థాయిలో శోధించడం మొదలుపెట్టింది.
ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో...
సుచేతా దలాల్, మనీలైఫ్ అనే వెబ్‌సైట్ జర్నలిస్టుల బృందం ఉద్గమ్ పోర్టల్‌లోనే ‘ఫండ్’, ‘యోజన’, ‘రూరల్’, ‘ప్రధాన్‌మంత్రి’ వంటి పదాలతో సెర్చ్ చేసింది. వ్యక్తిగత అకౌంట్లను మినహాయించి చూసినప్పుడు ఒక్క స్టేట్‌బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లోనే సుమారు 134 అకౌంట్లు కనిపించాయి. అయితే ఇంతకుమించి పరిశోధించేందుకు వీరికి వీల్లేకుండా పోయింది. ఆర్‌బీఐ స్వయంగా ఈ శోధన చేపట్టినా.. లేదా తమకు అనుమతులిచ్చినా మరిన్ని వివరాలు తెలుస్తాయని సుచేత దలాల్ తన కాలమ్‌లో తెలిపారు.
ప్రభుత్వ విభాగాలకు చెందిన అన్‌క్లెయిమ్డ్ అకౌంట్లలో అధికం ప్రజా సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపుదల, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలకు కేటాయించినవని, వాటితో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని తాను అనుకోలేదని సుచేత ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని వందల ప్రభుత్వ అకౌంట్లలో కోట్లకు కోట్లు అలా నిరుపయోగంగా పడి ఉన్నాయని.. కొన్ని అకౌంట్లలో పేర్లు తప్పుగా, గజిబిజిగా రాశారని.. ఎవరి పర్యవేక్షణ లేదన్న విషయం దీనిద్వారా స్పష్టమవుతోందని వివరించారు. ఎప్పుడో ఒక అవసరం కోసం కేటాయించిన నిధులు ఏమయ్యాయో తెలుసుకునేందుకూ ప్రభుత్వ పెద్దలు ఆసక్తి చూపలేదని, ఇలా అకౌంట్లలో మగ్గబెట్టడం కంటే వాటిని మళ్లీ వెనక్కు ఇచ్చేసి ఉంటే మరింత మేలు జరిగి ఉండేదని సుచేత అభిప్రాయపడ్డారు. ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే.. సుచేత బృందం జరిపిన చిన్నపాటి పరిశోధనలో కూడా దేశ మిలటరీకి సంబంధించిన నిధులు ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో మగ్గుతూండటం!
ఈపీఎఫ్‌లోలు మొదలుకొని..
సుచేత బృందం గుర్తించిన అన్‌క్లెయిమ్డ్ అకౌంట్లలో రెండు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లకు చెందిన అకౌంట్లు కూడా ఉన్నాయి. ఇవి న్యూఢిల్లీలోని భికాజీ కామా ప్యాలెస్‌లోని భవిష్య నిధి భవన్‌లో ఉన్నట్లు సుచేత బృందం గుర్తించింది. అలాగే ఢిల్లీ ఆసుపత్రులు, ఎంప్లాయీ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన పలు ఈఎస్‌ఐసీ అకౌంట్లలోనూ ఎంతో మొత్తం వృథాగా పడి ఉన్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనా, గోవా పబ్లిక్ వర్క్స్' డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజినీర్, రాష్ట్రీయ గ్రామీణ్ గ్యారెంటీ రోజ్‌గార్ యోజన, బీహార్‌లోని జార్ఖా, దినాపూర్ పంచాయతీరాజ్ శాఖ అకౌంట్లు కూడా ఎవరూ ఉపయోగించకుండా పడి ఉన్నాయి.
ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే. కొన్నింటి పేర్లు తప్పుగా రాసిఉంటే.. కొన్ని డూప్లికేట్ ఎంట్రీలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తూంటే అసలు ఇవి నిజంగానే ప్రభుత్వ ఖాతాలా? బ్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి ఇలా అయ్యాయా? అన్న అనుమానం వస్తోందని, ఏ విషయం తేలాలి అన్నా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అవసరమని సుచేత స్పష్టం చేశారు. సెబీ పర్యవేక్షణలో ఉండే ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ - ధన్-80సీసీ అకౌంట్ కూడా ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కనిపించడం ఆశ్చర్యం కలిగించిందని సుచేత తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఫండ్లు కూడా ఇలా మరుగున పడి నిరుపయోగంగా మారాయి. సుచేత బృందం ఇలాంటివి కనీసం 46 ఖాతాలను గుర్తించింది. భోదిసత్వ ఫౌండేషన్ (పంచ్‌శీల్ నగర్, నాగ్‌పూర్), మానవ్ ఫౌండేషన్, మౌల్జీ వాల్జీ ఫౌండేషన్, ప్రత్యూష్ ఫౌండేషన్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. తాము తవ్వి తీసింది చాలా తక్కువని, ఉద్గమ్ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో పరిశోధిస్తే మరిన్ని బయటపడతాయని సుచేత అంటున్నారు.
2024 మార్చినాటికి రూ.78213 కోట్లు..
ఆర్‌బీఐ డెఫ్ అకౌంట్‌లో గత ఏడాది మార్చి నాటికి రూ78,213 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అసలు వాడని బ్యాంకు అకౌంట్లలోని మొత్తం 2023లోనే మరో రూ.లక్ష కోట్లు ఉంది. పదేళ్ల తరువాత ఇవి కూడా డెఫ్ అకౌంట్లలోకి చేరతాయి. అంతేకాదు... వీటిల్లో ఎస్‌బీఐ ఖతాలేవీ లేవు. ప్రభుత్వ శాఖల బడ్జెట్‌లు, ఛారిటీ సంస్థల సగటు డిపాజిట్ల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం డెఫ్ అకౌంట్లలో కనీసం రూ.లక్షన్నర కోట్లు మగ్గుతూ ఉండాలని సుచేత అంచనా వేస్తున్నారు.


