
48 శాతం తక్కువగా నమోదు
ఏడు నగరాల్లో ఫ్లాట్ పనితీరు
సెప్టెంబర్ క్వార్టర్‌లో 172 లక్షల
ఎస్‌ఎఫ్‌టీ కొలియర్స్ ఇండియా నివేదిక
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఆఫీసు లీజింగ్ (కిరాయికి ఇవ్వడం) సెపె్టంబర్ త్రైమాసికంలో ఢీలా పడింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే 48 శాతం తక్కువగా 15 లక్షల చదరపు అడుగులుగా (ఎస్‌ఎఫ్‌టీ) ఉంటుందని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 29 లక్షల చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం.
దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో మాత్రం ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఫ్లాట్ పనితీరు చూపించింది. 172 లక్షల చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ)గా ఉంటుందని.. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో డిమాండ్ తగ్గినట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఏడు నగరాల్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 174 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం. లీజు పునరుద్ధరణ లావాదేవీలు ఇందులో కలసి లేవు. ఈ మేరకు సెపె్టంబర్ త్రైమాసికంపై తన అంచనాలను కొలియర్స్ ఇండియా విడుదల చేసింది.
→ ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లో లీజింగ్ 16 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చన్నది కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ పరిమాణం 24 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.
→ బెంగళూరులోనూ లీజింగ్ 25 శాతం తగ్గి 47 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉంటుంది.
→ కోల్‌కతాలో ఎలాంటి వృద్ధి లేకుండా లక్ష చదరపు అడుగులుగా ఉండొచ్చు.
→ చెన్నై మార్కెట్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 86 శాతం మేర పెరిగి 26 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి చేరుకుంటుంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజింగ్ పరిమాణం 14 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.
→ ముంబైలోనూ 76 శాతం వృద్ధితో 30 లక్షల చదరపు అడుగుల మేర లీజింగ్ నమోదు కానుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 17 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.
→ పుణెలో 37 లక్షల ఎస్‌ఎఫ్‌టీ మేర లీజింగ్ ఉండొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 42 శాతం అధికంగా నమోదు కానుంది.
→ అన్ని రకాల ఆఫీస్ స్పేస్ లీజింగ్‌ను గమనిస్తే 8 శాతం పెరిగి 509 లక్షల చదరపు అడుగులుగా ఉంటుందన్నది అంచనా.
బలమైన పనితీరు..
‘‘భారత ఆఫీస్ మార్కెట్ బలమైన పనితీరును కొనసాగిస్తోంది. అంతర్జాతీయంగా భౌగోళిక, వాణిజ్య పరమైన అనిశి్చతులు నెలకొన్నప్పటికీ ఈ ఏడాది తొమ్మిది నెలల్లో లీజింగ్ 50 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీని అధిగమించింది. ఏడు నగరాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు ఇప్పటికే 20 లక్షల ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్‌ను నమోదు చేశాయి. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో వీటి వాటా 40 శాతానికి చేరింది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ ఎండీ అరి్పత్ మెహరోత్రా తెలిపారు.