హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో ఆధునిక పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా స్థల సమస్య గణనీయంగా తగ్గడంతో పాటు, ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాలు మరింత సురక్షితంగా, క్రమబద్ధంగా ఉంటాయని తెలిపారు. నిర్వహణ, పర్యవేక్షణ పనులు కూడా మరింత సులభంగా నిర్వహించగలిగే అవకాశం ఉంటుందన్నారు.
సాంప్రదాయంగా దిమ్మెల మీద ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలంటే కనీసం 30–35 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందని, కాంక్రిట్ దిమ్మెల నిర్మాణం, క్యూరింగ్ ప్రక్రియకు సుమారు వారం రోజుల సమయం పడుతుందని సీఎండీ వివరించారు. అదనంగా హెచ్‌జీ ఫ్యూజ్ సెట్, డిస్ట్రిబ్యూషన్ బాక్స్, ఏబీ స్విచ్ వంటి ఉపకరణాలను ప్రత్యేకంగా మరో పోల్ పై ఏర్పాటు చేయాల్సి రావడం వల్ల పీటీఆర్ దిమ్మె శుభ్రత లోపించి పోల్ చుట్టూ చెత్త పేరుకుపోయే అవకాశం ఉండటంతో నిర్వహణ పనులు సిబ్బందికి కష్టతరంగా మారుతున్నాయని తెలిపారు.

దీనికి ప్రత్యామ్నాయంగా అమలు చేస్తున్న ఆధునిక పోల్ మౌంటెడ్ విధానంలో, కేవలం 377 మిల్లీమీటర్ల వ్యాసార్థం కలిగిన 11 మీటర్ల గుండ్రటి పోల్‌పై 6-9 అడుగుల ఎత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయవచ్చు. HG ఫ్యూజ్ సెట్, డిస్ట్రిబ్యూషన్ బాక్స్, AB స్విచ్ వంటి అన్ని ఉపకరణాలను పోల్‌పైనే అమర్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ విధానంలో కేవలం ఒక్క రోజులోనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పూర్తి చేయవచ్చు. బకెట్ లాడర్ సహాయంతో కేవలం ఒక్క సిబ్బంది సులభంగా మరియు సురక్షితంగా నిర్వహణ పనులు చేపట్టగలడని తెలిపారు. భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న UG కేబుల్స్‌ను కూడా ఈ పోల్ మౌంటెడ్ ట్రాన్స్‌ఫార్మర్లకు ఎంతో సులభంగా అనుసంధానం చేయవచ్చన్నారు.
ప్రస్తుతం ఈ విధానంలో 63 కేవీఏ, 100 కేవీఏ, 160 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లను 11 మీటర్ల ఎత్తు గల పోల్‌లపై ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇవి ప్రధాన రహదారులపై రవాణాకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇరుకైన గల్లీల్లో రవాణా చేయడంలో కొంత ఇబ్బంది ఎదురవుతున్నదని చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు 9.5 మీటర్ల ఎత్తు గల తక్కువ ఎత్తైన పోల్‌లపై కూడా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ తెలిపారు. అదేవిధంగా అధిక సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లను కూడా ఈ విధానంలో ఏర్పాటు చేసే అవకాశాలపై పరిశీలన జరుగుతోందని వెల్లడించారు.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 304 ప్రాంతాల్లో ఈ ఆధునిక పోల్ మౌంటెడ్ విధానంలో ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 100కి పైగా ట్రాన్స్‌ఫార్మర్లను ఈ విధానంలో విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంస్థ చేపడుతున్న ‘కరెంటోళ్ల ప్రజాబాట’ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రమాదకరంగా లేదా రోడ్లపై అడ్డుగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి, రానున్న రోజుల్లో ఈ నూతన విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తామన్నారు. ఈ నూతన విధానం ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆధునీకరణ, భద్రత, విశ్వసనీయత మరింతగా పెరుగుతాయని ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు.


