పది రూపాయలకోసం..
పుణే, జనవాడీ ప్రాంతానికి చెందిన సుందరమ్మ(30)కేవలం పది రూపాయల కోసం ప్రాణాలనే తీసుకుంది.
పుణే: స్వల్ప వివాదంతో క్షణికావేశానికిలోనైన ఓ మహిళ తన బిడ్డను అనాధను చేసింది. పుణే, జనవాడీ ప్రాంతానికి చెందిన సుందరమ్మ(30)కేవలం పది రూపాయల కోసం ప్రాణాలనే తీసుకుంది. పొరుగు వారు చేసిన అవమానాన్ని, పరాభవాన్ని భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ నిరుపేద కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
వివరాల్లోకి వెళితే... సేనాపతి బాపట్ రోడ్ లో నివసించే సుందరమ్మ, పరశురామ్ దంపతులు. పరశురామ్ సాధారణ కార్మికుడుకాగా, వీరికి రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. రాహుల్ పది రూపాయలు తీసుకొని పచారీ కొట్టుకు బయలుదేరాడు. ఇంతలో పొరుగువారి పిల్లవాడు రాహుల్ ను పలకరించినట్టే పలకరించి ఆ పది రూపాయలు బలవంతంగా లాక్కున్నాడు. ఈ విషయాన్ని తల్లికి ఫిర్యాదు చేశాడు రాహుల్. అయితే ఆ నోటును తిరిగి తీసుకునే ప్రయత్నం చేసింది సుందరమ్మ. దీంతో పొరుగువారు ఆమెతో వాగ్వాదానికి దిగారు. దారుణంగా అవమానించి దాడిచేశారు. చంపేస్తామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె డీజిల్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచింది. దీంతో ఆమె భర్త పరశురామ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పరశురామ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు హరీష్ లక్ష్మణ్ గైక్వాడ్ (19) మరో 35 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. నిందితుల్లో 12 ఏళ్ల మైనర్ బాలికను చేర్చారు.


