 
													సెప్టెంబర్ క్వార్టర్‌లో 16% క్షీణత
209 టన్నులకు పరిమితం
పడిపోయిన దిగుమతులు
ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక
న్యూఢిల్లీ: బంగారం ధరలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ, అదే పనిగా పెరుగుతూ పోతుండడం డిమాండ్‌పై ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లో బంగారం డిమాండ్ 16 శాతం తగ్గి 209.4 టన్నులకు పరిమితమైనట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో డిమాండ్ 248.3 టన్నులు ఉండడం గమనార్హం.
ధరలు పెరగడంతో వినియోగ డిమాండ్ తగ్గినట్టు, మరోవైపు సురక్షిత సాధనంగా పెట్టుబడుల పరమైన డిమాండ్ పెరిగినట్టు వివరించింది. పరిమాణం పరంగా డిమాండ్ తగ్గినప్పటికీ, విలువ పరంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 2,03,240 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో విలువ పరంగా డిమాండ్ 1,65,380 కోట్లతో పోల్చి చూస్తే 23% పెరిగింది. ధరలు అధికంగా ఉండడం వల్ల కొనుగోలు పరిమాణం తగ్గినప్పటికీ, విలువ అదే స్థాయిలో ఉన్నట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. 
 
→ ఆభరణాల డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 117.7 టన్నులుగా ఉంది. 2024 సెప్టెంబర్ క్వార్టర్‌లో డిమాండ్ 171.6 టన్నులతో పోల్చి చూస్తే 31 శాతం తగ్గింది. ఆభరణాల కొనుగోలు విలువ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ.1,14,270 కోట్ల స్థాయిలో ఉంది. ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులు తమ స్తోమత మేరకు పరిమాణం తగ్గించి కొనుగోలు చేస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 
 
→ పెట్టుబడుల పరంగా పసిడి డిమాండ్ 20 శాతం పెరిగి 91.6 టన్నులకు చేరింది. విలువ పరంగా చూస్తే 74 శాతం పెరిగి రూ.88,970 కోట్లకు చేరింది.   
→ సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం సగటు ధర 10 గ్రాములకు రూ.97,075గా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.66,614గా ఉండడం గమనార్హం. అంతర్జాతీయంగా ఔన్స్ ధర 3,456 డాలర్ల వద్ద ఉంది. 2024 సెప్టెంబర్‌లో ఇది 2,474 డాలర్ల స్థాయిలో ఉంది.  
→ బంగారం దిగుమతులు సెప్టెంబర్ త్రైమాసికంలో 194.6 టన్నులకు పడిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 308.2 టన్నులతో పోల్చితే దిగుమతులు 37 శాతం తగ్గాయి.   
→ పసిడి రీసైక్లింగ్ డిమాండ్ సైతం 7 శాతం తగ్గి 21.8 టన్నులకు పరిమితమైంది.  
పెట్టుబడుల డిమాండ్.. 
దీర్ఘకాలంలో విలువ పెరిగే సాధనంగా బంగారం పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకానికి ఈ గణాంకాలు నిదర్శనమని డబ్ల్యూజీసీ భారత సీఈవో సచిన్‌జైన్ పేర్కొన్నారు. పరిమాణం పరంగా డిమాండ్ 16 శాతం తగ్గినప్పటికీ, విలువ పరంగా 23 శాతం పెరగడాన్ని విస్మరించకూడదన్నారు. పండుగలు, వివాహాల సీజన్‌లో డిమాండ్ బలంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలి నెలల్లో ధరలు పెరగడంతో పెళ్లిళ్లకు సంబంధించి కొనుగోళ్లను కొందరు వాయిదా వేసుకున్నారని, దీంతో డిసెంబర్ త్రైమాసికంలో డిమాండ్ సానుకూలంగా ఉండొచ్చన్నారు. 
పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గడానికి.. గతేడాది దిగుమతి సుంకం తగ్గించడం కారణంగా పెద్ద ఎత్తున దిగుమతులు నమోదు కావడాన్ని ప్రస్తావించారు. గతేడాది గరిష్ట బేస్ కారణంగా దిగుమతులు పెద్ద మొత్తంలో తగ్గిపోయినట్టు కనిపిస్తోందన్నారు. ఈ ఏడాది మొత్తానికి పసిడి డిమాండ్ 600–700 టన్నులుగా ఉండొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. మొదటి తొమ్మిది నెలల్లో 462 టన్నులుగా ఉన్నట్టు తెలిపింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పసిడి డిమాండ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 1,313 టన్నులుగా నమోదైంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
