జీఎస్‌టీ మార్పుల ఫలితం
గ్రామీణ మార్కెట్లలో మెరుగైన డిమాండ్
నీల్సన్‌ఐక్యూ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి సెప్టెంబర్ త్రైమాసికంలో పరిమాణం పరంగా 5.4 శాతానికి పరిమితమైనట్టు నీల్సన్‌ఐక్యూ సంస్థ తెలిపింది. జీఎస్‌టీ రేట్ల మార్పులకు ముందు నెలకొన్న పరిస్థితులను అవరోధాలుగా పేర్కొంది. అమ్మకాల విలువ మాత్రం 12.9 శాతం పెరిగినట్టు తెలిపింది. ధరల పెరుగుదల ఇందుకు అనుకూలించింది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ అమ్మకాల వృద్ధి క్రితం ఏడాది క్యూ2తో పోల్చితే 8.4 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గిందని.. అయినప్పటికీ వరుసగా ఏడో నెలలోనూ పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక వృద్ధి కనిపించినట్టు తన నివేదికలో నీల్సన్‌ఐక్యూ సంస్థ వెల్లడించింది. చిన్న ప్యాక్‌లకు వినియోగదారుల నుంచి ఆదరణ ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల్లో అధిక వాటా కలిగిన పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా చిన్న పట్టణాల్లో డిమాండ్ క్రమంగా కోలుకుంటోంది. జూన్ త్రైమాసికంతో పోల్చితే మాత్రం పట్టణాల్లో డిమాండ్ తగ్గింది.
ఇక గ్రామీణ మార్కెట్లో అందుబాటు ధరల ఆధారంగా చిన్న ప్యాక్‌ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ డిమాండ్‌లో గ్రామీణ వాటా 38 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లో 7.7 శాతం వృద్ధి నమోదు కాగా, పట్టణాల్లో 3.7 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది.
మెట్రోల్లో ఈ–కామర్స్ అమ్మకాలు అధికం
మెట్రో నగరాల్లో సంప్రదాయ దుకాణాల ద్వారా ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు తగ్గగా, ఈ–కామర్స్ విక్రయాలు పెరిగినట్టు నీల్సన్ ఐక్యూ నివేదిక తెలిపింది. ఎనిమిది మెట్రోల్లో ఎఫ్‌ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో ఈ–కామర్స్ వాటా పెరిగినట్టు పేర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఓమ్ని ఛానల్ అమ్మకాలకు (ఆన్‌లైన్–ఆఫ్‌లైన్) ఈ–కామర్స్ కీలక చోదకంగా ఉందని, సంప్రదాయ రిటైల్ వాణిజ్యం సైతం తనవంతు వాటా పోషించినట్టు తెలిపింది.
ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినందున వినియోగం పట్ల ఆశావహంగా ఉన్నట్టు పేర్కొంది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రభావం వచ్చే రెండు త్రైమాసికాల విక్రయాల్లో కనిపించొచ్చని అంచనా వేసింది. ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ జీఎస్‌టీ 2.0 (సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి)కు మారే క్రమంలో హోమ్, పర్సనల్‌కేర్ బ్రాండ్ల విభాగంలో తాత్కాలికంగా వృద్ధి నిదానించినట్టు ఈ నివేదిక వివరించింది. ఇక ఆహారోత్పత్తుల వినియోగంలో వృద్ధి స్థిరంగా 5.4 శాతం స్థాయిలో ఉన్నట్టు తెలిపింది. పార్మసీల ద్వారా విక్రయించే ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల విలువ 14.8 శాతం పెరిగినట్టు, ఇందులో ధరల పెంపు రూపంలో 9.7 శాతం సమకూరినట్టు పేర్కొంది.


