
సెప్టెంబర్ క్వార్టర్‌లో 87,603 యూనిట్లు
ఒక శాతం వృద్ధికి పరిమితం
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 87,603 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఒక శాతం పెరిగినట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ఎలాంటి మందగమనం ఛాయలు లేవంటూ, రానున్న కాలంలో అమ్మకాలు పుంజుకుంటాయన్న అంచనాను వ్యక్తం చేసింది. ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలతో దీనిపై స్పష్టత ఏర్పడుతుందని పేర్కొంది.
వడ్డీ రేట్లు తగ్గడం, జీడీపీ అధిక వృద్ధి, బడ్జెట్‌లో కల్పించిన పన్ను ప్రయోజనాలతో అమ్మకాలు బలంగా కొనసాగినట్టు తెలిపింది. రెపో రేటు 100 బేసిస్ పాయింట్ల మేర రేట్ల తగ్గింపు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్ను తగ్గింపు (జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణ) నేపథ్యంలో పెరిగిన వినియోగ విశ్వాసం ఇళ్ల అమ్మకాలపై ఏ మేరకు ఉంటుందో చూడాల్సి ఉందని పేర్కొంది.
ఇక ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో టాప్–8 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2,57,804 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఒక శాతం తగ్గినట్టు వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), కోల్‌కతా, అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్ గణాంకాలు ఇందులో కలసి ఉన్నాయి.
సంస్థాగత పెట్టుబడులు 11 శాతం అప్
రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు సెప్టెంబర్ త్రైమాసికంలో 11 శాతం పెరిగి 1.27 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తెలిపింది. ఆఫీస్ వసతుల్లోకి మెరుగైన పెట్టుబడుల రాక ఇందుకు దోహదం చేసింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో 1.15 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు పేర్కొంది. 780 మిలియన్ డాలర్లు ఆఫీస్ వసతుల్లోకి రాగా, 320 మిలియన్ డాలర్లు నివాస గృహ ప్రాజెక్టుల్లోకి వచ్చాయి.
భారత ఆరి్థక వ్యవస్థ మూలాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలపై ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్‌యాజ్ఞిక్ తెలిపారు. 1.27 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 60 శాతం దేశీ ఇన్వెస్టర్ల రూపంలో రాగా, మిగిలిన మొత్తం విదేశీ ఇన్వెస్టర్లు సమకూర్చారు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 51 శాతం పెరగ్గా, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 21 శాతం తగ్గాయి. విదేశీ ఇన్వెస్టర్లలో అప్రమత్త ధోరణి నెలకొన్నప్పటికీ, రానున్న రోజుల్లోనూ ఈ రంగంలోకి సంస్థాగత పెట్టుబడుల రాక బలంగా కొనసాగుతుందని యాజి్ఞక్ అంచనా వేశారు.