breaking news
Rs 10 note
-
కొత్త రూ.10 నోట్లు, మరి పాత నోట్ల సంగతేంటి?
ముంబై : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త రూ.10 నోట్లు జారీచేయడానికి సిద్ధమవుతోంది. చాకోలెట్ బ్రౌన్ రంగులో మహాత్మా గాంధీ సిరీస్‌లో ఈ నోట్లను ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిసింది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కొత్త నోటుపై కొణార్క్ సూర్య దేవాలయం, మహాత్మాగాంధీ చిత్రం, అశోక్ స్తంభం, స్వచ్ఛ భారత్ లోగో వంటి ఫీచర్లు ఉండనున్నాయని ఆర్బీఐ పేర్కొంది. కొత్త నోట్లు తీసుకొస్తున్నప్పటికీ, గతంలో తీసుకొచ్చిన అన్ని రూ.10 నోట్లూ చెల్లుబాటు అవుతాయని తెలిపింది. సెంట్రల్ బ్యాంకు ఇప్పటికే ఈ కొత్త నోట్లను 1 బిలియన్ పీసులను ప్రింట్ చేసినట్టు ఈ విషయం తెలిసిన అధికారులు చెప్పారు. కొత్త రూ.10 నోటుకు సంబంధించి డిజైన్‌ను కూడా ప్రభుత్వం గత వారంలోనే ఆమోదించిందని తెలిపారు. ప్రస్తుతం మారుస్తున్న పాత రూ.10 నోటు డిజైన్‌ను 2015లో రూపొందించారు. గతేడాది ఆగస్టులో మహాత్మాగాంధీ సిరీస్‌లో ఆర్బీఐ కొత్త రూ.200, రూ.50 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నకిలీలకు వ్యతిరేకంగా ఆర్బీఐ కొత్త డిజైన్‌లో తక్కువ డినామినేషన్ నోట్లను పునఃప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే కొత్త రూ.10 నోట్లు, కొత్త డిజైన్‌లో మార్కెట్లోకి వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. నకిలీలను, అవినీతిని నిర్మూలించడానికే 2016 నవంబర్ 8న ప్రభుత్వం పెద్దనోట్లు రూ.1000, రూ.500ను రద్దు చేసింది. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని వెనక్కితీసుకుంది. అప్పటి నుంచి కొత్త నోట్లను ప్రవేశపెట్టడం, పాత వాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం చేస్తున్నాయి. డిసెంబర్ 8 నాటికి ఆర్బీఐ 16.96 బిలియన్ పీసుల రూ.500 నోట్లు, 3.6 బిలియన్ పీసుల రూ.2000నోట్లను ప్రింట్ చేసినట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ లోక్‌సభలో తెలిపింది. ఈ నోట్ల మొత్తం విలువ రూ.15.79 ట్రిలియన్లు. -
పది రూపాయలకోసం..
పుణే: స్వల్ప వివాదంతో క్షణికావేశానికిలోనైన ఓ మహిళ తన బిడ్డను అనాధను చేసింది. పుణే, జనవాడీ ప్రాంతానికి చెందిన సుందరమ్మ(30)కేవలం పది రూపాయల కోసం ప్రాణాలనే తీసుకుంది. పొరుగు వారు చేసిన అవమానాన్ని, పరాభవాన్ని భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ నిరుపేద కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే... సేనాపతి బాపట్ రోడ్ లో నివసించే సుందరమ్మ, పరశురామ్ దంపతులు. పరశురామ్ సాధారణ కార్మికుడుకాగా, వీరికి రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. రాహుల్ పది రూపాయలు తీసుకొని పచారీ కొట్టుకు బయలుదేరాడు. ఇంతలో పొరుగువారి పిల్లవాడు రాహుల్ ను పలకరించినట్టే పలకరించి ఆ పది రూపాయలు బలవంతంగా లాక్కున్నాడు. ఈ విషయాన్ని తల్లికి ఫిర్యాదు చేశాడు రాహుల్. అయితే ఆ నోటును తిరిగి తీసుకునే ప్రయత్నం చేసింది సుందరమ్మ. దీంతో పొరుగువారు ఆమెతో వాగ్వాదానికి దిగారు. దారుణంగా అవమానించి దాడిచేశారు. చంపేస్తామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె డీజిల్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచింది. దీంతో ఆమె భర్త పరశురామ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పరశురామ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు హరీష్ లక్ష్మణ్ గైక్వాడ్ (19) మరో 35 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. నిందితుల్లో 12 ఏళ్ల మైనర్ బాలికను చేర్చారు.


