సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అపార్ట్‌మెంట్ల విక్రయాలు, లాంచింగ్స్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని ప్రాప్‌టైగర్ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం (క్యూ3)లో నగరంలో 17,658 యూనిట్లు అమ్ముడుపోయాయని, గతేడాది ఇదే త్రైమాసికంలో విక్రయమైన 11,564 యూనిట్లతో పోలిస్తే ఇది 52.7 శాతం పెరుగుదల అని పేర్కొంది.
అలాగే ఈ క్యూ3లో 12,530 యూనిట్లు లాంచింగ్ అయ్యాయని, గతేడాది ఇదే కాలంలో 8,546 ఫ్లాట్ల లాంచింగ్స్‌తో పోలిస్తే ఇది 46.6 శాతం ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం నగరంలో అపార్ట్‌మెంట్ల చ.అ. ధర సగటున రూ.7,750గా ఉంది. 2024 క్యూలో ఇది రూ.6,858గా ఉంది.
భవిష్యత్తు ఆశాజనకంగా..
హైదరాబాద్ స్థిరాస్తి రంగ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని ప్రాప్‌టైగర్ సర్వే అభిప్రాయపడింది. బలమైన, స్థిరమైన ఆర్థిక పునాదులు, ఐటీ రంగ వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి చోదకాలుగా నిలుస్తున్నాయని వివరించింది.
అలాగే డిజిటలైజ్డ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ విధానంతో పారదర్శకత, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతున్నాయని పేర్కొంది. అలాగే పాత బస్తీ మెట్రో కారిడార్, రీజినల్ రింగ్ రోడ్‌లతో భవిష్యత్తు మరింత ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేసింది.


