
సెప్టెంబర్ క్వార్టర్‌లో 7 శాతం అప్
ఏఐ, క్లౌడ్ నిపుణులకు డిమాండ్
క్వెస్ కార్ప్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సీక్వెన్షియల్‌గా జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్‌లో హైరింగ్ 5–7 శాతం పెరగడం దీనికి నిదర్శనం. ఏఐ–డేటా, ప్లాట్‌ఫాం ఇంజినీరింగ్, క్లౌడ్, ఫిన్‌ఆప్స్, సైబర్‌సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ నెలకొంది. క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), తయారీ, ఆటోమోటివ్, ఎనర్జీ, టెక్నాలజీ, హార్డ్‌వేర్ మొదలైన రంగాలు జీసీసీల వృద్ధికి కీలకంగా ఉంటున్నాయి.
భారత్‌లో జీసీసీల పరిణామక్రమం ప్రస్తుతం అత్యంత వ్యూహాత్మక దశలోకి ప్రవేశిస్తోందని క్వెస్ కార్ప్ సీఈవో (ఐటీ స్టాఫింగ్) కపిల్ జోషి తెలిపారు. నియామకాలకు కేటాయించే బడ్జెట్లు ప్రధానంగా ఆదాయార్జన, సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టే విధంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో సుమారు 1,850 జీసీసీలు కార్యకలాపాలు సాగిస్తుండగా, 20 లక్షల మంది పైగా ప్రొఫెషనల్స్ ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 25 లక్షలకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.
నివేదికలో మరిన్ని విశేషాలు ..
→ ఏఐ, డేటా సైన్స్ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు ఎనిమిది శాతం పెరగ్గా, ఫిన్‌ఆప్స్ ఆధారిత క్లౌడ్ సేవల విభాగంలో హైరింగ్ 6 శాతం పెరిగింది.
→ హైదరాబాద్, బెంగళూరులాంటి ప్రథమ శ్రేణి మెట్రో నగరాలు ఏఐ, క్లౌడ్ ఉద్యోగాలకు కీలకంగా నిలుస్తున్నాయి. ఇక కోయంబత్తూరు, కొచ్చి, అహ్మదాబాద్‌లాంటి ద్వితీయ శ్రేణి హబ్‌లలో త్రైమాసికాలవారీగా నియామకాలు 8–9 శాతం పెరిగాయి. తక్కువ వ్యయాలతో సరీ్వసులను అందించేందుకు తోడ్పడే కేంద్రాలుగా ఇలాంటి నగరాలు ఎదుగుతున్నాయి.
→ ఏఐ–డేటాలో అత్యధికంగా 41 శాతం స్థాయిలో నిపుణుల కొరత ఉంది. ప్లాట్‌ఫాం ఇంజినీరింగ్ (39 శాతం), క్లౌడ్–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (25 శాతం), సైబర్‌సెక్యూరిటీ (18 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దీనితో, హైరింగ్ ప్రక్రియలో, ముఖ్యంగా ప్రథమ శ్రేణి నగరాల వెలుపల, మిడ్–సీనియర్ హోదాల్లో నియామకాల్లో జాప్యం జరుగుతోంది.
→ జూలై–సెప్టెంబర్ వ్యవధిలో జీసీసీల్లో నియామకాలకు సంబంధించి దక్షిణాది మెట్రో నగరాలు ముందు వరుసలో ఉన్నాయి. 26 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో నిలి్చంది. తర్వాత స్థానాల్లో హైదరాబాద్ (22 శాతం), పుణె (15 శాతం), చెన్నై (12 శాతం) ఉన్నాయి.
→ బెంగళూరులో ఎక్కువగా అడ్వాన్స్‌డ్ ఏఐ, ఫిన్‌ఆప్స్ ఉద్యోగాలకు, హైదరాబాద్‌లో మలీ్ట–క్లౌడ్ ఇంటిగ్రేషన్ సంబంధ కొలువులకు డిమాండ్ నెలకొంది. పుణె, చెన్నైలో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, ప్లాట్‌ఫాం ఇంటిగ్రేషన్ మొదలైన విభాగాల్లో నిపుణులకు డిమాండ్ ఉంది.