
బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను (గడువు తీరినా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయినవి) తగ్గించేందుకు ఆర్‌బీఐ(RBI) ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఒక ఖాతా కార్యకలాపాల్లేకుండా (ఇనాపరేటివ్) ఉండిపోయిన కాలం, అందులో ఉన్న డిపాజిట్ ఆధారంగా బ్యాంకులకు ప్రోత్సాహకం చెల్లించనుంది. 4 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లేని ఖాతాలకు సంబంధించి 5 శాతం లేదా రూ.5,000, అలాగే పదేళ్లకు పైగా కార్యకలాపాల్లేని ఖాతాలకు సంబంధించిన డిపాజిట్ల విలువలో 7.5 శాతం లేదా రూ.25,000 ఏది తక్కువ అయితే ఆ మేరకు బ్యాంకులకు ప్రోత్సాహంగా అందనుంది.
ప్రస్తుతమున్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను అలాగే.. నిర్ణీత కాలం దాటిన తర్వాత డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ అయ్యే ఇలాంటి డిపాజిట్లను తగ్గించడం లక్ష్యంగా పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. కస్టమర్లు/ డిపాజిటర్లు తమ ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు.. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను వారికి చెల్లించేందుకు వీలుగా బ్యాంకులను చురుగ్గా పనిచేయించడమే దీని ఉద్దేశమని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల కింద బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ లేకుండా 10 ఏళ్లకు మించిన డిపాజిట్లను డీఈఏ ఫండ్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇలా డీఈఏ కిందకు బదిలీ అయిన తర్వాత కూడా వాటిని డిపాజిటర్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.67,000 కోట్లుగా ఉన్నాయి.
బంగారం తయారీదారులకు మూలధన రుణాలు
బంగారం, వెండి ముడి పదార్థంగా వినియోగించే తయారీదారులకు సైతం మూలధన రుణాలను (అవసరం మేరకు) అందించేందుకు బ్యాంక్‌లను ఆర్‌బీఐ అనుమతించింది. ఇప్పటి వరకు జ్యుయలర్లకే ఈ వెసులుబాటు ఉండేది.
ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు